iDreamPost

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు

ఇంట్లో చాలా మంది వంట చేసుకోవడం మానేయడంతో హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్స్ సెంటర్లకు రెక్కలు వచ్చాయి. జనాల బద్దకాన్ని క్యాష్ చేసుకున్న ఇవి.. రుచి, శుచి, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి. అంతేనా నిల్వ చేసిన పదార్థాలను సైతం కస్టమర్లకు అంటగడుతున్నాయి. కొన్ని రెస్టారెంట్లలో అయితే కుళ్లిన పదార్థాలను కూడా వంటకు వినియోగించిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఫుడ్స్‌లో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు వచ్చిన ఘటనలు గురించి చదివాం, చూశాం.  ఇటీవల ముంబయిలో చికెన్ కర్రీలో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రముఖ హోటల్ కూడా నాణ్యత లేని  ఆహారాన్ని కస్టమర్లకు అందించి.. వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆ హోటల్ ఏదంటే ఆల్ఫా.

హైదరాబాద్ నగర వాసులకు ఆల్ఫా హోటల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఈ హోటల్‌ను నగర ప్రజలే కాకుండా కొత్తగా సిటీకి వచ్చిన వారు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ రుచితో పాటు తక్కువ ధరకే తిను బండారాలు లభించడం. ఆల్ఫా హోటల్‌కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ చరిత్రకు మసక బారేలా చేసుకుంది ఆ సంస్థ మేనేజ్ మెంట్. ఇంతకు ఏం జరిగిందంటే.. ఆల్ఫా హోటల్లో ఆహారం తిని అస్వస్థతకు గురైన వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం లోయర్ ట్యాంక్ బండ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ జమాలుద్దీన్ తన స్నేహితులు మహ్మద్, ప్రవీణ్, ఖలీల్, ఉస్మాన్ ఖాన్లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ఆల్ఫా హోటల్‌కి వెళ్లారు.

అక్కడకు వెళ్లాక మటన్ కీమా రోటీ తీసుకుని తిన్నారు. తిన్న కొద్ది సేపటికే జమాలుద్దీన్ స్నేహితుడు మహ్మద్ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే వాంతులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని సిబ్బందికి సూచించారు జమాలుద్దీన్. అరగంట తర్వాత ఓ వ్యక్తి తను మేనేజర్‌ను అంటూ రాగా, జరిగింది చెప్పారు. రోటీ నుండి దుర్వాసన కూడా వస్తుందని చెప్పగా అతడేమీ పట్టించుకోలేదు. దీంతో జమాలుద్దీన్ ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మార్కెట్ పోలీసులు ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై ఐపీసీలోని సెక్షన్ 273, 336 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి