iDreamPost

రాహుల్‌ గాంధీ భేటీ.. తుమ్మల, పొంగులేటిలకు సీట్లు ఖరారు

రాహుల్‌ గాంధీ భేటీ.. తుమ్మల, పొంగులేటిలకు సీట్లు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించిన హ్యట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు అధికార పక్షంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఒక్కసారి తమకు ఛాన్సు ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ ఓటర మహాశయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కర్ణాటకలో గెలుపు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అదే స్పీడ్ తెలంగాణలో కూడా కొనసాగించాలని గట్టి పట్టుమీదే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోన నేడు రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార పార్టీ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెల్చుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకోవడం కోసం పలు వ్యూహాలతో ముందుకు సాగుతుంది. ఇటీవల ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తుమ్మలకు పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్ ఆహ్వానం మేరకు తుమ్మల ఢిల్లీ పయణమయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాహూల్ గాంధీ తో తొలిసారి తుమ్మల భేటీ ఆయ్యారు. అర్థ గంట పాటు ఇద్దరి మధ్య భేటీ జరిగినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల లీస్ట్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీకి దించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు కొత్తగూడెం టికెట్ ను పొత్తుల్లో భాగంగా సీపీఐ అభ్యర్థికి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్థానంలో కూనంనేని సాంబశివరావు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. 2019 జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఆయన గెలుపొందారు. రాహూల్ తో భేటీ అయిన పొంగులేటి రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి