iDreamPost

జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలలో ఉత్కంఠ పోరు

జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలలో ఉత్కంఠ పోరు

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికలలో అధికార జెఎంఎం,కాంగ్రెస్,ఆర్జేడి కూటమి,ప్రతిపక్ష బిజెపి హోరాహోరి తలపడుతున్నారు. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార కూటమి నుంచి ఇద్దరు అభ్యర్థులు,ప్రతిపక్ష బిజెపి నుండి ఒక అభ్యర్థి బరిలో దిగారు. అధికార కూటమి నుంచి ఒక అభ్యర్థి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది.కానీ రెండో స్థానానికి పోటీపడుతున్న కాంగ్రెస్ తో పాటు,ప్రతిపక్ష బిజెపికి కూడా సమాన స్థాయిలో 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠత నెలకొంది.గత అసెంబ్లీలో బిజెపి మిత్రపక్షమైన ఎజెఎస్‌యుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఆధారంగా రాజ్యసభ ఎన్నికల ఫలితం తేలే అవకాశం ఉంది.

జూన్ 19న జరిగే జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జెఎంఎం అధ్యక్షుడు శిబూ సోరెన్‌తో సహా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఖాళీ కాబోతున్న (ప్రస్తుతం ఖాళీ) రెండు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత సోరెన్, కాంగ్రెస్ అభ్యర్థి షాజాదా అన్వర్,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ ప్రకాష్ తమ నామినేషన్ పత్రాలను గత మార్చిలో దాఖలు చేశారు.

వాస్తవానికి రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు మార్చి 26న జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రేరిత లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాథ్వానీ,ఆర్జేడీ ప్రేమ్ చంద్ గుప్తా పదవీకాలం గత ఏప్రిల్‌లో ముగిసింది.జార్ఖండ్ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో పోలింగ్ తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 82 మంది సభ్యులు గల జార్ఖండ్ అసెంబ్లీలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.గత అసెంబ్లీ ఎన్నికలలో రెండు సీట్ల నుండి విజయం సాధించిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైట్ ని అసెంబ్లీ స్థానాన్ని ఉంచుకొని డుమ్కా సీటుకు రాజీనామా చేశారు.అలాగే గత నెలలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ సింగ్ మరణించడంతో బెర్మో అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది.ఇక రాజ్యసభ ఎన్నికలలో నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు హక్కు లేదు. దీంతో రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 79 గా ఉంది.

కాగా అధికార కూటమి బలపరిచిన శిబూ సోరెన్,షాజాదా అన్వర్‌కు మొత్తం 52 మంది ఎమ్మెల్యేల మద్దతు గలదు.వీరిలో కూటమికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) 29 ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ 15 ఎమ్మెల్యేలు,రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) 2 ఎమ్మెల్యేలు,నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఒక ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజా తాంత్రిక్)కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు,మరో ఇద్దరూ స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.

ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష భాజపా పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజెఎస్‌యు) పార్టీ ఇద్దరి ఎమ్మెల్యేలతో పాటు,సిపిఐ (ఎంఎల్-లిబరేషన్)కు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటు  అభ్యర్థుల విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ తమ మద్దతు ఎవరికి అనేది ఎజెఎస్‌యు పార్టీ ప్రకటించకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తుంది. ఇక అతివాద వామపక్ష పార్టీ అయిన సిపిఐ (ఎంఎల్-లిబరేషన్) కాషాయ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు.అలాగే ఎన్నికల సమయానికి ఎజెఎస్‌యు కూడా అధికార కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి