iDreamPost

బాబు, ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఇప్పటికన్నా తెలుసుకున్నారా?

బాబు, ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఇప్పటికన్నా తెలుసుకున్నారా?

ఎన్నికలు ముగిసి చంద్రబాబు ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది… పీడకలలు మరచి పోవాలంటారు,ఏమి జరగలేదు అనుకోని ముందుకు వెళ్ళాలంటారు… ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతుంది అదే..

ప్రధాన పత్రికలలో వార్తలు చూసినా,చంద్రబాబు నాయుడు ప్రసంగాలు చూసిన అధికారంలో ఉన్నది ఎవరు?అన్న అనుమానం వస్తుంది…ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా 23-May-2020 నాడు ప్రధాన పత్రికలలో దానికి సంబంధించి ఎలాంటి వార్త రాలేదు… ప్రజల చేతిలో దారుణ తిరస్కారానికి గురైన టీడీపీ జూమ్ మహానాడుకు మాత్రం విపరీతమైన కవరేజి.. గతంలో వంటల మెనూ గురించి రాసే పత్రికలు నిన్న స్లిమ్ అయినా లోకేషే ప్రత్యేక ఆకర్షణ అంటూ కథనాలు రాశాయి… అటు పత్రికలు కానీ ఇటు టీడీపీ కానీ 2019 ఎన్నికలలో ఓటమి మీద విశ్లేషణ చెయ్యలేదు … మహానాడులో కూడా ఎన్నికల ప్రస్తావన లేదు …

టీడీపీ ఎందుకు ఓడిపోయింది?ఈ విశ్లేషణ ఇప్పటికి ఆసక్తికరమే …

చంద్రబాబు మొదటి నుంచి ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టొచ్చని నమ్మేవారు. 1999 ఎన్నికలలో గెలిచిన తరువాత ఎన్నికలు ఒక “ఈవెంట్” అని కూడా అన్నారు.. అంటే పోలింగ్ రోజు ఓటర్‌లను మేనేజ్ చేస్తే చాలు అని ఆయన ఉద్ధేశ్యం….

2004 ఎన్నికలలో గెలుపు మీద ధీమాతో చంద్రబాబు పోలింగ్ తరువాత కూడా అధికారులతో రివ్యూ మీటింగులు జరిపారు… ఫలితాల తరువాత మాత్రం అప్పటి వరకు నియంత్రణ ఉన్న నేతగా కనిపించిన చంద్రబాబు “వాడు,వీడు” అంటూ అదుపుతప్పి మాట్లాడారు… ముఖ్యంగా గుంటూరు -2 నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణం అయిన చల్లా వెంకట కృష్ణా రెడ్డి,తాడేపల్లి గూడెంలో టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణం అయిన (అప్పటి సిట్టింగ్) ఎమ్మెల్యే యర్రా నారాయణస్వామి మీద తిట్ల దండకం అందుకున్నారు.

రెండు మూడు నెలల తరువాత మాత్రం “నేను మారాను” మీరు మారాలి అంటూ పార్టీ సమావేశాలలో చంద్రబాబు అనేవారు.మరి కొంత కాలం తరువాత నేను మారినా మీరు మారరా?అంటూ మాట్లాడేవారు….

నాయకులు,కార్యకర్తలు మాత్రం మీరు “ఏమి” మారారు?ఎందుకు మారారు అని అడిగే ధైర్యం చెయ్యలేదు…

2014 ఎన్నికలలో గెలిచిన తరువాత “మనిషి మారలేదు” అని చంద్రబాబు వ్యవహారశైలి నిరూపించింది.గతంలో ప్రత్యర్థులను చిన్న చూపుచూసే అలవాటు పెరిగి కనీసం మనుషులుగా గుర్తించటం కూడా మానేశారు..

2019 ఓటమి – ఒక్కటే కారణం
టీడీపీ ఓటమికి వంద విశ్లేషణలు చేసి వంద కారణాలు రాసినా వాటన్నిటికీ ఒకటే మాతృక… అహంభావం.. రెండు వరుస ఓటముల తరువాత 2014లో గెలవటం జీవన్మరణ సమస్య అవ్వటం … ఆ ఎన్నికలలో గెలవటం చంద్రబాబు “నేనే” మానసికస్థితిని పరాకాష్టకు తీసుకెళ్లింది.. ఎంతగా అంటే వైసీపీ అధినేత జగన్ ను కానీ,టీడీపీకి ఓటు వేయని వారిని కానీ మనుషులుగా కూడా గుర్తించని స్థాయికి చేరింది …

ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. నేను వేసిన రోడ్లు,నేను ఇస్తున్న పెన్షన్లు ..నేను ఇస్తున్న నీళ్లు.. అన్ని నేనే.. రాష్ట్రంలో ఏ మూల ఏమి జరిగినా రాయలసీమ రౌడీలు,పులివెందుల గుండాలు… చివరికి పనులు పూర్తి కాకుండా పోలవరం కుడి కాలువ ద్వారా నీళ్లు పారిస్తే పడిన గండి కూడా వైసీపీ గుండాల పనే అంటూ ఆరోపణలు చేసి కేసులు పెట్టారు.వర్షానికి సచివాలయంలో నీరు కారితే వైసీపీ వాళ్ళు పైపులు కోశారని ఆరోపించారు.

విలువలతో రాజకీయం చేస్తాను అని చెప్పుకుంటూ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని అందులో నలుగురికి మంత్రిపదవులు ఇవ్వటం .. ఆ సందర్భంగా టీడీపీ నేతలు,వారి అనుకూల మీడియా జగన్ వ్యక్తిత్వం మీద చేసిన దాడి తటస్థులకు కూడా కోపం తెప్పించింది..

లోకేష్ అనే LKG స్టూడెంట్‌ను ఏకంగా మంత్రిని చేయటం,అతని పరిణితి లేని వ్యవహారశైలి, పైగా అతనో మాస్టర్ అన్నట్లు అందరికీ పాఠాలు చెప్పటం చూసేవారికి ఎన్టీఆర్ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు మీద చేసిన విమర్శలు గుర్తుకొచ్చాయి…

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువ నాయకుడు సీనియర్‌ల నుంచి నేర్చుకోవాలి,దేశంలో ఇతర యువ నేతలు ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో గమనించి ప్రవర్తించవల్సింది పోయి.. ప్రపంచ మాస్టర్ కొడుకును నేను అంటూ స్థాయిని మించి చేసిన విమర్శలు, ప్రవర్తించిన తీరు టీడీపీని బాగా దెబ్బకొట్టింది…

ఇలా ఎంత విశ్లేషించినా బయటపడే ఏకైక కారణం తండ్రీకొడుకుల అహంభావం,అహంకార వైఖరి… మిగిలినవన్నీ వారి అహంభావాన్ని పెంచిన సంఘటనలే..

చంద్రబాబు,లోకేష్ ను ప్రభావితం చేసిన ఇతర అంశాలు ఏవి?

వైసీపీ శాసనసభను బాయికాట్ చెయ్యటం

2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన జగన్ బలమైన నాయకుడిగా ఎదిగాడు..లక్ష కోట్ల ఆరోపణలు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించలేదు.. 2014లో వైసీపీకి 67 స్థానాలు రాగా 2019లో టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి.. ఈ లెక్క చూస్తే అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఎక్కువ పని చేశాయో అర్ధమవుతుంది.

శాసనసభలో జగన్ మీద మూకుమ్మడి దాడి,వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాగేసుకొని వారితో జగన్ మీద ఆరోపణలు చేయించడం… సభలో తమకు మాట్లాడే ఆవకాశం కానీ మర్యాద కానీ దక్కదని 2015 మార్చిలో స్పీకర్ కోడెలకు నమస్కారం పెడుతూ బయటకు వెళ్ళిపోయిన జగన్ & వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదనను అర్ధం చేసుకొని సముదాయించాల్సింది పోయి స్పీకర్,ముఖ్యమంత్రి & మంత్రులు వారిని అవహేళన చేస్తూ.. మనమే ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అంటూ వారిని వారు చేసుకున్న మోసం.. 2019లో నిజమయ్యింది.. సభలో ఎడమ కుడి అయ్యింది..

ప్రజాసామ్యంలో అధికార,ప్రతిపక్ష పాత్రలు ఒకే పార్టీ పోషించలేదన్న సత్యం తెలుసుకోవటానికి చంద్రబాబుకు ఒక ఓటమి అవసరమయ్యింది..

ప్రజలు ఓట్లు వేసి శాసనసభకు పంపిస్తే సభనుంచి పారిపోయారని విమర్శించిన వారెవరికి 2019 ఎన్నికలలో శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దక్కకపోవడం యాదృచ్ఛికం కాదు .. నాతో చర్చకు రమ్మంటే జగన్ పారిపోయాడన్న లోకేష్ కు ఇప్పటికి కాళ్ళు నేలమీద ఆనించి నడవటం అబ్బలేదు..

నంద్యాల ఉప ఎన్నిక
అద్భుతమైన విజయమే కానీ దాని కోసం పెట్టిన ఖర్చును,చేసిన శ్రమను అందరికన్నా చంద్రబాబే ఎక్కువ అర్ధం చేసుకొని ఉండవలసింది…ఆ ఉప ఎన్నిక ఫలితం ప్రజాభిప్రాయం అనటం కన్న తాము నయానా,భయానా ప్రజాభిప్రాయాన్ని కొనుకున్నామన్న సత్యం చంద్రబాబు కంటే ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది?ఆ గెలుపు మాత్రం చంద్రబాబు అండ్ కో కు కిక్ ఇచ్చింది.. గ్రౌండ్ రియాలిటీకి దూరం చేసింది …

“నంద్యాల” మోడల్ అంటూ తన పుట్టి తానే ముంచుకున్న చంద్రబాబు,ఓటమి తరువాత కూడా కళ్ళు తెరవలేదు.

లెక్కల మత్తు

2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక రివ్యూ సమావేశంలో అప్పటి నల్గొండ కలెక్టర్ డ్వాక్రా మహిళల రుణాల గురించి చెప్పిన లెక్కలు విని .. “కలెక్టర్ గారు ముఖ్యమంత్రి మారిన విషయం గుర్తించి,అసలు లెక్కలు చెప్పండి” అన్నారు.. చంద్రబాబు లెక్కలు ఆ స్థాయిలో ఉండేవి..2014లో కూడా మనం ఇన్ని వేల కోట్లు ఇచ్చాము అని లెక్కలు వేసుకున్నారు కానీ లబ్ధిదారులు ఏమనుకుంటున్నారో అన్న ఫీడ్ బ్యాక్ మాత్రం తీసుకోవటంలో విఫలమయ్యారు.. రైతు రుణమాఫీ కింద వేలకోట్లు ఖర్చుపెట్టిన మాట నిజమే కానీ దాని ఫలితం దక్కిందా?ఎంతమంది రైతుల ఋణం తీరిందన్న లెక్కలు తీసుకోలేదు.. ప్రతి పథకం అంతే !

గతంలో ఎన్నికలు ఈవెంట్ అని భావించిన చంద్రబాబు మొన్నటి ఎన్నికలలో కూడా “పసుపు-కుంకుమ” పేరుతో నాలుగు వేల రూపాయలు పంచారు.. పోలింగ్ రోజు ఉదయం బారులు తీరిన మహిళల ఓటర్‌లను చూసిన గెలిచేసాం అని పండగ చేసుకున్నారు.. కానీ “ఆ డబ్బులు మాకు ఇవ్వవలసిన వడ్డీనే కదా” అని మారుమూల,స్మార్ట్ ఫోన్లు వాడని మహిళలు కూడా అనుకొన్న విషయం చంద్రబాబుకు తెలియలేదు..ఒక పని చేయకపోతే కొంచం అసంతృప్తి ఉంటుంది.. మాటలతో మాయ చేద్దాం అనుకుంటే కక్ష కట్టి ఓడిస్తారని చంద్రబాబు సలహాదారులు గుర్తించలేకపోయారు..

తప్పుడు ఎన్నికల ప్రణాళిక

ఓటమిని విశ్లేషించటం ఒకింత సులభమే కానీ గెలుపును విశేషించి దాని కారణాలను అర్ధం చేసుకోవటం చాలా క్లిష్టమైన,కష్టమైన పని.
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏదో ఒక సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ చేసి రిపోర్టులు తయారుచేస్తూనే ఉంది. చంద్రబాబుకు 30 సంవత్సరాలుగా సన్నిహితుడైన ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫసర్ నేతృత్వంలో ఒక టీం నిత్యం పనిచేసింది. ఎన్నికల సర్వేలు కూడా ఈ టీం ఆధ్వర్యంలోనే జరిగాయి…

ప్రభావం చూపే 16 పాయింట్లు అని పెట్టుకొని ప్రజల సంతృప్తి ఎలాఉంది?అని ఫోన్ ద్వారా మరియు ఊర్లు తిరిగి అభిప్రాయం సేకరణ చేశారు.. కౌంటింగ్ మొదలైన మొదటి గంట తర్వాత కూడా అద్భుతం జరుగుతుంది టీడీపీ గెలుస్తుందని చెప్పుకున్నారు..

ఈ వైఫల్యానికి కారణం 2014 విజయాన్ని అర్ధం చేసుకోలేక పోవటమే.. 2014 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోకున్నా,పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకున్నా , రైతు రుణ మాఫీ హామీ ఇవ్వకున్నా టీడీపీ గెలిచేది… అలాగే కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలన్న ఏకైక కారణంతో తటస్థులు ఏకపక్షంగా టీడీపీకి ఓటువేశారు.. ఆ ఎన్నికలలో జగన్ ను తిరస్కరించారనటం కన్నా సీనియర్ అయిన చంద్రబాబును కోరుకున్నారు అని అర్ధం చేసుకోవాలి..

కౌంటర్ లేని జగన్ “ఒక్క అవకాశం” నినాదం

ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటంలో విఫలమైన చంద్రబాబు రాష్ట్రం తన కుటుంబ వ్యవహారం అన్నట్లు,రాజధానితో మొదలు పెట్టి ఏ ఒక్క పనికి శాశ్వత పునాదులు వేయకుండా దేశాలు పట్టుకుని తిరుగుతూ కాలం వృధా చేస్తూ ,పనులు పూర్తి కాకపోవటాన్ని కవర్ చేయటానికి గాలిలో కోటలు కడుతూ చెప్పిన మాటలు “ఈయన సీనియారిటీతో రాష్ట్రానికి ఉపయోగం లేదు” అన్న అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించింది.. ప్రత్యేకహోదా ,కేంద్రంతో సంబంధాలు తదితర కీలకమైన అంశాలలో చంద్రబాబు “U టర్న్” తీసుకోవటంతో జగన్ ఏమి చెప్తున్నాడో ప్రజలు వినటం మొదలు పెట్టారు..

జగన్ తాను ఏమి చేయదల్చుకుంది 2017 జూలై 8 న వైసీపీ సమావేశంలో “నవ రత్నాల” ప్రకటనతో చెప్పారు.. వాటినే మిగిలిన 20 నెలలు ప్రచారం చేశారు..

మరోవైపు చంద్రబాబు తాను ఏమి చేసింది చెప్పటం మాని జగన్,మోడీ కలిసి కుట్ర చేస్తున్నారు.. రాష్ట్ర అభివృద్ధిని ఆడుకుంటున్నారు.. అంటూ పాత కాలపు ఎత్తుగడతో పోరాటాలు అని రాష్ట్రం నలుమూలల చేసిన హంగామా ప్రజలలో వ్యతిరేకత పెంచింది తప్ప కనీసం ఒక్క ఓటు కూడా సాధించిపెట్టలేదు..

చంద్రబాబు హుందాగా నేను ఈ ఐదు సంవత్సరాలలో ఈ పనులు చేసాను..మరొక అవకాశం ఇవ్వండి .. అన్ని పనులు పూర్తి చేస్తాను అని ప్రజలకు విజ్ఞప్తి చెయ్యకుండా ఎన్నికల ప్రసంగాలు మొత్తం జగన్ మీద,మోడీ మీద హేళనగా మాట్లాడుకుంటూ వెళ్లారు..

జగన్ “ఒక్క అవకాశం ఇవ్వండి” అన్న విజ్ఞప్తికి కౌంటర్ నినాదం టీడీపీ దగ్గర లేకుండా పోయింది.. టీడీపీ ఎన్నికల ప్రణాళికలు కోసం పెట్టిన వందల కోట్ల ఖర్చు గెలుపును ఇవ్వలేదు సరికదా “సరైన నినాదాన్ని” కూడా ఇవ్వలేక పోయింది..

ఎన్నికల తరువాత..

విషయం బోధపడిందో ఏమో కానీ ఈవీఎంలు ట్యంపర్ చేసారంటూ అన్ని రాష్ట్రాలలోని పాత పరిచయస్తులు దగ్గరికి చంద్రబాబు తిరిగారు.. ఈవీఎంల మీద పోరాడతాను అంటూ ఊగిపోయారు.. నేనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ పోరాటం వలన విమానం ఖర్చులు తప్ప ఒరిగేది ఏమి లేదని ఒకరు చెప్పాలా?.. పోరాటం పేరుతో నలుగురిని కలిసి స్వాంతన పొందటం తప్ప ఏమి లాభంలేకుండా పోయింది.

నువ్వెట్లా ఓడిపోయావయ్యా?

ప్రతిరోజూ వందమంది మహిళలను ఊర్ల నుంచి తీసుకొచ్చి “నువ్వెట్లా ఓడిపోయావయ్యా” అంటూ ఒక ఓదార్పు యాత్ర చేసారు.. ఏ రోజులలో ఉన్నాము?ఇలాంటి నాటకాల వలన చంద్రబాబు బాధకు లేపనం రాసినట్లుండొచ్చు కానీ ప్రజలలో చులకనవుతామన్న ఆలోచన లేకపోవటం ఆయన మైండ్ సెట్ ను తెలియ చేస్తుంది..

ముఖ్యమంత్రి జగన్

జగన్ అధికారం చేపట్టక ముందే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పని మొదలు పెట్టింది.. అదే చంద్రబాబు పదవిలో ఉంటేనా?అంటూ రోజు ఒక కథనం.. చదివే పాఠకులకు అధికార మార్పిడి జరిగిన విషయాన్ని గుర్తించే అవకాశం కూడా ఇవ్వలేదు..

జగన్ పదవిలోకి వచ్చిన ఆరు నెలలకే జగన్ విఫలమయ్యాడు.. చంద్రబాబును ఓడించినందుకు ప్రజలు పశ్చాత్తాపముతో బాధపడుతున్నారంటూ వార్తలు.. ఇవేమి కొత్తవి కాదు 2004 లో కూడా ఇదే టెంప్లేట్ .. అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ అంతే తేడా.. రాసింది అదే పత్రికలూ..

టీడీపీ భవిషత్తు ఎలావుంటుంది?

మూడవ పార్టీ పుట్టి బలపడే వరకు టీడీపీ రాజకీయంగా సజీవంగానే ఉంటుంది.. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. కానీ టీడీపీ పాతకాలపు ప్రణాళికలను,ముఖ్యంగా ప్రత్యర్థి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రచారాలు, పాలనకు నిత్యం అడ్డంకులు సృష్టించటం లాంటి పనులు వీడి.. ప్రజలను గౌరవించటం,అధికార పక్షాన్ని పనిచేయనించి అందులోని లోతుపాతుల మీద నిర్మాణాత్మకంగా స్పందిస్తూ ఉంటే ప్రజలు ముఖ్యంగా తటస్థులు మళ్లీ టీడీపీని గమనించటం మొదలు పెడతారు.

2016 అక్టోబర్లోనే “విద్వేష రాజకీయం” అంటూ అంటూ జగన్ మీద విషం కక్కిన ఆంధ్రజ్యోతి.. జగన్ గెలిచిన తరువాత అదే తరహా కథనాలను రాస్తుంది.. చంద్రబాబు అభివృద్ధి పనులలో బిజీగా ఉంటె జగన్ అన్ని కులాలను కమ్మ కులానికి వ్యతిరేకంగా రెచ్చకొట్టాడని ఆంధ్రజ్యోతి విశ్లేషించింది… ఈ విశ్లేషణలతో ఆంధ్రజ్యోతికి పోయేది ఏమి లేదు.. కానీ జగన్ కోసం సాక్షి ,చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అని ప్రజలు నమ్ముతున్నారు.. ఆంధ్రజ్యోతి రాసే వార్తల ప్రాభవం టీడీపీ మీద అనివార్యంగా పడుతుంది.. కుల కోణాన్నిఎంతగా సృశిస్తే అంత నష్టం అన్న నిజాన్ని చంద్రబాబు తెలుసుకోవాలి,ఆంధ్రజ్యోతి నిలువరించాలి..

2019 ఎన్నికల ముందు,తరువాత కూడా టీడీపీ వ్యవహార శైలిలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు …మహానాడులో కూడా అదే ఆత్మస్తుతి పరనింద …ప్రజలు మళ్ళీ టీడీపీని గమనించటం మొదలు పెట్టాలంటే వారి శైలిలో మార్పు రావలసిందే .. అప్పటి వరకు టీడీపీ విమర్శలు అనుకూల మీడియాను దాటి ప్రజలలోకి వెల్లవు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి