iDreamPost

క‌రోనాపై విజ‌యం ఖాయం: ధీమా కల్పిస్తున్న తాజా క‌థ‌నాలు

క‌రోనాపై విజ‌యం ఖాయం: ధీమా కల్పిస్తున్న తాజా క‌థ‌నాలు

ప్రపంచాన్ని అల్ల‌క‌ల్లోలంగా మార్చేసిన కరోనాపై విజ‌యం ఖాయ‌మ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ‌న దేశం గ‌ట్టెక్కే సూచ‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి. భార‌తదేశానికి ఢోకా లేద‌నే సంకేతాలను ప‌లువురు వైద్య రంగ నిపుణులు అందిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఉదాసీన‌త కూడాద‌ని హెచ్చ‌రిస్తున్నారు. లాక్ డౌన్ వంటి ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు కొన‌సాగిస్తూనే అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

అమెరికా వంటి అగ్ర‌రాజ్యాలు, ఫ్రాన్స్, బ్రిట‌న్, ఇట‌లీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు అత‌లాకుత‌లం అయ్యాయి. చివ‌ర‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం మాల్స్ లూటీ చేసే ప‌రిస్థితి ఆయా దేశాల్లో దాపురించింది. నిత్యం వంద‌ల మంది చావులు, వేల మంది బాధితుల కేసుల గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. కరోనా మ‌హమ్మారిని కంట్రోల్ చేయ‌డం అన్న‌ది నేటికీ అంతుబ‌ట్ట‌క అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి. దేశాధ్య‌క్షుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ అన్ని సెక్ష‌న్లు స‌త‌మ‌తం అవుతున్నాయి.

అదే స‌మ‌యంలో మ‌న‌దేశంలో కూడా క‌రోనా కార‌ణంగా అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. సామాన్యులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను చ‌విచూడాల్సి వ‌స్తోంది. అయినా నేటికీ 95శాతం మంది త‌మ క‌ష్టాల‌కు ఓర్చి లాక్ డౌన్ ను విజ‌యవంతం చేస్తున్నారు. అయితే వ‌ల‌స‌కూలీలు, ఇంకా కొంద‌రు మాత్రం పూర్తిగా భౌతిక‌దూరం పాటించాల‌నే స్పృహ గానీ, అలాంటి అవ‌కాశం గానీ లేక‌పోవ‌డంతో రోడ్డున ప‌డుతున్నారు. ఢిల్లీలో ప‌రిణామాలు చూస్తే ప్ర‌భుత్వాల చిత్త‌శుద్ధి లోపం స్ప‌ష్టం అయ్యింది. స‌రిహ‌ద్దులు పూర్తిగా మూసివేయాల‌ని తాజాగా తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌న్న‌ది అంతుబ‌ట్ట‌కుండా ఉంది.

దేశంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆరుబ‌య‌ట వైర‌స్ వ్యాపించే అవ‌కాశాలు లేవ‌ని వైద్య‌రంగ నిపుణుడు నాగేశ్వ‌ర్ రెడ్డి వంటి వారి అభిప్రాయం ఆశాజ‌న‌కంగా మారింది. క‌రోనా వ్యాప్తి చెందుతున్న తీరు కూడా దానికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ప్ర‌పంచంలోని అనేక దేశాల‌తో పోలిస్తే భార‌త‌దేశంలో చాలా నిదానంగా ఉంది. ఊపిరిపీల్చుకునే అవ‌కాశంగా క‌నిపిస్తోంది. 32 డిగ్రీల ఉష్ణోగ్ర‌త స‌మ‌యంలో క‌రోనా వ్యాప్తికి అవ‌కాశం లేద‌ని నాగేశ్వ‌ర్ రెడ్డి చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఇంటిలోప‌ల ఉన్న స‌మ‌యంలో మొబైళ్లు స‌హా ప‌లుమార్గాల‌లో క‌రోనా వ్యాప్తికి ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు. తెలంగాణా ముఖ్య‌మంత్రి అయితే మ‌రో అడుగు ముందుకేశారు. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితి కొన‌సాగితే ఏప్రిల్ మొద‌టి వారం త‌ర్వాత క‌రోనా ఫ్రీ రాష్ట్రంగా ప్ర‌క‌టిస్తామ‌ని కూడా ధీమా వ్య‌క్తం చేశారు.

దాంతో వాస్త‌వ లెక్క‌లు, సానుకూల సంకేతాలు సంతృప్తినిచ్చే అంశాలుగానే చూడాలి. భార‌తీయుల‌కు క‌రోనా పై గెలుపు పెద్ద క‌ష్టం కాబోద‌ని చెబుతోంది. అయితే క‌రోనా మూలంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చే మార్పులు అనేక స‌మ‌స్య‌ల‌కు దారితీస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అన్నింటికీ మాన‌సికంగా సిద్ధ‌ప‌డి, ధైర్యంగా ఎదుర్కోవ‌డం ద్వారా క‌ష్ట‌కాలాన్ని చేధించ‌డ‌మే ఇప్పుడున్న ఏకైక మార్గం. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌భుత్వాల విధానాలు, ప్ర‌జ‌ల స‌హ‌కారం అత్య‌వ‌స‌రం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి