iDreamPost

పవన్ ఎఫెక్ట్ – దర్శకుల ట్రబుల్

పవన్ ఎఫెక్ట్ – దర్శకుల ట్రబుల్

ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేయడం మాటల్లో చెప్పుకున్నంత సులభంగా ఉండదు. ఉదాహరణకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బొబ్బిలి పులి, మన దేశం పూర్తి చేసి సినిమాలకు స్వస్తి చెప్పారు. ప్రచారం కోసం రేయి పగలు తేడా లేకుండా తిరిగి అధికారంలోకి వచ్చారు. తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత కానీ మేకప్ వేసుకునే తీరిక దొరకలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు శంకర్ దాదా జిందాబాద్ తో సెలవు తీసుకుని ఏళ్ళ తరబడి పొలిటికల్ జర్నీ చేశారు. వర్కౌట్ కాదని తెలిశాక బయటికి వచ్చి ఇప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ పవన్ వ్యవహారం వేరేలా ఉంది.

ఒకపక్క హరిహర వీరమల్లు ఆపేశారు. దర్శకుడు క్రిష్ తో ఏవో విబేధాలన్నారు అవి నిజమా కాదా అనేది బయటికి చెప్పలేదు. ఆయనేమో వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోతున్నాడు. ఈ సినిమా కోసం జుత్తు పెంచుకున్న పవన్ ఇటీవలే మళ్ళీ నార్మల్ హెయిర్ స్టైల్ కి వచ్చారు. ఇది వినోదయ సితం రీమేక్ కోసమనే ప్రచారం ఉంది. హరీష్ శంకర్ తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ ఎలాంటి సౌండ్ చేయడం లేదు. అతనూ విసుగొచ్చి ఇది సెట్ అయ్యేలోపు వేరొకరితో కొత్త కథతో సినిమా తీసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ గ్యాప్ లోనే రెండు వెబ్ సిరీస్ లు, ఒక సునీల్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ లను పూర్తి చేశాడు హరీష్ శంకర్. క్లారిటీ లేకపోవడం వల్లే ఇదంతా.

ఎన్నికలు ఇంకో రెండేళ్ల లోపే వస్తాయి. జనసేన కోసం తిరగాలనుకున్నప్పుడు ఇప్పుడీ సినిమాల వ్యవహారం పూర్తి చేస్తే దర్శకులకు నిర్మాతలకు టెన్షన్ ఉండదు. అలా కాకుండా ఉన్నట్టుండి బ్రేకులు వేయడం వల్ల మానసికంగా ఆర్థికంగా జరిగే నష్టం చాలా ఎక్కువ. పవన్ ఆ కోణంలో ఆలోచిస్తున్నాడో లేదో కూడా తెలియదు. అఖిల్ తో ఏజెంట్ చేస్తున్న సురేందర్ రెడ్డికి సైతం పవన్ ఒక కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అది జరిగే నమ్మకం మెల్లగా సన్నగిల్లుతుంది. 2024లో తిరిగి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాక కానీ మళ్ళీ సినిమా కెరీర్ గాడిన పడేలా లేదు. ఈ ఏడాది మాత్రం అభిమానులు ఒక్క భీమ్లా నాయక్ తో సర్దుకోక తప్పదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి