iDreamPost

కేంద్ర మంత్రిగా బాలశౌరి

కేంద్ర మంత్రిగా బాలశౌరి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. 22 యంపిలతో పార్లమెంటులో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో పాటు మరో రెండు నెలల్లో రాజ్య సభలో వై.సి.పి బలం 6కు పెరగబోవటంతో కేంద్రప్రభుత్వం తన క్యాబినేట్ లోకి వై.సి.పిని ఆహ్వానిస్తుందా అనే ఊహాగానాలు బలపడుతున్నాయి. దీంతో కేంద్ర క్యాబినేట్లోకి ఎవరు వెళ్లబోతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. విజయసాయిరెడ్డి పేరు దాదాపు గా ఖరారు అయినా మరొకరు మాత్రం మచిలీపట్నం నుంచి ఎన్నికైన వల్లభనేని బాలశౌరి పేరు ప్రముఖంగా వినబడుతోంది.

బాలశౌరి నేపథ్యం:

గుంటూరు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో 1968వ సంవత్సరంలో జన్మించిన వల్లభనేని బాలశౌరి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బి.ఏ పూర్తి చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి స్వతహాగా వ్యాపారవేత్త అయినా రాజకీయాలపై తనకి ఉన్న ఆసక్తితో తన 36వ ఏటనే రాజకీయల్లోకి అడుగుపెటారు.

ఆర్ధికంగా బలవంతుడు కావడం దీనికి తోడు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండటంతో 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున తెనాలి పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటి చేసి అప్పటి తెలుగుదేశం నేత అయిన ఉమారెడ్డి వెంకటేశ్వరులుపై గెలిచారు. వై.యస్ పాదయాత్ర ప్రభంజనంలో తొలిసారిగా పార్లమెంటుకి ఎన్నికైన బాలశౌరి 2009లో నర్సరావుపేట లోక్సభ నుండి పోటీ చేసినా మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఒటమి పాలయ్యారు. వై.యస్ మరణానంతరం కాంగ్రెస్ లోనే కొనసాగిన బాలశౌరి , కాంగ్రెస్ పార్టీ వై.యస్ జగన్ పై కేసులు మోపి వేదించడాన్ని నిరసిస్తు ఆ పార్టీకి రాజీనామా చేసి 2013 సెప్టెంబర్ 13న జగన్ తో సమావేశం అయిన బాలశౌరి తాను వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టిలో చేరతాను అని ప్రకటించారు.

2014 ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి తరుపున పోటి చేసి గల్లా జయదేవ్ చేతిలో 69,111 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మచిలీపట్నం పార్లమెంటు నుండి పోటి చేసి భారీ మెజారిటితో గెలిచి తన సత్తా చాటారు. దీంతో తండ్రి తనయుడు చేసిన పాదయాత్ర గాలిలో గెలిచిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు నమ్మకస్తుడిగా , రాష్ట్ర సమస్యలపై అనర్ఘలంగా మాట్లాడగలిగే వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు పొందిన వల్లభనేని బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవాకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఉహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాల నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి