iDreamPost
iDreamPost
తమిళనాడులో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కుమార్ కు ఇక్కడ మార్కెట్ తక్కువే అయినప్పటికీ తెలుగులోనూ చెప్పుకోదగ్గ అభిమానులున్నారు. అందుకే వలిమై మీద అంతో ఇంతో ఆసక్తి మన ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అయితే కేవలం ఒక్క రోజు గ్యాప్ తో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రానుండటంతో దీని గురించి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోయారు. కానీ అరవ రాష్ట్రం మాత్రం వలిమై ఫీవర్ తో ఊగిపోతోంది. ఆరెక్స్ 100 కార్తికేయ ఇందులో విలన్ గా నటించడం ఒక ఆకర్షణ కాగా నిర్మాత బోనీ కపూర్ వినోత్ దర్శకత్వంలో కోట్ల రూపాయల బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు. మరి ఇది ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి
కథ
వైజాగ్ లో అంతుచిక్కని రీతిలో హత్యలు, దొంగతనాలు జరుగుతుంటాయి. స్పోర్ట్స్ బైక్స్ వాడే గ్యాంగ్ ఒకటి దీని వెనుక ఉంటుంది. వీటిని నియంత్రించేందుకు వస్తాడు అసిస్టెంట్ కమీషనర్ అర్జున్(అజిత్). ఎంత ప్రయత్నించినా వాళ్ళ ఆగడాలు ఆగకపోగా ఎందరో అమాయకుల ప్రాణాలు బలవుతాయి. ఇదంతా టెక్నాలజీ వాడి నడిపిస్తున్నది ఓ గ్యాంగ్ లీడర్(కార్తికేయ)అని గుర్తిస్తాడు అర్జున్. వాళ్ళను పట్టుకునే క్రమంలో ఇతని స్వంత తమ్ముడితో పాటు కుటుంబమే ప్రమాదంలో పడుతుంది. మరి ఆ దుర్మార్గుల ఆట ఎలా కట్టించాడు అన్నది సినిమాలో చూడాలి
నటీనటులు
అజిత్ కుమార్ నటన మనకు దశాబ్దాలుగా పరిచయమే. ప్రేమలేఖతో అప్పట్లో ఇక్కడి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. మొదట్లో ఇలాంటి లవ్ స్టోరీస్ ఎక్కువగా చేసిన అజిత్ కాలక్రమంలో తనకొచ్చిన మాస్ ఇమేజ్ కి తగ్గట్టు యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేయడం పెరిగింది. ఈ వలిమై కూడా అదే కోవలోకి చేరుతుంది. ఇది స్టైలిష్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఛేజ్ డ్రామా కాబట్టి నిజానికి అజిత్ గొప్పగా పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా ఏమి లేదు. ఇంత వయసులోనూ ఇలాంటి రిస్కీ రోల్స్ ఒప్పుకోవడం గొప్పే. గ్యాంబ్లర్ స్థాయిలో ఆశించకుండా సాధారణ కోణంలో చూస్తే అజిత్ కు వలిమై ఒక స్పెషల్ మూవీగా నిలిచే మాట వాస్తవం.
టాలీవుడ్ హీరో కార్తికేయకు విలన్ గా ఇది చాలా పెద్ద బ్రేక్. సినిమా ఏ స్థాయికి వెళ్తుందనేది పక్కనపెడితే అసలు భాషే రాని చోట గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తో అజిత్ తో సమానంగా జర్నీ చేసే క్యారెక్టర్ కి న్యాయం చేకూర్చాడు. హ్యూమా ఖురేషి హీరోయిన్ కాదు కానీ ఆ లోటుని కొంత వరకు పూడ్చే ప్రయత్నం చేసింది. తల్లి పాత్ర చేసిన సుమిత్ర సహజంగా ఉన్నారు. అచ్యుత్ కుమార్, రాజ్ అయ్యప్ప, చైత్ర రెడ్డి, పుగజి, సెల్వ, నవజీతన్, జిఎంసుందర్, ధృవన్ తదితరులు పాత్రలకు తగ్గట్టు ఉన్నారు. తమ్ముడి పాత్రధారి ఎమోషనల్ గా కొంత వీక్ అనిపిస్తాడు. ఇంకెవరి ప్రత్యేక ప్రస్తావన అవసరం లేదు.
డైరెక్టర్ అండ్ టీమ్
బైకులేసుకుని ఒక గ్యాంగ్ చేసే దొంగతనాల చుట్టూ సినిమాలు రావడం కొత్తేమి కాదు. బాలీవుడ్ లో వచ్చిన ధూమ్ దీనికి మార్గదర్శిగా నిలిచింది. తెలుగులోనూ నాగార్జున సూపర్ లాంటి ప్రయత్నాలు చేశారు. వలిమై కూడా ఇదే కోవలోకి చెందుతుంది. కాకపోతే పైన చెప్పిన వాటికి దీనికి తేడా ముందుగా మేకింగ్ అని చెప్పాలి. టెక్నికల్ గా అద్భుతం అనిపించే స్థాయిలో దర్శకుడు వినోత్ తెరకెక్కించిన తీరుకు వాహ్ అనకుండా ఉండలేం. అంత గొప్పగా ఆ ఎపిసోడ్స్ వచ్చాయి. ఇంటర్వల్ బ్లాక్, బస్సు ఛేజింగ్ ఇవన్నీ కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత లెవెల్ లో ఉన్నాయి. సాంకేతికంగా ఇంత గొప్పగా ఆలోచించినందుకు వినోత్ మెచ్చుకోలు అందుకోవడానికి అర్హుడు
ప్రధానంగా పాజిటివ్ గా చెప్పుకొనే అంశం ఇందులో ఇదొక్కటే. అజిత్ లాంటి స్టార్ హీరోని డీల్ చేస్తున్నప్పుడు ఎంత క్రియేటివిటీ ఉన్న దర్శకుడైనా కమర్షియల్ మీటర్ ని ఫాలో కాక తప్పదు. వినోత్ సైతం దీని బారిన పడ్డాడు. అవసరం లేని ఎలివేషన్లు పెట్టి ఫస్ట్ ఫైట్ పెట్టడం, ఆ వెంటనే అజిత్ తో జాతరలో నైట్ ఎఫెక్ట్ తో రాని డ్యాన్సును వేయించడం ఇవన్నీ అభిమానుల కోసమే. మనకు అజిత్ తో కనెట్టివిటీ తక్కువ కాబట్టి ఇవన్నీ చాలా మాములుగా అనిపిస్తాయి. అసలు కథకు ప్రారంభంలోనే అడ్డంకిగా తోస్తాయి. నిజానికి ఇవి లేకున్నా ఇబ్బంది ఉండేది కాదు. కాని మాస్ ఆడియన్స్ కోసం పెట్టాలి కాబట్టి తప్పనిసరై ఇరికించినట్టు అనిపిస్తుంది.
ఇలాంటి థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాలో సెంటిమెంట్, ఎమోషన్లకు అంతగా చోటు ఉండదు. కానీ వినోత్ వాటిని బలవంతంగా ఇరికించిన తీరు చాలా మాములుగా ఉండటంతో వాటి తాలూకు భావోద్వేగాలను అసలు కనెక్ట్ కాము. పైగా కీలకమైన తమ్ముడి క్యారెక్టరైజేషన్ ని నిరుద్యోగంతో లింక్ చేసిన తీరు సింక్ అవ్వలేదు. పైగా ఎప్పుడో కమల్ హాసన్ ఆకలి రాజ్యం తరహాలో మొదలుపెట్టి తర్వాత పదే పదే ఉద్యోగం రాని యువత అంతా నేరాలు ఘోరాలు చేస్తారనేలా ప్రొజెక్టు చేయడం అంతగా నప్పలేదు. బహుశా చెన్నైలోనో లేదా తమిళనాడులోని ఇంకో నగరంలోనే పరిస్థితి అలా ఉందేమో మనకు తెలియదు కానీ ఈ ఫ్యామిలీ ట్రాక్ మొత్తం నిడివిని పెంచడానికి తప్ప అంతగా ఉపయోగపడలేదు
ఏమైనా సౌత్ సినిమా బాలీవుడ్ ని మించిపోయేలా ఇలాంటి సాహసాలు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. అఫ్కోర్స్ నిర్మాత బోనీ కపూర్ హిందీ వాడే అయినప్పటికి ఒప్పుకున్న హీరో ఇక్కడి వాడే కాబట్టి ఇలాంటివి ఇంకా రావాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే కథా కథనాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు, ల్యాగ్ రాకుండా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడు గంటల నిడివి ఈ ప్లాట్ కు ఎక్కువ. కనీసం ఓ అరగంట ఈజీగా కోత వేసుంటే ఇంకా క్రిస్పీగా మారి బెటర్ అనిపించేది. అయినా తల్లి సెంటిమెంట్ తమిళ సినిమాల్లో కంపల్సరీ ఫ్యాక్టర్ గా మారిపోయింది కాబోలు ఎలాగోలా కథలో దాన్ని భాగం చేయడం కామన్ అయిపోయింది.
మొత్తానికి వలిమై యాక్షన్ లవర్స్ ని సంతృప్తి పరుస్తుంది కానీ సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా మింగుడు పడని వ్యవహారమే. అజిత్ వయసు తాలూకు ప్రభావం ఆయన శరీరం, ఎక్స్ ప్రెషన్లలో కనిపించడం ఇతర భాషల్లో కొంత మైనస్ అవ్వొచ్చు. కానీ అర్జున్ పాత్రకు బెస్ట్ ఛాయిస్ అనిపించుకునేందుకు కావాల్సిన ఔట్ ఫుట్ కి బాగా కష్టపడ్డారు. కార్తికేయ పాత్ర స్ట్రాంగ్ గానే అనిపించుకుంది కానీ ఇదే వినోత్ తీసిన ఖాకీ రేంజ్ ఇంటెన్సిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. ట్విస్టులు కొన్ని బాగున్నప్పటికీ అవి థ్రిల్ ఇచ్చే స్థాయిలో ఇంకా ఉంటే బాగుండేది. ఫైనల్ గా వలిమై పరిమిత అంచనాలు పెట్టుకుని యాక్షన్ ని ఎంజాయ్ చేయడానికి సరిపడా కంటెంట్ తో ఉంది
యువన్ శంకర్ రాజా రెండు పాటలు సోసో. మళ్లీ గుర్తుకు రమ్మన్నా రావు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ గా కుదిరింది. అయినా అతని స్థాయి కంటే కాస్త తక్కువే అనిపిస్తుంది. నిరవ్ షా ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఫ్రేమ్ లో ఆయన కష్టం తెలుస్తుంది. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ ఇంత లెన్త్ కి బాధ్యత వహించాల్సిందే. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అదరగొట్టారు. ఫైట్స్ ఫెంటాస్టిక్ అనిపించుకున్నాయి. నిర్మాణ విలువలు మాత్రం సబ్జెక్ట్ డిమాండ్ కు తగ్గట్టు ఎక్కడా రాజీ పడలేదు.
ప్లస్ గా అనిపించేవి
అజిత్ & కార్తికేయ
యాక్షన్ ఎపిసోడ్స్
ప్రీ ఇంటర్వల్ బ్లాక్
ఛాయాగ్రహణం
మైనస్ గా తోచేవి
ఫ్యామిలీ డ్రామా
నిడివి
కనెక్ట్ కానీ ఎమోషన్స్
లాజిక్స్
కంక్లూజన్
వలిమై యాక్షన్ లవర్స్ కు మంచి ఛాయిస్ అనడంలో సందేహం అక్కర్లేదు. కానీ దాంతో పాటు అన్ని ఉండే కమర్షియల్ ప్యాకేజీ కావాలంటే మాత్రం నిరాశ తప్పదు. అవి కూడా ఉన్నాయి మన ఆడియెన్స్ టేస్ట్ కు తగ్గట్టు పూర్తి స్థాయిలో లేకపోవడం ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. రేపు భీమ్లా నాయక్ వస్తోంది కాబట్టి ఆ తాకిడిలో ఈ వలిమై నిలవడం కష్టమే. ఒకవేళ దాని ఫలితమూ ఇలాగే ఉంటే తప్ప అజిత్ చాలా గ్యాప్ తర్వాత హిట్టు దక్కడం కష్టమే. గ్రాండియర్, విజువల్ స్టంట్స్ మీకు బాగా ఇష్టమైతే వలిమై మీద లుక్ వేయండి.
ఒక్క లైన్ లో – యాక్షన్ కు ‘జై’ మిగిలింది ‘నై’
Also Read : Son Of India Review : సన్ ఆఫ్ ఇండియా రివ్యూ