iDreamPost

ముగిసిన పోలింగ్‌.. లాభనష్టాల లెక్కల్లో పార్టీలు..!

ముగిసిన పోలింగ్‌.. లాభనష్టాల లెక్కల్లో పార్టీలు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్‌.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల లోపు క్యూలో ఉన్న వారందరిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ మినహా మిగతా 149 డివిజన్లలో పోలింగ్‌ ముగిసింది. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో ఈ నెల 3వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అప్పటి వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆంక్షలు పెట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 3 సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్‌ను వెల్లడించవచ్చు. 4వ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఉదయం నుంచి పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. ఓట్లు వేసేందుకు నగర ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని నమోదైన ఓటింగ్‌ శాతాన్ని బట్టి తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 30.07 శాతం మాత్రమే నమోదైంది. చివరి రెండు గంటలలో ఎంత పోలింగ్‌ నమోదవుతుందో వేచి చూడాలి. ఈ మొత్తం 40 శాతం వరకూ వచ్చే అవకాశం ఉందని అటు ఎన్నికల సంఘం, ఇటు రాజకీయ పార్టీలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా గ్రేటర్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. అక్కడక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

150 డివిజన్లలో మొత్తం 1,123 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40 శాతం ఓటు వేసినా.. మొత్తం ఓటు వేసిన వారి సంఖ్య దాదాపు 30 లక్షలుగా ఉంటుంది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.25 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ సారి అంతకన్నా తక్కువ పోలింగ్‌ నమోదయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసినా.. స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఓటు వేయాలని ఎన్నికల సంఘం మూడు సార్లు విజ్జప్తి చేయడం నగరంలో ఓటింగ్‌ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. మధ్యాహ్నం తర్వాత బీజేపీ నాయకులు మీడియా ముందుకు వచ్చారు. ఓట్లు వేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తక్కువ పోలింగ్‌ నమోదు కావడంతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే లెక్కలు ఆయా పార్టీలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు సాగినట్లు పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. సాధారణంగా ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు బీజేపీకి మద్ధతుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పలు బస్తీలలో పేదల ఓట్లు గల్లంతుకావడం తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం రాజకీయ పార్టీలకు అంతుచిక్కడం లేదు. నగరంలో కన్నా.. శివారు ప్రాంతాలలో ఎక్కువ పోలింగ్‌ నమోదైంది.

కరోనా కారణంగా ఓటింగ్‌ శాతం తగ్గిందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా సంపన్న వర్గాలు, సీనియర్‌ సిటిజన్లు రిస్క్‌ తీసుకోలేదంటున్నారు. హైదరాబాద్‌లో ఓటు హక్కు కలిగిన వలస కూలీలు కరోనా కారణంగా వారి స్వస్థలాలకు వెళ్లడం వల్ల పోలింగ్‌ శాతం తగ్గిందనే అంచనాలున్నాయి. మొత్తం మీద తక్కువ పోలింగ్‌ నమోదు కావడం రాజకీయ పార్టీలలో టెన్షన్‌ను రేకెత్తిస్తోంది. బ్యాలెట్‌ బ్యాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 4వ తేదీన వెల్లడికాబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి