iDreamPost

ఆరేళ్ళ తర్వాత సీక్వెల్ ఆలోచనా ?

ఆరేళ్ళ తర్వాత సీక్వెల్ ఆలోచనా ?

అసలే టాలీవుడ్ కు సీక్వెల్ శాపం ఉంది. ఒక టైటిల్ తో హిట్ అయిన సినిమాకు 2 అనే నెంబర్ జోడించో లేదా ఇంకో పదం యాడ్ చేసో క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనుకుంటే దెబ్బ తిన్న సందర్భాలే ఎక్కువ. ఒక్క బాహుబలి మాత్రమే ఈ నెగటివ్ సెంటిమెంట్ ని తట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ మిగిలినవన్నీ బోల్తా కొట్టినవే. కిక్ 2, మన్మథుడు 2, మనీ మనీ, సర్దార్ గబ్బర్ సింగ్, మంత్ర 2, వెన్నెల 1.5 ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఏ ఒక్కటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు.

అందుకే సీక్వెల్ అంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి. ఇక్కడ ఇంకో రిస్క్ ఉంది. క్లాసిక్ గా నిలిచిపోయిన హిట్ సినిమాకు కొనసాగింపు అంటే ప్రేక్షకులు చాలా భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. దానికి ఏ మాత్రం తగ్గినా ఒప్పుకోవడం సరికదా దారుణంగా ఛీ కొడుతున్నారు. ఒక్క రాజమౌళి మాత్రమే ఈ విషయంలో గెలిచాడు. మరి అలాంటప్పుడు ఆరేళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ ఇప్పుడు సీక్వెల్ అంటే ఎలా ఉంటుంది

2014లో వచ్చిన అల్లు అర్జున్ రేసు గుర్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, మ్యూజిక్, ఎమోషన్ అన్ని సమపాళ్లలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూర్చిన తీరుకు బన్నీ కెరీర్ లోనే పెద్ద హిట్టు దక్కింది. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తో మాంచి జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు రేస్ గుర్రం 2 గురించి ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు జరిపారని సుకుమార్ తో చేస్తున్న సినిమా పూర్తయ్యే లోపు ఓ కంక్లూజన్ కు రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే కమర్షియల్ సినిమాలకు అచ్చి రాని సీక్వెల్ సెంటిమెంట్ అని అభిమానులు ఖంగారు పడతారేమో. అధికారిక ప్రకటన వచ్చే దాకా ఇదంతా నిజమని చెప్పలేం కాని దీనికి సంబంధించిన వార్త మాత్రం జోరుగా చక్కర్లు కొడుతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి