iDreamPost

మనం చాలా గ్రేట్‌ బా..

మనం చాలా గ్రేట్‌ బా..

బావా.. ఏమాట కామాట చెప్పుకోవాలి గానీ.. మనం చాలా గ్రేట్‌ బావా.. అన్నాడు మణి ఆకాశంలోకి చూస్తూ..

మనమంటే నువ్వూ, నూనే నేంట్రా మణీ అంటూ అందుకున్నాడు కిట్టయ్య వెటకారంగా..

మనమంటే మనం కాదు బావా.. పల్లెటూరోళ్ళు అన్నాడు.

ఏంట్రోయ్‌ ఇప్పుడు పల్లెటూరోళ్ళ మీద పడ్డావ్‌.. ఏంటి సంగతి అంటూ రెట్టించాడు కిట్టయ్య.

ఏం లేదు బావా దేశంలోని పేరున్న నగరాల్లో హైదరాబాదు ఒకటంటారు. అక్కడంతా అభివృద్ధి అంటారు. చదువులకు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇక్కడ మంచిదంటుంటారు.. ఇన్ని ఘనతలు ఉన్నప్పటికీ ఓటేసేందుకు తక్కువ మంది రావడ మేంటంటావ్‌.. అంటూ సాగదీస్తున్నాడు మణి.

అబ్బే.. ఇంకేం ఉన్నాయి రా.. నీ డౌట్లు. అన్నీ ఒకే సారి అడిగెయ్‌ ఒక్కోదానికి ఒక్కోసారి బుర్ర తినకు అంటూ తేల్చేసాడు కిట్టయ్య.

అదే బావా ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్న గ్రేటర్‌ హైదరాబాదు వాళ్ళకు ఓటు గొప్పదనం గురించి ఎవ్వరూ చెప్పడం లేదంటావా? చెప్పినా వాళ్ళు విన్పించుకోవడం లేదంటావా? పైగా ఓటు వేయడానికి కరోనా అడ్డొస్తోందని చెప్పుకుంటున్నారట. షికార్లకు, ఫంక్షన్లకు, పండుగలకు పబ్బాలకు మాత్రం కరోనా అడ్డు రాలేదు గానీ, ఓటేసేందుకు మాత్రం అడ్డొచ్చేస్తోందంటున్నారంటే.. అసలు వాళ్ళనెలా అర్ధం చేసుకోవాలంటావ్‌.. సెలబ్రిటీలంతా నెత్తీనోరు మొత్తుకుని, ఇంకా చెప్పాలంటే తిడుతున్నట్టుగానే చైతన్య పరిచే ప్రయత్నం చేసారు.. కానీ స్పందన మాత్రం అంతంత మాత్రమే.. అంటూ డౌట్లు బైటపెట్టాడు మణి.

50శాతం లోపే పోలింగ్‌ జరిగిందని ఎన్నికల కమిషన్‌ లెక్కలు వేసింది. అంటే ఉన్న ఓటర్లలో సగం మంది తనను పాలించే వారిని ఎన్నుకోవడానికి ముందు రాలేదన్న మాట. ఓటేసిన వాళ్ళలో తలో పార్టీకి వేస్తారు. అంటే ఈ లెక్కన గెల్చిన అభ్యర్ధికి వచ్చిన ఓట్లకంటే ఆ అభ్యర్ధికి వ్యతిరేకంగా పోలైన ఓట్లు, అసలు ఓటే వేయని వారి ఓట్లు లెక్కేస్తే.. ఇంక ఆ ఆభ్యర్ధి గెలిచినట్టేనా? అంటూ అనుమానాలను కంటిన్యూ చేసాడు.

ఒరేయ్‌.. బాబూ అంతర్జాతీయ సమస్యల్లోకి నన్ను లాగొద్దురోయ్‌ మణీ. నీకు ముందే చెబుతున్నాను. నాకు తెలిసిందేదో చెబుతాను.. అదీ నువ్వు వింటానంటేనూ.. అంటూ చెప్పడం మొదలెట్టాడు కిట్టయ్య.

పోలింగ్‌ రోజు వచ్చిందంటే ఆ రోజు సెలవే అనుకుంటున్నార్రా జనం. చదువుకు కున్న వాళ్ళు, యువత కంటే వృద్ధులు, దివ్యాంగులు, మధ్య వయస్కులే ఈ విషయంలో నయం రా. వాళ్ళ వాళ్ళ అనుభవాలను బట్టి ఓటు విలువను బాగానే అర్ధం చేసుకున్నారు. తమకు కావాల్సిన నాయకుడ్ని తామే ఎన్ను కోవాలని ఎంత కష్టాన్నైనా తట్టుకుని ఓటేసేందుకు వచ్చారు. ఇక యువత తరం అంటావా? వాళ్ళలోకంలే వాళ్ళుండిపోతున్నార్రా. అసలు ‘మీరే అత్యంత కీలకం రా బాబూ’’ అంటూ వాళ్ళ శక్తిని గురించి వాళ్ళకు చెప్పే నాయకుడెవరున్నార్రా.. అంటూ వేదాంతం లాంటి మాటల్ని మొదలెట్టాడు కిట్టయ్య.

బావోయ్‌.. నేను అడిగిన డౌట్లకు సమాధానం చెప్పకుండా నువ్వు ఇంకొన్ని ప్రశ్నలేస్తున్నా వేంటీ.. నేను చెప్పిందీ.. నువ్వు చెప్పిందీ.. పరిశీలిస్తే.. అసలు బాద్యతగా ఉండాల్సిన వాళ్ళు బాధ్యతగా ఉండడం లేదని తేలింది. అంతేగా.. అంటూ జబ్బమీదున్న తువ్వాలు ఎడం చేత్తో తీసి దులుపుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు మణి.

వీడికేంటి ఇంత చిరకొచ్చేసింది.. అంటూ వాడ్నే చూస్తు ఉండిపోయాడు కిట్టయ్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి