iDreamPost

రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఇప్పుడే తెరపైకి ప్రొరోగ్‌..

రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ ఇప్పుడే తెరపైకి ప్రొరోగ్‌..

ప్రతి శాసనసభ, శాసనమండలి సమావేశాల అనంతరం సాధారణంగా జరిగే తంతే ప్రొరోగ్‌. కానీ ఎప్పుడోసారి మాత్రమే మీడియాలో హైలెట్‌ అవుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజనకు ముందు 2013లో కొన్ని నెలల పాటు ప్రొరోగ్‌ అంశం హడావుడి చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు.. కాదు ఇన్నేళ్లకు మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రాభివృద్ధికి ఉద్ధేశించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను మండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం.. దీంతో మండలినే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. దీనిపై సెలక్ట్‌ కమిటీ అంటూ రాద్ధాంతాలు, కోర్టులో కేసుల నేపథ్యంలో ఇప్పుడు శాసనసభ, మండలి సమావేశాలు ప్రొరోగ్‌ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా బిల్లులపై ఆర్డినెన్స్‌ కోసమే ప్రొరోగ్‌ చేశారని తెలుస్తోంది.

అసలు ప్రొరోగ్‌ అంటే?

శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత సాధారణంగా స్పీకర్ సభను ‘సైన్ డై’ అంటూ వాయిదావేస్తారు. అలాంటి సందర్భంలో స్పీకర్ నోటీసు ఇచ్చి మూడు రోజుల్లోగా శాసనసభను సమావేశపరిచేందుకు వీలుంటుంది. ఒకవేళ వారం రోజులపైగా శాసనసభా సమావేశాలు జరగకపోతే నిరవధిక వాయిదా (ప్రోరోగ్) చేసేందుకు వీలుగా ఒక ఫైలును ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ఫైలును ప్రభుత్వం పరిశీలించిన తర్వాత గవర్నర్ పరిశీలనకు పంపిస్తుంది. గవర్నర్ సదరు ఫైలుపై సంతకం చేస్తే, సమావేశాలను ప్రోరోగ్ చేసినట్టు ప్రకటిస్తారు. శాసనసభా సమావేశాలు ఒక పర్యాయం ప్రోరోగ్ అయిన తర్వాత మళ్లీ సమావేశం కావాలంటే ముఖ్యమంత్రి సూచనలు, సలహా మేరకు గవర్నర్ తిరిగి శాసనసభను సమావేశపరుస్తారు. ఇందుకు కొంత వ్యవధి పడుతుంది. సాధారణంగా సభను ప్రోరోగ్ చేయకపోతే ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసేందుకు వీలుకాదు. ప్రోరోగ్ అయినట్టు గవర్నర్ ప్రకటిస్తే, ఆర్డినెన్స్‌లు జారీ చేసేందుకు వీలుంటుంది. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం శాసనసభను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది.

2013లో ఏం జరిగింది?

అప్పట్లో అంటే 2013 జూన్‌లో విభజన ఉద్యమాలు, సమైక్య ఉద్యమాలు జరుగుతున్న సమయంలో శాసనసభ, మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే ఆ గొడవల మధ్యలో సభను ప్రొరోగ్‌ చేయలేదు. కేంద్రంలో విభజనకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతుండడంతో నవంబర్‌లో సభను ప్రొరోగ్‌ చేయాలని, ఆ తర్వాత సమైఖ్యాంధ్రకు అనుకూలంగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి నిర్ణయించారు. అయితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా తెలంగాణకు చెందిన శ్రీధర్‌ ఉండగా.. స్పీకర్‌గా నల్లారికి వ్యతిరేక వర్గం నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. దీంతో అప్పట్లో నల్లారికి తాను అనుకున్నది జరగలేదు. ఆ సమయంలోనే ఈ ప్రొరోగ్‌ అంశంపై మీడియాలో చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి