iDreamPost

పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారుల బదిలీ..!

పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారుల బదిలీ..!

ఇప్పటికే ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ.. తన విభాగం అధికారులపై కూడా తీవ్ర చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికలపై సుప్రిం కోర్టు తీర్పు తర్వాత ప్రతాపం చూపించడం మొదలెట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) ఉన్న విచక్షణాధికారాలను తన వ్యక్తిగత అంజెడాలో భాగంగా ఉపయోగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించితీరాలనే లక్ష్యంతో పని చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా సుప్రిం తీర్పుతో ఎన్నికల ప్రక్రియ మొదలవగా ఎన్నికలకు సహకరించలేదనే కారణాలతో ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేస్తున్నారు. ఎన్నికలకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ.. పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సర్కులర్‌ జారీ చేశారు. ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని పేర్కొన్నారు.

ఎస్‌ఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అధిత్యానాథ్‌ దాస్‌ అమలు చేశారు. గోపాల కృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో నూతన అధికారులను నియమించేందుకు వీలుగా.. ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లు సిఫార్సు చేస్తూ సీఎస్‌ ఆధిత్యానాథ్‌ దాస్‌.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు.

కాగా, ఈ నెల 23వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన సమయంలో.. ఎన్నికలకు ఎవరు ఆటంకం కలిగించిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించని వారిపై సరైన సమయంలో తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ రోజు చెప్పిన విషయాన్ని నిమ్మగడ్డ ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ సహా 9 మంది అధికారులను బదిలీ చేయాలని సూచించగా.. రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుత సమయంలో ఆ 9 మంది అధికారులను బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మళ్లీ కోరే అవకాశం ఉంది.

నిమ్మగడ్డ తీరుపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన వారు.. ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరింత మందిని బదిలీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. ఎన్నికల్లో చీమ చిటుక్కుమన్నా.. బదిలీ కొరడా ఝులిపించేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సిద్ధంగా ఉన్నట్లు ఆయన వ్యవహార శైలి ద్వారా స్పష్టమవుతోంది. ఎన్నికలపై పంతాలకు పోయి.. ఇప్పటికే వివాదాస్పద అధికారిగా మారిన.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఈ ఎన్నికల నిర్వహణలో ఎలా వ్యవహరించేది తాజాగా పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయడం ద్వారా అర్థమవుతోంది. నిమ్మగడ్డ ఒంటెద్దు పోకడలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటోయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి