iDreamPost

సెలూన్ షాపులకు పచ్చజెండా.. షరతులు వర్తిస్తాయి

సెలూన్ షాపులకు పచ్చజెండా.. షరతులు వర్తిస్తాయి

మూడో దశ లాక్ డౌన్ రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సెలూన్ షాపులు నిర్వహించుకోవచ్చు అని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని కార్యకలాపాలతో పాటు సెలూన్ షాప్లు మూతపడ్డాయి. ఫలితంగా కొంతమంది సెలూన్ షాపుల వారినే తమ ఇళ్లకు పిలిపించుకుని హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో అన్ని రకాల దుకాణాలకు తెరుసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో సెలూన్ షాపులకు కూడా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ఇక మద్యం అమ్మకాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో మరింత స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రెడ్ జోన్లలో కూడా మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంటూ ఒకేసారి దుకాణం వద్దకు ఐదుగురు మాత్రమే అనుమతి ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం దుకాణాలు తెరిచి అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపట్నుంచి దుకాణాలు తెరిచి అందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఈ నెల 7వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుసుకునేందుకు అవకాశం లేదు.

రెండో విడత లాక్ డౌన్ మే 3 వరకూ కేంద్ర ప్రభుత్వం విధించగా దాన్ని తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు పొడిగించింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలిస్తూ జారీచేసిన మార్గదర్శకాలు తెలంగాణలో మే 7వ తేదీ వరకు అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ నెల 5వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ఏ అంశాలకు సడలింపు ఇవ్వాలని దానిపై చర్చించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సడలింపులను ప్రకటించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి