iDreamPost

ఫలించని ‘జగ్గు’ మొదటి స్వప్నం – Nostalgia

ఫలించని ‘జగ్గు’ మొదటి స్వప్నం  – Nostalgia

ఇప్పుడంటే జగపతిబాబు విలన్ వేషాలు వేస్తున్నారు కానీ ఒకప్పుడు హీరోగా శోభన్ బాబు తర్వాత అమ్మాయిలు విపరీతంగా అభిమానించిన కథానాయకుడిగా పెద్ద కెరీర్ నే చూశారు. ఈయన మొదటి సినిమా సింహస్వప్నం. సుప్రసిద్ధ దర్శకుడు వి మధుసూదన్ గారు దీనికి కెప్టెన్ గా వ్యవహరించారు . కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేసే ఉద్దేశంతో నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బ్యానర్ పై భారీగా నిర్మించారు. దీని ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా చేశారు. ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రావడంతో అందరి దృష్టి దీని వైపు మళ్ళింది.

ఇక్కడ మీరు చూస్తున్న పిక్ ఆ సందర్భంగా తీసిందే. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కృష్ణంరాజు చేయడం విశేషం. బాలీవుడ్ హిట్ మూవీ ఖత్రోన్ కి ఖిలాడి రీమేక్ గా 1989లో ఇది రూపొందింది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన సింహస్వప్నం అంచనాలు అందుకోలేకపోయింది. నిర్మాతకు నష్టం తప్పలేదు. అదే సమయంలో పోటీ సినిమాలను తట్టుకుని ఇది నిలవలేకపోయింది. విశేషం ఏంటంటే చిరంజీవి అతిథిగా జరిగిన ఈ ఓపెనింగ్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించనే లేదు. జగపతిబాబు హీరోగా నిలదొక్కుకోవడానికి కొంత టైం పట్టింది. కెరీర్ ప్రారంభంలో చేసిన అడవిలో అభిమన్యుడు లాంటివి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

ఆ తర్వాత ఆశయం, చిన్నారి ముద్దుల పాప లాంటి సినిమాలు హిట్ అయినా సోలో హీరోగా మొదటి సక్సెస్ పేరు వచ్చింది మాత్రం పెద్దరికంతోనే. ఆ తర్వాత గాయంతో జగ్గు స్టామినా ఏంటో అందరికి తెలిసివచ్చింది. అలా అని సీరియస్ జానర్ కి కట్టుబడకుండా చేసిన శుభలగ్నం జగపతిబాబుని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. ఆ తర్వాత స్టార్ల సరసన చాలా కాలం మంచి ఓపెనర్ గా నిలబడ్డారు. ఆ తర్వాత వరస ఫ్లాపులతో హీరో పాత్రలకు స్వస్తి చెప్పి లెజెండ్ తో విలన్ గా మారాక ఏం జరిగిందో అందరికి తెలిసిందే. విశేషం ఏమిటంటే మొదటి సినిమా క్లాప్ కొట్టిన చిరంజీవితో జగపతిబాబు కలిసి నటించింది 30 ఏళ్ళ తర్వాత వచ్చిన సైరాతోనే. విచిత్రంగా ఉంది కదూ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి