iDreamPost

పవన్‌ ప్రజా సేవ.. చిత్తశుద్ధి మిస్‌ అయింది..

పవన్‌ ప్రజా సేవ.. చిత్తశుద్ధి మిస్‌ అయింది..

ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి ప్రధాన కారణం ఆయనలో లోపించిన చిత్తశుద్ధే ప్రధాన కారణం. ఇది పవన్‌ కళ్యాణ్‌ మరో సారి రుజువు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 2017లో అత్యాచారం, హత్యకు గురైన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ‘‘ర్యాలీ ఫర్‌ జస్టిస్‌’’ పేరుతో కర్నూలు రాజ్‌ విహార్‌ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు ఈ రోజు బుధవారం (ఫిబ్రవరి – 12) ర్యాలీ నిర్వహించతలపెట్టారు.

ఓ ఆడపిల్లకు న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం నిజంగా అభినందనీయమే. కానీ 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో టీడీపీ నేత వి.జనార్థన్‌ రెడ్డి కుమారులే నిందితులు. అప్పట్లో వారిని అరెస్ట్‌ చేసినా కేవలం 23 రోజులకే బెయిల్‌ పై విడుదలయ్యారు. ఘటన జరిగిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ టీడీపీతో పొత్తులో ఉన్నారు. అప్పుడు సుగాలి ప్రీతి అత్యాచారం, హత్యపై మారు మాట్లాడని పవన్‌ కళ్యాణ్‌.. ఘటన జరిగిన ఇన్నేళ్ల తర్వాత మాట్లాడడంపైనే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ కేసును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సీబీఐకి అప్పగించింది. కేసుకు సంబంధించిన వివరాలను కేంద్రహోంశాఖకు ఇప్పటికే పంపించింది.

ఘటన.. పూర్వా పరాలు..

కర్నూలు లక్ష్మీ గార్డెన్ లో నివాసం ఉంటున్న సుగాలి రాజు నాయక్, పద్మావతిల కుమార్తె 14ఏళ్ళ సుగాలి ప్రీతి. తెలుగుదేశం నేత అయిన వి.జనార్ధన రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో 10వ తరగతి చదివేది, 2017 ఆగస్టు 19న ఫ్యాన్ కి ఉరి వేసుకుని కనిపించింది. స్కూల్ యాజమాన్యం ఆత్మహత్య అని చెప్పగా.. స్కూల్ అధినేత కొడుకులు హర్ష వర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు.

కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పొస్టూమార్టం చేసిన డాక్టర్ శంకర్ ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్టులో బాలికపై అత్యచారం జరిగిందని చెప్పారు. పాథాలజి హెచ్.ఒ.డి డాక్టర్ బాలేశ్వరి కూడా ఆగస్టు 21న ఇచ్చిన రిపోర్టులో అత్యాచారం జరిగిందనే చెప్పారు. దీంతో ప్రీతి తల్లితండ్రులు కాలేజీ యాజమాన్యం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నిందితులపై పోలీసులు పోక్సో సెక్షన్ 302, 201, యస్.సి, యస్.టి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పై విచారణకు కలక్టర్ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. ఈ కమిటీ కూడా విద్యార్ధినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని రిపోర్టు ఇచ్చింది.

సాక్ష్యాలు ఇలా పక్కాగా ఉన్నా అరెస్టు అయిన నిందితులకి 23 రోజులకే బెయిల్ వచ్చింది. నిందితులకి తెలుగుదేశం నేత నంద్యాల లోక్ సభ అభ్యర్థి మాండ్ర శివానంద రెడ్డి అండగా నిలబడి కేసుని నీరుకార్చే ప్రయత్నం అడుగడుగునా చేశారని, నిందితులని తన ఇంట్లో పెట్టుకుని కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. కేసుని నీరు కార్చేందుకు తెలుగుదేశం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సుగాలి ప్రీతి తల్లి దండ్రులు జాతీయ మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేసును సి.ఐ.డి కి అప్పగించింది. అయినా దర్యాప్తులో జాప్యం జరుగుతూ వచ్చింది. రాజకీయ నేతల ఒత్తిళ్ళతోనే కేసులో ఇంత జాప్యం జరుగుతోందని.. కేసుని సి.బి.ఐ కి అప్పగించాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. 2017 ఆగస్టు 18న స్కూల్ యాజమాన్యం కొడుకులు అక్కడ మందు పార్టీ చేసుకున్నారని పలు నివేదికలలో పేర్కొన్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి ప్రీతి తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు.

2017 లో హత్యాచారం, హత్య చేయబడ్డ సుగాలి ప్రీతి కేసుని గత ప్రభుత్వం నీరు కార్చే ప్రయత్నం అడుగడుగునా చేస్తే, జగన్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే కర్నూల్ వెళ్ళిన హోంమంత్రి సుచరిత.. సుగాలి ప్రీతి కేసుని తిరిగి విచారణ చెపడతామని హామీ ఇచ్చారు. గత ఏడాది  ఏఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విచారణ ప్రారభించారు. రిపోర్టు వచ్చిన వెంటనే చర్యలు ఉంటాయని ఆనాడే హోంమంత్రి హామీ ఇచ్చారు. ఐతే సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సీబీఐ విచారణకు విజ్ఞప్తి చేయగా.. ఆ మేరకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నిందితుల పేర్లు పవన్ పలుకుతారా..?

టీడీపీ ప్రభుత్వహాయంలో ఘటనజరిగిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పవన్‌ కళ్యాన్‌కు సుగాలి ప్రీతి గుర్తుకు రావడం విశేషం. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ ఘటన తర్వాత ఒకసారి సుగాలి ప్రీతి ఘటనను పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావించారు. ఇప్పుడు ఈ కేసు విచారణ సీబీఐకి వెళ్లిన తర్వాత మళ్లీ బయటకొస్తున్నారు. ఈ సారైనా.. ప్రీతి అత్యాచారం, హత్య కేసులో నిందితులైన టీడీపీ నేత వి.జనార్థన్‌ రెడ్డి కుమారులు హర్ష వర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి పేర్లు, వారిని రక్షించిన టీడీపీ నేతల పేర్లు పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావిస్తారా..? లేక అందిన స్క్రిప్ట్‌ ప్రకారం ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి