iDreamPost

కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబ నాయకత్వంపై గుర్రుగా ఉండి గత రెండేళ్లుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న జీ 23 నేతలు మరోసారి క్రియాశీలం అవుతున్నారు. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో వారిలో కొందరు భేటీ అయ్యి మంతనాలు జరపడం విశేషం. అదే సమయంలో గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ఏదో జరగబోతోంది అన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. అంటే మార్చి పదో తేదీ తర్వాత అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అసమ్మతి నేతల మంతనాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. మార్చి పదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కీలకమైన యూపీలో గెలవడం మాట అటుంచి.. అస్తిత్వమే కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ రెండో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో పృథ్విరాజ్ చవాన్, మాధవ్ సింహ్ సోలంకి, భూపిందర్ సింగ్ హుడా, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ తదితరులు సమావేశమై మంతనాలు జరిపారు. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని, గాంధీ-నెహ్రూ కుటుంబ నాయకత్వం నుంచి పార్టీని తప్పించాలని 2020లో నేరుగా సోనియాగాంధీకే లేఖ రాసిన వీరంతా.. ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం మళ్లీ గళం విప్పాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే పార్టీపై తిరుగుబాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కౌరవుల లిస్ట్ సిద్ధం చేయండి

మరోవైపు పార్టీలో కౌరవులు ఉన్నారని.. వారి జాబితా సిద్ధం చేయాలని పార్టీ నేతలను రాహుల్ గాంధీ ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ పర్యటన
సందర్భంగా పార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ పార్టీలో ఉన్న కౌరవులు ప్రజల్లోకి వెళ్లకుండా ఏసీ ఆఫీసుల్లో కూర్చొని కాలం గడుపుతున్నారని, పార్టీకి నష్టం చేకూరుస్తూ బీజేపీకి మేలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గులాం నబీ ఆజాద్ ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆజాద్ రాజ్యసభ నుంచి రిటైర్ అయినప్పుడు ప్రధాని మోడీ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తడం, ఇటీవల పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం గమనార్హం. అదే సమయంలో ఆజాద్ సైతం కాశ్మీర్ విషయంలో ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించడానికి బీజేపీ నాయకత్వం ఆజాద్ ద్వారా పావులు కదుపుతోందన్న అనుమానాలను కాంగ్రెస్ లో పలువురు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి