iDreamPost

కాపుల్లో పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఎందుకు తగ్గింది..?

కాపుల్లో పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఎందుకు తగ్గింది..?

పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అమితమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారు. చివరకు సినిమా విషయంలో సైతం బాలయ్య,జూనియర్ ఎన్టీఆర్ కన్నా పవన్ కష్టాలకు బాబు చలించిపోతున్నట్టుగా కనిపిస్తుంది. దానంతటికీ కారణం వ్యక్తిగతంగా పవన్ మీద ప్రత్యేక ప్రేమతో కాదన్నది అందరికీ తెలిసిన సత్యం. పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కులం కారణంగానే చంద్రబాబు శ్రద్దపెడతారు. పవన్ ని ఆదరిస్తే ఆయన కులంలో తమకు ఓట్లు దక్కుతాయని భావిస్తారు. పవన్ సమస్యల్లో చేదోడుగా నిలిస్తే ఆయన కులంలో ఆదరణ పెంచుకోవచ్చని ఆశిస్తారు. ఇలా కాపులను మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారన్నది కాదనలేని వాస్తవం.

ఇప్పటికే 2014లో ఏదో మేరకు కాపుల ఓట్లు టీడీపీ వైపు మళ్లడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం. స్వల్ప ఓట్లతో చంద్రబాబు విజయం సాధించడంలో పవన్ పాత్ర చాలా పెద్దది. అందుకే పవన్ కోసం చంద్రబాబు ఏది చేయడానికయినా సిద్ధపడతారు. తద్వారా కాపులను తనవైపు తిప్పుకోవచ్చని ఆశిస్తారు. కానీ కాపుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. కాపుల సమస్యల పట్ల పవన్ మౌనంగా ఉండడం ఒక కారణమైతే, తనపార్టీలో మళ్లీ కమ్మ కులస్తుడు నాదెండ్ల మనోహర్ కే పెత్తనం అప్పగించడం మరోకారణం. దాంతో కాపులు పవన్ ని ఆదరించేందుకు సిద్ధంగాలేరని భావించాల్సి వస్తోంది.

2019 ఎన్నికల్లోనే మెజార్టీ కాపులు వైఎస్సార్సీపీ వైపు నిలిచారు. జగన్ కి జై కొట్టారు. రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చంద్రబాబు అండ్ కో సాగించిన దాష్టీకానికి బదులు చెప్పారు. ముద్రగడ వంటి సీనియర్ నేత పట్ల, ఆయన భార్య పట్ల ప్రవర్తించిన తీరుకి ప్రతీకారం తీర్చుకున్నారు. తద్వారా పవన్ కన్నా జగన్ కే ఎక్కువగా కాపుల ఓట్లు దక్కాయి. గోదావరి జిల్లాల్లో ఫలితాలు అందుకు తార్కాణం. నేరుగా పవన్ పోటీచేసిన భీమవరంలో ఓటమి నిదర్శనం. అయినప్పటికీ పవన్ తన సొంత కులస్తుల ఓట్లను చంద్రబాబు వైపు మళ్లించే ప్రక్రియలో ఉన్నారు. జగన్ మీద వ్యక్తిగత ద్వేషం పెంచితే తద్వారా బాబుకి ఆదరణ పెరుగుతుందని పవన్ సైతం ఆశిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలో పవన్ ఉండగా, కాపుల ఓట్లను సొంతంగా ఆలోచించే శక్తి వైపు మళ్లించాలనే యత్నాలు కూడా మొదలయ్యాయి.

పవన్ వల్ల కాపులకు ఒరిగేదేమీలేదని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ముద్రగడ చర్చలు మొదలెట్టారు. త్వరలోనే ఆయన ఓ కూటమి కట్టే అవకాశం కనిపిస్తోంది తాజాగా విశాఖలో కాపునేతలు భేటీ అయ్యారు. గంటా శ్రీనివాసరావు,బోండా ఉమా,మాజీ డీజీపీ సాంబశివరావు, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వంటి వారంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు గతంలో హైదరాబాద్ లో ఓసారి భేటీ జరిగింది. విశాఖలో మరోసారి మంతనాలు మొదలెట్టారు. పవన్ ని నమ్ముకుంటే కాపుల ఓట్లు మళ్లీ కమ్మ నాయకత్వంలోని చంద్రబాబు వైపు మళ్లించడం మినహా కాపుల స్వతంత్రత కాపాడే అవకాశం లేదనే నిర్ణయానికి ఆయా నేతలు వచ్చినట్టు కనిపిస్తోంది. పవన్ ని నమ్ముకుంటే కాపులకు అన్యాయమేననే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

కాపుల్లో పవన్ కి ఆదరణ తగ్గితే, ఇలాంటి వివిధ కూటములు తెరమీదకు వస్తే పవన్ కి చంద్రబాబు పెద్దపీట వేసే అవకాశం లేదు. కేవలం కాపుల ఓట్ల కోసమే పవన్ ని ఆదరిస్తున్న చంద్రబాబు, నిజంగా కాపుల ఓట్లు పవన్ వల్ల వచ్చే అవకాశంలేదని తేలితే పూర్తిగా దూరంపెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. దాంతో అటు కాపులకు, ఇటు చంద్రబాబు కి కూడా విశ్వాసం కల్పించలేక రెంటికీ చెడ్డ రేవడిలా జనసేన మారిపోయే ముప్పు కూడా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి