iDreamPost

లక్ష్యం బాగుంది.. కానీ ప్రత్యర్థి వ్యూహాలను తట్టుకుని చేరేదెలా..?

లక్ష్యం బాగుంది.. కానీ ప్రత్యర్థి వ్యూహాలను తట్టుకుని చేరేదెలా..?

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా.. ఆశలు పెట్టుకున్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారం రాకపోగా.. అధికారం ఉన్న పంజాబ్‌ను హస్తం పార్టీ చేజార్చుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో కర్ణాటక అసెంబ్లీకి, డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించి, తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేస్తూ లక్ష్యాలను నిర్ధేశిస్తున్నారు.

తిరిగి అధికారం సాధిస్తామని కాంగ్రెస్‌కు బలమైన నమ్మకం ఉన్న రాష్ట్రం కర్ణాటక. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఏడాది మేలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి.. మళ్లీ అధికారం చేపట్టాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దక్షిణ భారతదేశంలో తిరిగి హవా చాటొచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కర్ణాటక నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు సాధించే దిశగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని రాహుల్‌ హితోపదేశం చేస్తున్నారు. పార్టీ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే ఇతర నేతలు సరైన సమస్యలపై, సరైన ప్రమాణాలతో పోరాటాలు చేయాలని సూచిస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపు ఎలా ఉండాలో చెబుతున్నారు.

బీజేపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలేవి..?

రాహుల్‌ గాంధీ సూచనలు, సలహాలు, హితోపదేశాలు వినేందుకు బాగానే ఉన్నాయి. అయితే ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టి, అందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేయాలి. కానీ కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో ఈ తరహాలో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉన్నా.. బీజేపీ ఆ విషయంపై దృష్టిపెట్టినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. కానీ చాపకింద నీరులా ఓట్ల వేటను ప్రారంభించింది. బీజేపీకి తిరుగులేని అస్త్రమైన హిందుత్వ కార్డును కర్ణాటకలో ప్రయోగించడం మొదలుపెట్టింది. మొన్న హిజాబ్‌పై వివాదం రేగగా, విద్యాసంస్థల్లో విద్యార్థుల మధ్య వివాదాలు చెలరేగాయి. తాజాగా హలాల్‌ మాంసాన్ని నిషేధించాలంటూ బీజేపీ అనుబంధ విభాగాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయంపై పరిశీలన చేస్తామని సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటన చేయడంతో.. హిజాబ్‌ మాదిరిగా, హలాల్‌ మాంసంపై కూడా వివాదం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ తరహాలో బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. బీజేపీ హిందుత్వ రాజకీయాలను ఎదుర్కోవాలంటే.. కుహానా లౌకికవాదాన్ని కాంగ్రెస్‌ విడిచిపెట్టాలని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన అధికారిక పత్రిక సామ్నా సూచించింది. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఈ సలహాను పాటించడంలేదని, పూర్వ బాటలోనే వెళుతోందనే విషయం కర్ణాటకలో నెలకొన్న పరిణామాలపై ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో అర్థమవుతోంది. మరి పూర్వ పద్ధతులతో బీజేపీని ఎదుర్కొని, కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయతీరం చేరగలదా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి