iDreamPost

సైబరాబాద్‌లో డేంజర్ బెల్స్‌

సైబరాబాద్‌లో డేంజర్ బెల్స్‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కరోనా వైరస్‌ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎక్కువగా వ్యాపిప్తోంది. లాక్‌డౌన్‌ చేసిన తర్వాత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ ప్రాంతంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అధికంగా ఉండే చందానగర్, కోకాపేట, గచ్చిబౌలి, తుర్కయాంజల్, కొత్తపేట ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వారితోపాటు జంట నగర వాసుల్లోనూ ఆందోళన నెలకొంది.

ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ తర్వాత తెలంగాణను లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత పలు మార్లు ప్రెస్‌మీట్లు పెట్టి తాజా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలపై ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో మరిన్ని ఆంక్షలు అమలు చేశారు. నిన్న గురువారం కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా కర్ఫ్యూను విధించారు.

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ విధించగా.. ముందుజాగ్రత్త చర్యగా తెలంగాణలో మరో రోజు అధికంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేసీఆర్‌ నిన్న గురువారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం ద్వారా కరోనా వైరస్‌ మహమ్మరిని అరికట్టవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. వచ్చే నెల 14వ తేదీ వరకూ పరిస్థితిని అంచనా వేసి.. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇప్పటి నుంచే ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి