iDreamPost

ఆ నిందితులెవరో.. ఆ దోషులెవరో.. శిక్షించండి : సుగాలి ప్రీతి ఘనటపై పవన్‌ కళ్యాణ్‌

ఆ నిందితులెవరో..  ఆ దోషులెవరో.. శిక్షించండి : సుగాలి ప్రీతి ఘనటపై పవన్‌ కళ్యాణ్‌

సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో దోషులెవరో.. నిందితులవరో..వారిని కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. పోలీసుల విచారణకు స్థానిక నేతలు అడ్డుకుంటున్నారని తెలిసిందని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. సీబీఐకి అప్పగించకపోతే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని, కర్నూలులో ఒక్క రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ రోజు ఆయన కర్నూలు లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

తాను కడపు మండి ఉన్నానని, ఆవేదనతో ఉన్నా సంయమనంతో మాట్లాడుతున్నానని పవన్‌ అన్నారు. సినిమాల్లో అయితే రెండు గంటల్లో న్యాయం చేయొచ్చని, కానీ ఇక్కడ అలా సాధ్యం కాదన్నారు. దిశా ఘటన జరిగినప్పుడు బలంగా స్పందించిన సీఎం జగన్‌.. సుగాలి ప్రీతి విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌ చేయమని చెప్పడంలేదని, ఓ విద్యా సంస్థలో ఘటన జరిగితే ఇన్ని రోజులు న్యాయం జరగలేదన్నదే తన ఆవేదనన్నారు. రాజకీయ వ్యవస్థ ఇలాంటి వారికి అండగా ఉంటే ఎవరికి చెప్పుకుకోవాలని ప్రశ్నించారు.

కర్నూలులో జ్యూడిషియల్‌ క్యాపిటల్‌ పెట్టినా.. సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోతే ఏం లాభమని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. సుగాలి ప్రీతి తల్లి ఇన్నేళ్లుగా న్యాయం కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్ణయాలపై రివర్స్‌టెండర్‌ వేస్తున్న జగన్‌ రెడ్డి సుగాలి ప్రీతి ఘటనపై ఎందుకు న్యాయం చేయడంలేదన్నారు. కర్నూలులో బలమైన వైఎస్సార్‌సీపీ నేతలున్నారని, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సుగాలి ప్రీతికి న్యాయం చేసేందుకు వారు రావడంలేదని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి