iDreamPost

ఆ వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పవన్ ను ఎందుకు కలిశారు?.

ఆ  వైసీపీ ఎమ్మెల్యే తండ్రి పవన్ ను  ఎందుకు కలిశారు?.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తండ్రి హఠాత్తుగా రాజకీయ తెరమీదకు వచ్చారు. ఏపీలో సీనియర్ నేతల్లో ఒకరైన కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ సుదీర్ఘకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాంటి నాయకుడు తాజాగా వరద ప్రాంతాల్లో పర్యటన పేరుతో ఏపీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ని కలిశారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వాల తీరు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తండ్రి జనసేన అధినేతకు జై కొట్టారంటూ కొందరు ప్రచారానికి పూనుకుంటున్నారు.

కేపీ రెడ్డయ్య అసలు రాజకీయ నేపథ్యం తెలిస్తే అత్యుత్సాహంతో వ్యాఖ్యలు చేస్తున్న వారికి విషయం అర్థమవుతుంది. నిజానికి కేపీ రెడ్డయ్య యాదవ్ 1991లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కావూరి సాంబశివరావుని కేవలం 27,322 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించారు. కానీ ఆ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహరావుకి పలువురు టీడీపీ ఎంపీలు జై కొట్టగా అందులో కేపీ రెడ్డయ్య యాదవ్ ఒకరు. ఎంపీగా గెలిచిన మొదటి సారే ఆయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కి జై కొట్టారు. అందుకు ప్రతిఫలంగా 1996 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కింది. కానీ ఆయన టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు కైకాల సత్యన్నారాయణ చేతిలో 85వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

అనంతరం ఆయన రాజకీయంగా చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అదే సమయంలో కేపీ రెడ్డయ్య యాదవ్ తనయుడు పార్థసారధి కాంగ్రెస్ లో ఎదిగారు. 2004లోనే ఉయ్యూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆతర్వాత 2009లో పెనమలూరు నుంచి కూడా పార్థసారధి విజయం సాధించారు. అదే సమయంలో తండ్రి కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి పంచన చేరినా పార్థసారధి మాత్రం వైఎస్సార్ అనుచరుడిగా కొనసాగారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున రెడ్డయ్య యాదవ్ ఏలూరు నుంచి బరిలో దిగి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు. కానీ పార్థసారధి మాత్రం తన తండ్రితో విబేధించి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడమే కాకుండా మంత్రి పదవిలో కొనసాగారు.

అంటే దశాబ్ద క్రితమే తండ్రి, తనయుడు వేరు వేరు బాటపట్టారు. ప్రస్తుతం 77 ఏళ్ల రెడ్డయ్య వృద్ధాప్యంలో ఇంటిపట్టునే ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో పార్థసారధి మాత్రం ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతో మంత్రి పదవి దక్కకపోయినా జగన్ శిబిరంలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నాటి స్నేహంతో రెడ్డయ్య యాదవ్ నేరుగా తమ ఊరికి వచ్చిన పవన్ కళ్యాణ్‌ ని కలిస్తే దానిని రాజకీయంగా వాడుకుంటున్న వారి తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. పైగా దానిని పార్థసారధికి ఎదురుదెబ్బ అన్నట్టుగా చిత్రీకరించడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. రాజకీయంగా సొంత స్టామినాతో ముందుకు సాగుతున్న పార్థసారధికి తండ్రి కామెంట్స్ తో ఏమాత్రం సంబంధం లేదని, రాజకీయాలకు దూరంగా ఉన్న రెడ్డయ్య యాదవ్ ప్రకటనలకు పెద్ద ప్రాధాన్యత లేదని మొవ్వ మండల వాసులే చెబుతుండగా సోషల్ మీడియాలో మాత్రం చిలువలు పలువలుగా చిత్రీకరించే యత్నం చేయడమే విడ్డూరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి