iDreamPost

అధికారిక కార్యక్రమం లేకుండానే రాజ్యసభ సభ్యుల రిటైర్మెంట్‌

అధికారిక కార్యక్రమం లేకుండానే రాజ్యసభ సభ్యుల రిటైర్మెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి, మహ్మద్‌ అలీ ఖాన్‌ (కాంగ్రెస్‌) తోటసీతారామలక్ష్మి (టీడీపీ), కేశవరావు (టీఆర్‌ఎస్‌)ల పదవీ కాలం గురువారం(ఏప్రిల్‌9)తో ముగిసింది. సాధారణంగా ఆరేళ్లు రాజ్యసభలో సేవలందించినందుకు గాను సభ కృతజ్ఞతలు తెలపడంతోపాటు ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం జరిగేది. అయితే కరోనా నేపథ్యంలో రాజ్యసభ చరిత్రలో తొలిసారి ఎలాంటి కార్యక్రమం లేకుండా వారు తమ ప్రయాణానికి ముగింపు పలకాల్సి వచ్చింది.

వీరిలో కేశవరావు మాత్రమే మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగతా ముగ్గురికి ఆయా పార్టీల నుంచి అవకాశం దక్కలేదు. టి.సుబ్బరామిరెడ్డి చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు. అయితే అప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ సభ్యులను నిర్ణయించుకోవడంతో ఆయనకు అవకాశం రాలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ఏపీ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, అంబానీ అనుచరుడు పరిమల్‌ నత్వానీ పేర్లను ప్రతిపాదించింది. ఆ మేరకు వారు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి నలుగురు గెలవడం గ్యారెంటీ. అయితే చివరి నిమిషంలో బలం లేకపోయినా టీడీపీ నుంచి వర్ల రామయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవడం లాంఛనమే.ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం ఆరుకు చేరుకోనుంది.

ఇక తెలుగుదేశం నుంచి ఏకైన వ్యక్తి కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి 2016లో రాజ్యసభకు ఎన్నికైన టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎమ్‌ రమేశ్‌ 2019 చివర్లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీతో ఉన్న పొత్తులో భాగంగా గతంలో ఆయనకు అవకాశం వచ్చింది.
అలాగే తెలంగాణ నుంచి రిటైర్డ్‌ అవుతున్న కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహనరావుకు కూడా మరోసారి అవకాశం దక్కని విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి