iDreamPost

Relangi Venkata Ramaiah : రేలంగి అంటే రీచార్జి!

Relangi  Venkata Ramaiah : రేలంగి అంటే రీచార్జి!

రేలంగి. చిన్న‌ప్పుడు ఈ పేరు వింటేనే కామెడీ, క‌న్ఫ్యూజ‌న్. ఇంటి పేరు, ఊరి పేర్ల‌తో మ‌నుషుల్ని పిలుస్తార‌ని తెలియ‌దు. రేలంగి అనే వూరు ఉంద‌ని అస‌లు తెలియదు. మాది క‌ర్నాట‌క బోర్డ‌ర్ కాబ‌ట్టి క‌న్న‌డ యాస‌లో రైలంగి అనేవాళ్లు. రైలు, అంగి ఈ రెంటికి మ్యాచ్ చేసుకునేవాన్ని. రైలు ఇంజ‌న్‌కి అంగీ తొడిగితే ఎలా వుంటుంది? కొల‌త‌లు ఎట్లా తీస్తారు? ద‌ర్జీ కుట్ట‌డం ఎలా? రేలంగి అంటే చొక్కా తొడుక్కున్న ఇంజ‌న్ ప్ర‌త్య‌క్ష‌మయ్యేది.

రాయ‌దుర్గంలో కొంత కాలం నూర్‌టూరింగ్ టాకీస్ జ‌నాల్ని రంజింప‌చేసి మాయ‌మైంది. తెర‌పై మ‌నం నిమ‌గ్న‌మై వుండ‌గా, గాలి వాన వ‌స్తే తెరే మ‌న‌పైకి దూకుతుంది. తెల్ల‌వాళ్లు మ‌న దేశాన్ని ఆక్రమించిన‌ట్టు. న‌ల్లులు న‌లుదిక్కులా సామ్రాజ్య వాదంతో నెత్తురు కోసం ఎదురు చూసేవి. పిర్ర‌లు వాచిపోయేలా కుడుతున్నా, జ‌నం ఎన్టీఆర్ క‌త్తి యుద్ధాన్ని చూసి ఆనందించి ఈల‌లు వేసేవాళ్లు.

ఈ టెంట్ ప్ర‌త్యేక‌త ఏమంటే గేట్‌కీప‌ర్ అనే ప్రాణి అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోవ‌డంతో అనేక ప్రాణులు సినిమా చూడ్డానికి వ‌చ్చేవి. ఒక‌సారి ఎన్టీఆర్ ఒంటిచేత్తో క‌త్తి తిప్పుతూ, మ‌ధ్య‌మ‌ధ్య దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఫైటింగ్ చేస్తూ వుంటే , నాలుగైదు కుక్క‌లు భీక‌ర పోరాటం చేస్తూ లోనికి వ‌చ్చాయి. జ‌నం చెల్లాచెదురై , మ‌ళ్లీ ధైర్యం తెచ్చుకుని సినిమా చూశారు. భామా విజ‌యం అనే సినిమాలోకి ఒక అవు ప్ర‌వేశించి ప్రేక్ష‌కుల మీద న‌డుస్తూ వెళ్ల‌డం కూడా గుర్తుంది.

ఇంత గొప్ప టెంట్‌లో విజ‌యా వారి సినిమాల‌న్నీ వ‌రుస‌గా చూశాను. మాయాబ‌జార్‌, పాతాళ‌భైర‌వి, మిస్స‌మ్మ చూసిన త‌ర్వాత రేలంగి వీరాభిమానిగా మారాను. మాయాబ‌జార్‌లో చాలా మంది హీరోలున్నారు. వాళ్ల‌లో రేలంగి కూడా ఒక‌రు. మాయా శ‌శిరేఖ‌తో ల‌క్ష్మ‌ణ కుమారుడి ఎపిసోడ్ నాన్‌స్టాప్ కామెడీ. పాతాళభైర‌విలో రాజుగారి బావ‌మ‌రిదే క‌థ‌ను మ‌లుపు తిప్పాడు. రేలంగి లేని మిస్స‌మ్మ‌ని ఊహించ‌లేం.

మాట‌తో , క‌ళ్ల‌తో, చేతుల క‌ద‌లిక‌తో న‌వ్వించ‌గ‌ల రేలంగికి బ్రేక్ రావ‌డానికి 15 ఏళ్లు ప‌ట్టింది. జీవిక కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.

బంగారం అరిగే రోజుల్లో తిన‌డానికి మ‌ర‌మ‌రాలు లేవు.
బంగారాన్ని కొని తినే రోజుల్లో మ‌ర‌మ‌రాలు కూడా అర‌గ‌డం లేదు.
ఇది రేలంగి ఫేమ‌స్ కొటేష‌న్‌. చాప్లిన్‌లా గొప్ప తాత్వికుడు. త‌ర్వాత వ‌చ్చిన ప‌ద్మ‌నాభం, రాజ‌బాబుల‌కి ఎంతో సాయం చేసిన మ‌నిషి. కొడుక్కి గొప్ప సంబంధాలు వ‌చ్చినా క‌ష్టాల్లో ఆదుకున్న బామ్మ‌ర్ది కూతురినే కోడ‌లుగా చేసుకున్నాడు. తాడేప‌ల్లిగూడెం ప్ర‌జ‌లు హాయిగా సినిమా చూడాల‌ని ఆ రోజుల్లోనే ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి అధునాత‌న థియేట‌ర్ క‌ట్టించాడు. ఆ డ‌బ్బుని మ‌ద్రాస్‌లో పెట్టుబ‌డి పెట్టి వుంటే ఈ రోజు వంద‌ల కోట్లు.

రేలంగి ఒక రీచార్జి లాంటి క‌మెడియ‌న్‌. ఇలాంటి న‌టులు అరుదుగా పుడ‌తారు.

(న‌వంబ‌ర్ 26 రేలంగి వ‌ర్ధంతి)

Also Read : Radhe Shyam : అన్నివైపులా ఒత్తిడిలో ప్రభాస్ బృందం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి