iDreamPost

Cobra movie Review కోబ్రా రివ్యూ

Cobra movie Review కోబ్రా రివ్యూ

హిట్టు ఫ్లాపుతో సంబంధం అతను పడే కష్టానికి చియాన్ విక్రమ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడో అపరిచితుడు బ్లాక్ బస్టర్ సాధించాక ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటీ లేకపోయినా పండగ రోజు థియేటర్లకు జనం వచ్చారంటే కేవలం తన ఇమేజే కారణం. కోబ్రా మీద ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు కానీ ట్రైలర్ వచ్చాక హైప్ పెరిగింది. చిత్ర విచిత్ర గెటప్పులతో మరోసారి విక్రమ్ ఏదో గొప్ప ప్రయోగం చేశాడన్న అభిప్రాయం కలిగింది. దానికి తోడు దర్శకుడి ట్రాక్ రికార్డు, కెజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి, హైదరాబాద్ కొచ్చి మరీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడంతో కొంత బజ్ వచ్చింది. ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

ఎక్కడో స్కాట్ ల్యాండ్ లో ఆ దేశపు యువరాజుని చర్చ్ ఫాదర్ వేషంలో వెళ్లి కోబ్రా(విక్రమ్)చంపేస్తాడు. దానికన్నా ముందు ఇక్కడ ఒడిశా ముఖ్యమంత్రి హత్య కూడా అదే తరహాలో జరుగుతుంది. ఈ హత్యల వెనుక ఎవరున్నారో కనిపెట్టేందుకు ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్)ఇండియాకు వస్తాడు. ఇక్కడ మాది(విక్రమ్)అనే లెక్కల టీచర్ కు ఆ మర్డర్లకు ఏదో కనెక్షన్ ఉందన్న అనుమానం మెల్లగా బలపడుతుంది. మాది ప్రేమించిన అమ్మాయి(శ్రీనిధి శెట్టి)తో నిశ్చితార్థం జరిగిన రోజే మాది పోలీసులకు దొరికిపోతాడు. దీంతో విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. ఇక్కడి నుంచి తెరమీద చూడాల్సిన అసలు స్టోరీ స్టార్టవుతుంది

నటీనటులు

విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పేందుకు వర్ణించేందుకు ఏమి లేదు. గొప్పగా జీవించేశాడు. ఏదో దశావతారంలో కమల్ హాసన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి అజయ్ జ్ఞానముత్తు తన నెరేషన్ టాలెంట్ తో ఒప్పించినట్టు ఉన్నాడు కానీ చియాన్ కష్టమంతా బ్యాడ్ ప్రోడక్ట్ వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. డ్యూయల్ షేడ్స్ ని చక్కగా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని చేతులారా వృథా చేసుకున్నారు. ఫ్యాన్స్ ని విక్రమ్ ఎక్కడా నిరాశపరచలేదు. కాకపోతే ఇలాంటి గతంలో చాలా చూశాం కదా అనే ఫీలింగ్ మూడ్ ని పదే పదే ఇబ్బంది పెడుతుంది. తమిళ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం కానీ మనకైతే ఇది అతకని వ్యవహారమే

శ్రీనిధి శెట్టి కెజిఎఫ్ టైంలోనే ఒప్పుకున్న ప్రాజెక్టు కావడంతో బహుశా ఇలాంటి పాత్ర ఇప్పుడైతే ఖచ్చితంగా నో చెప్పేది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చెప్పుకోదగ్గ సీన్లు పడినప్పటికీ రెండో సగంలో ఏదో మొక్కుబడిగా కనిపించడం తప్ప చేసిందేమీ లేదు. వయసు గ్యాప్ ఎక్కువగా ఉన్నా విక్రమ్ జోడిగా మరీ ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఇర్ఫాన్ పఠాన్ దిట్టంగా ఉన్నాడు. ఒక క్రికెటర్ నుంచి ఎక్స్ ప్రెషన్స్ ఎక్కువగా ఆశించలేం కాబట్టి నిండైన విగ్రహాన్ని అందంగా చూపించి మేనేజ్ చేశారు. మెయిన్ విలన్ రోషన్ మాథ్యుది పరమ రొటీన్ క్యారెక్టర్, కెఎస్ రవికుమార్, సర్జానో ఖలీద్, మృణాలిని రవి, మీనాక్షి గోవిందరాజన్, జాన్ విజయ్ తదితరులు ఎవరూ స్పెషల్ గా నిలవలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు అజయ్ జ్ఞానముత్తులో మంచి టెక్నీషియన్ ఉన్న మాట వాస్తవం. ఆ కారణంగానే అసలు ఎవరూ పట్టించుకోరనుకున్న డెమోంటీ కాలనీ తెలుగులోనూ బాగా ఆడింది. నయనతార అనురాగ్ కశ్యప్ లతో తీసిన అంజలి సిబిఐకి సైతం ప్రశంసలు దక్కాయి. అయితే ఇంత టాలెంట్ ఉన్న అజయ్ అవసరం లేని విక్రమ్ ఇమేజ్ చట్రంలో తానూ ఇరుక్కుపోయి ఒక అరిగిపోయిన మూస కథను హై స్టాండర్డ్స్ తో ఇచ్చే ప్రయత్నం చేశాడు. కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే నిర్మాత దొరికినప్పుడు ముందు యాక్షన్ ఎపిసోడ్స్ రాసుకోకూడదు. స్క్రిప్ట్ ప్రాపర్ గా లాక్ అయ్యాక దానికి తగ్గట్టు ఎక్కడెక్కడ భారీతనం కావాలో అక్కడే దాన్ని జొప్పించాలి.

కానీ అజయ్ జ్ఞానముత్తు ఈ ప్రాధమిక సూత్రాన్ని గాలికి వదిలేశాడు. టేకాఫ్ చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. విదేశాల్లో ఉన్న ఓ ప్రిన్స్ ని హీరో చంపాక మనమో రేంజ్ లో కమర్షియల్ డ్రామాని ఎక్స్ పెక్ట్ చేస్తాం. దానికి తగ్గట్టే ఫస్ట్ హాఫ్ అదే టోన్ లో సాగుతుంది. కొన్ని లాజిక్స్ గాలికి వదిలేసినా సరే ఇంకా స్ట్రాంగ్ కంటెంట్ ఏదో మనల్ని సర్ ప్రైజ్ చేయబోతోందన్న ఆసక్తితో ఎదురు చూస్తాం. సరిగ్గా ఇక్కడే అజయ్ చేతులు పైకెత్తేశాడు. ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక అవసరం లేని ఎమోషన్లతో, అక్కర్లేని సాగతీతతో ఏదో గొప్ప భావోద్వేగాలను రిజిస్టర్ చేస్తున్నాననే భ్రమలో విసుగు పుట్టించాడు. అందుకే విక్రమ్ ఎంత ఎఫర్ట్ పెట్టినా వేస్ట్ అయిపోయింది.

విక్రమ్ తో డీల్ చేస్తున్న దర్శకులు ఇప్పటికీ అపరిచితుడు హ్యాంగోవర్ లోనే ఉండటం దురదృష్టం. ఒక బలమైన హీరో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో ఒక ట్రాజెడీ, దానికి హీరో పెద్దయ్యాక ప్రతీకారం తీర్చుకోవడం ఇలా ఇదే లైన్ తో ఎన్నిసార్లు తీస్తారు. రివెంజ్ డ్రామాలు సరిగా చూపిస్తే ఎప్పటికీ బోర్ కొట్టవు. వాటికి సరైన ట్రీట్మెంట్ అవసరం. కోబ్రా పాత్రను ఎస్టాబ్లిష్ చేశాక అదే స్థాయిలో అతని గతం ఉంటుందని సగటు ప్రేక్షకుడు ఎవరైనా ఆశిస్తాడు. అంతే తప్ప పాత సినిమాల కిచిడీ కలిపి ఇదే విందు భోజనం అంటే విస్తరాకు విసిరేసి కొడతాడు. కోబ్రాలో అజయ్ చేసిన తప్పు ఇదే. విక్రమ్ పాత్రకు ఇచ్చిన ట్విస్టు స్క్రీన్ ప్లేలో లేకపోవడమే ప్రధాన మైనస్

ప్రేక్షకుడు థియేటర్ కు వచ్చేది ఎంటర్ టైన్ అవ్వడానికి. అంతే తప్ప కాలేజీలాగా జ్ఞానం సంపాదించుకోవడానికి కాదు. హీరోని మాథ్స్ టీచర్ గా చూపించి అతని అపారమైన తెలివితేటలను క్రైమ్ చేయడానికి వాడుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నిజంగా బాగుంది. కానీ దాన్ని కన్విన్సింగ్ గా చెప్పాలి. అంతే తప్ప మన మేథాశక్తిని ప్రదర్శిస్తే దెబ్బ తినేది నిర్మాతే. ఇలా చేయబోయే అజయ్ ముప్పాతిక భాగానికి పైగా విపరీతమైన కన్ఫ్యూజన్ కి గురి చేస్తాడు. ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్లినా సరే మెదడుని వేడెక్కించి సవాలక్ష ప్రశ్నలు తలెత్తేలా చేస్తాడు. దీనికి బదులు విజయ్ అదిరింది లాగా రొటీన్ ఫ్లేవర్ లో తీసుకుంటూ పోయినా కనీసం మాస్ సపోర్ట్ అయినా దక్కేది.

హీరోలు పడే కష్టానికి టికెట్లు కొనే రోజులు కావివి. కమల్ హాసన్ ఉత్తమ విలన్, చిరంజీవి ఆపద్బాంధవుడు ఆయా హీరోల కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అయినప్పటికీ వాటిని కనీసం ఫ్యాన్స్ కూడా ఆదరించలేదు. విక్రమ్ ఈ సత్యాన్ని గుర్తించి కూడా పదే పదే అదే తప్పు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. దశావతారంలో పది వేషాలను జనం మెచ్చారంటే అందులో బిగిసడలని కథనం, వాటిని చాలా తెలివిగా కలుపుకుంటూపోయే తెలివైన ప్రెజెంటేషన్ ఉన్నాయి. కానీ కోబ్రాలో ఏదో గ్రాండియర్ కోసం తప్ప ఇది అవసరమా అనిపించేలా కొన్ని గెటప్ లు మరీ సిల్లీగా ఉన్నాయి. నిజంగా అవి విక్రమే వేశాడా లేక మనల్ని మోసం చేశారా అనే అనుమానం కలిగితే ఆది మీ తప్పు కాదు

ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మొదట్లో ఎత్తుకున్న పాయింట్ కి తర్వాత చూపించే కథాక్రమానికి ఏ మాత్రం సరైన లింక్ లేకపోవడం అజయ్ చేసిన మరొక బ్లండర్. కోబ్రా ఇంటర్నేషనల్ క్రిమినల్ రిషిని చంపాలనుకోవడం వెనుక గల కారణాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత తేలిగ్గా చంపే వ్యవహారాన్ని సెకండ్ హాఫ్ లో ముడిపెట్టడం మర్చిపోయాడు. ఏదో మొక్కుబడిగా రెండు మూడు డైలాగుల్లో సర్దే ప్రయత్నం చేశాడు కానీ అసలు కోబ్రా ఇంత రిస్క్ చేసి దేశ విదేశాలు తిరిగి పొడిచిందేమో ఎంత జుత్తు పీకున్నా అర్థం కాదు. హత్యలు చేశాడు సరే దానికి జస్టిఫికేషన్ జరగాలిగా. షూటింగ్ కు వెళ్లబోయే ముందు అజయ్ జ్ఞానముత్తు శంకర్ జెంటిల్ మెన్, భారతీయుడు సినిమాలు ఓసారి చూసుంటే బాగుండేది.

ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత తన పనితనం కొంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో చూపించారు. పాటలు పర్వాలేదు కానీ వాటి బ్యాడ్ ప్లేస్ మెంట్ వల్ల మొబైల్ చెకింగ్ కి పనికొచ్చాయి. భువన్ శ్రీనివాస్ – హరీష్ కన్నన్ ఛాయాగ్రహణం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని తెరమీద చూపించింది. జాన్ అబ్రహం ఎడిటింగ్ మాత్రం తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు. మూడు గంటల మూడు నిమిషాల నిడివిలో కనీసం ఓ అరగంట కోతకు ఛాన్స్ ఉంది. ఆర్ట్ వర్క్ పనితనం బాగుంది. టెక్నికల్ టీమ్ ని బాగా సెట్ చేసుకున్నారు. నిర్మాణ విలువలు భారీగానే ఉన్నాయి. అక్కడక్కడా కాంప్రోమైజ్ అయ్యారు కానీ ఇంతోటి కథను నమ్మి దీనికీమాత్రం ఖర్చు పెట్టడం గొప్పే

ప్లస్ గా అనిపించేవి

విక్రమ్ నటన
యాక్షన్ బ్లాక్స్
భారీతనం

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
సిల్లీ లాజిక్స్
సాగదీసిన ఫ్లాష్ బ్యాక్
మూడు గంటల నిడివి

కంక్లూజన్

టైటిల్ ని బట్టి, ట్రైలర్ ని చూసి ఇదేదో గొప్ప యాక్షన్ థ్రిల్లర్ అనుకుని థియేటర్ లో అడుగు పెడితే మాత్రం నిరాశపరచడంలో ఏ మాత్రం నిరాశపరచని సినిమా ఈ కోబ్రా. కేవలం నటన, రకరకాల గెటప్పులతో మహా అయితే మొదటి రోజు థియేటర్ కు ప్రేక్షకులను రప్పించగలం కానీ అంతకు మించి బలమైన కంటెంట్ ఉంటే తప్ప సినిమాలు ఆడవని ఎప్పుడో తెలుసుకున్న విక్రమ్ ఇంత అనుభవం వచ్చాక కూడా అవే తప్పులు రిపీట్ చేయడం బ్యాడ్ లక్. మనకు సాంబార్ ఎంత ఇష్టమైనా అది వేడిగా ఉన్నప్పుడే దాని రుచిని ఎంజాయ్ చేయగలం. అంతేతప్ప నెలల తరబడి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి వడ్డిస్తే ఆసుపత్రిపాలవ్వడం ఖాయం ఈ కోబ్రా లాగా

ఒక్క మాటలో : విసిగించే కోబ్రా

రేటింగ్ 2 / 5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి