iDreamPost

Ponniyin Selvan-Prime video125 కోట్లకు ఓటిటి డీల్

Ponniyin Selvan-Prime video125 కోట్లకు ఓటిటి డీల్

మణిరత్నం దర్శకత్వంలో కోలీవుడ్ బాహుబలిగా చెప్పుకుంటున్న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ మీద అక్కడ అంచనాలు మాములుగా లేవు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు అదే టైటిల్ పెడతారా లేక మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఇక్కడ హక్కుల కొనుగోలు జరగలేదు. విక్రమ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా కార్తీ, జయం రవి, త్రిష, జయరాం, ఐశ్వర్య రాజేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండో భాగం కూడా 2023లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.దాని తాలూకు షూటింగ్ కూడా ఇప్పుడే చేస్తున్నారేమో తెలియదు.

అమెజాన్ ప్రైమ్ ఇటీవలే ఈ సినిమా రెండు భాగాల ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ని 125 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక స్ట్రీమింగ్ కు వస్తుంది. కాకపోతే ఎంత గ్యాప్ తర్వాతనేది బయటికి రాలేదు. పొన్నియన్ సెల్వన్ మీద తెలుగు ప్రేక్షకుల్లో ఏమంత ఆసక్తి లేదు. సైరా నరసింహారెడ్డి పట్ల తమిళులకు ఎంతైతే అవగాహన తక్కువో అక్కడ సుప్రసిద్ధమైన సెల్వన్ గాధ ఇక్కడి జనానికి తెలియదు. ఆ నవల తెలుగులోనూ అనువాదితమయ్యింది కానీ ఇప్పటి తరహానికి పెద్దగా ఐడియా లేదు. అందుకే పొన్నియన్ సెల్వన్ మీద అక్కడ ఉన్నంత బజ్ కానీ హైప్ కానీ ఇక్కడ వీసమెత్తు కనిపించడం లేదు.

తన ఒకప్పటి ముద్ర కోల్పోయిన మణిరత్నం దీంతో బలమైన కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. కడలి, విలన్ లాంటి డిజాస్టర్స్ తో అభిమానులు కూడా బాగా నిరాశ చెందారు. పొన్నియన్ సెల్వం తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయిదు వందల కోట్లన్న మాటలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మొత్తానికి సాహో, రాధే శ్యామ్ రేంజ్ లో ఖర్చు పెట్టిన మాట వాస్తవం. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య రాయ్ కం బ్యాక్ చేస్తున్న సౌత్ మూవీ ఇదే. మరి ఈ యుద్ధవీరుడి కథ ప్యాన్ ఇండియా లెవెల్ లో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. పొన్నియన్ సెల్వన్ కి సంగీతం ఏఆర్ రెహమాన్ సమకూర్చడం విశేషం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి