iDreamPost

Ramarao On Duty : రవితేజ టీమ్ మళ్ళీ మార్చుకోక తప్పదేమో

Ramarao On Duty : రవితేజ టీమ్ మళ్ళీ మార్చుకోక తప్పదేమో

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాలు వరసగా రెడీ అవుతున్నాయి. ఖిలాడీ ఈ నెల 11న రానుండగా ఏపిలో నైట్ కర్ఫ్యూతో పాటు ఆక్యుపెన్సీ నిబంధన దృష్ట్యా 18కి వాయిదా పడొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏరియాల వారిగా బిజినెస్ మాత్రం చకచకా జరిగిపోతోంది. సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఇదే కావడంతో డిస్ట్రిబ్యూటర్లు మంచి రేటు ఇచ్చి కొంటున్నారు. గత ఏడాది క్రాక్ తో పెద్ద హిట్టు తన ఖాతాలో వేసుకున్న రవితేజకి ఇది మరో సక్సెస్ అందిస్తుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.ఇక రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతూ గ్యాప్ ఇవ్వకుండా ముగింపుకు పరుగులు పెడుతోంది.

నిన్న వదిలిన కొత్త పోస్టర్ లో రెండు డేట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరి మార్చ్ 25 రెండు ఏప్రిల్ 14. అసలు వీటిని చూసుకునే ఇచ్చారా అనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ 25 ఫిక్స్ అయ్యింది. మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ రామారావు ఏప్రిల్ 14కి వెళ్తే అదే రోజు కెజిఎఫ్ 2 ఉంది. ఇతర భాషల్లోనే కాదు తెలుగులోనూ దీని మీద చాలా క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే క్రేజీ ఆఫర్లు ఇచ్చి హక్కులు కొనేసుకున్నారు. అలాంటప్పుడు నేరుగా కెజిఎఫ్ 2 తో రామారావు ఢీ కొట్టడం అంత సేఫ్ గేమ్ అనిపించుకోదు. ముఖ్యంగా కర్ణాటక కోణంలో చూసుకుంటే రామారావుకి ఈ పోటీ సూసైడ్ అటెంప్ట్ లాంటిది.

నిజానికి ఈ రెండు డేట్ల పంచాయితీ చూస్తూ నవ్వుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. భీమ్లా నాయక్, గని ఇప్పుడీ రామారావు ఆన్ డ్యూటీ అన్నీ డబుల్ తేదీల పద్ధతిని ఫాలో కావడం వెనుక పెద్ద ప్లానింగ్ లేనట్టు కనిపిస్తోంది. ఆర్టిసి బస్సులో సీట్ల కోసం కర్చీఫ్ లు వేసినట్టు ఇలా ఎగబడి ప్రకటనలు ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఈ లెక్కన చూస్తే రామారావు మళ్ళీ డేట్ మార్చుకోక తప్పేలా లేదు. ధమాకా దసరాకు ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో చాలా తక్కువ గ్యాప్ లో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు ప్రేక్షకులు చూడొచ్చు. ఇవాళ్టి నుంచి రావణాసుర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది.

Also Read : Hridayam : హృదయం రీమేక్ ఎవరి చేతికి వెళ్తుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి