iDreamPost

ట్విట్టర్ ఆఫీస్ మీద పోలీస్ రైడ్

ట్విట్టర్ ఆఫీస్ మీద పోలీస్ రైడ్

సామాజిక మాధ్యమం ట్విట్టర్ తో కేంద్రం తగాదా తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పలు అంశాలలో విబేధాలు బయటపడిన నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఈసారి కేంద్రం అడుగుముందుకేసి ఢిల్లీ పోలీసులతో ట్విట్టర్ కార్యాలయంలో తనిఖీలకు సిద్ధపడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇటీవల పలు అంశాలలో ప్రధానంగా కోవిడ్ ఇండియన్ వేరియంట్ అని పేర్కొనడం వంటి విషయాల్లో కేంద్రం తన అభ్యంతరాలను బహిరంగంగానే వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు కూడా స్పందించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారం కలకలం రేపుతోంది. మ్యానిపులేటెడ్ వీడియో అంటూ ట్విట్టర్ ట్యాగ్ చేయడం బీజేపీ పెద్దలకు మింగుడుపడడం లేదు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సహా పలువురు బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు తప్పుడు సమాచారంతో ట్వీట్ చేశారంటూ ట్విట్టర్ నిర్ధారించడం వివాదానికి మూలంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై మ్యానిఫులేటెడ్ అనే ట్యాగ్ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమాచార, సాంకేతిక చట్టంలోని నిబంధనలు ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసేందుకు కేంద్రానికి అధికారం లేదనీ, ఇది కచ్చితంగా మీడియాను సెన్షార్‌ చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. బీజేపీ నేతల తప్పుడు ట్వీట్లపై స్పందిస్తే కేంద్రం ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని పలువురు ఐటీ నిపుణులు కూడా వ్యాఖ్యానించారు.

ట్విట్టర్‌ మాత్రం కేంద్రం ఆదేశాలకు భిన్నంగా స్పందించింది. పైగా కేంద్రం ఆదేశాల తర్వాత మరింత మంది బీజేపీ నేతల హ్యాండిల్స్ కి ఆ ట్యాగ్ ని జతచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండే ఢిల్లీ పోలీసులతో ట్విట్టర్‌ కార్యాలయంపై కేంద్రం సోదాలు జరపడంతో వివాదం ముదిరినట్టయ్యింది. వారెంట్‌ కూడా ఇవ్వకుండానే ఈ సోదాలు చేపట్టడం కచ్చితంగా కక్షసాధింపు చర్యేనని కొందరు విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం వెనుకడుగు వేసేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్- కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదానికి ముగింపు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : టీడీపీ కి తలవంపులు, వారి శవరాజకీయాలకు షాక్ ఇచ్చిన డాక్టర్ సుధాకర్ కుటుంబం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి