iDreamPost

డ్యూయల్ రోల్ అచ్చిరాని యాంగ్రీమ్యాన్

డ్యూయల్ రోల్ అచ్చిరాని యాంగ్రీమ్యాన్

ఏ హీరోకైనా ద్విపాత్రాభినయం సినిమాలు చాలా స్పెషల్ గా నిలుస్తాయి. ప్రతి స్టార్ ఒక్కసారైనా వీటిని ట్రై చేయకుండా వదలడు. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది కానీ క్లుప్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ రాముడు భీముడు, ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులు, చిరంజీవి రౌడీ అల్లుడు, బాలకృష్ణ అపూర్వ సహోదరులు, నాగార్జున హలో బ్రదర్, వెంకటేష్ సూర్య వంశం, చరణ్ నాయక్, తారక్ అదుర్స్ ఇలా ప్రతిఒక్కరికి చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి.

కానీ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కు మాత్రం ఈ డబుల్ ఫోటో మూవీస్ అచ్చి రాలేదు. దానికి కారణం ఉంది. ఆయన మొదటగా చేసిన డ్యూయల్ రోల్ సినిమా అహంకారి. దాసరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజశేఖర్ తండ్రికొడుకులుగా నడిచారు. సినిమా ఫ్లాపు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రాజసింహం చేశారు. ఇందులో మిలిటరీ ఆఫీసర్, బ్యాంకు ఉద్యోగిగా రెండు పాత్రలు చేశారు. పాటలు బాగున్నాయనే పేరు తప్ప రిజల్ట్ మాత్రం ఫ్లాప్.

కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సూర్యప్రకాష్ డైరెక్షన్ లో మళ్ళీ తండ్రి కొడుకులుగా భరతసింహారెడ్డి చేశారు. బిసి సెంటర్స్ ఓ మాదిరిగా ఆడినా దీని ఫలితం కూడా సోసోనే. మళ్ళీ ఇన్నేళ్లకు కన్మణి దర్శకుడిగా అర్జున చేశారు. ఇది చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇందులోనో ఫాదర్ అండ్ సన్ రోల్సే రిపీట్ చేస్తున్నారు. పోనీ ఈసారైనా డబుల్ ఫోటో సినిమా కలిసొస్తుందా అంటే అర్జున విడుదలకే ఆపసోపాలు పడుతోంది. ఈ లెక్కన రాజశేఖర్ పోలీస్ గా లవర్ బాయ్ గా ఎన్ని గొప్ప విజయాలు సాధించినా డ్యూయల్ రోల్ తో పెద్ద హిట్టు కొట్టలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లోనూ ఉంది. అర్జున వరస చూస్తుంటే భారీ అంచనాలైతే లేవు. కల్కి ఆశించిన విజయం సాధించకపోవడంతో గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇంకో కొత్త సినిమా ఏదీ కమిట్ అవ్వలేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి