iDreamPost

చిరంజీవి వల్లే జనసేన ఓడిపోయింది – పవన్ కళ్యాణ్

చిరంజీవి వల్లే జనసేన ఓడిపోయింది – పవన్ కళ్యాణ్

జనసేనకు ప్రజారాజ్యం భారం అయ్యిందా?

చిరంజీవి తమ్ముడిగా సినీ అరంగేట్రం,”యువరాజ్యం” అధ్యక్షుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ మొన్న విడుదల చేసిన ఒక లేఖలో “ప్రజారాజ్యం(పీఆర్ఫీ) అన్న ప్రాసెస్ లేకుండా ‘జనసేన’ పార్టీ వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది” పేర్కొన్నారు

ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన ఏ పార్టీ అయినా హుందాగా ఓటమిని అంగీకరించి, దానికి కారణాల్ని బేరీజు వేసుకుని, వారి వైఫల్యాల్ని విశ్లేషించుకుని పార్టీని ఏ విధంగా నడిపించాలని నిర్ణయించుకుని ముందుకు పోవడం శ్రేయస్కరం కానీ, తమ ఓటమికి మరొకరిని కారణంగా చూపిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చడం ఎవరికీ, ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. సినీ వినీలాకాశంలో తిరుగులేని పేరు సంపాదించుకున్న ‘మెగాస్టార్’ చిరంజీవి రాజకీయాల్లో ఏం సాధించాడు, ఏం సాధించలేదు? అనేది గడిచిపోయినా చర్చ. కానీ ప్రజారాజ్యం ఏర్పాటుకు చిరంజీవి మరియు ఆయన బృందం ముందస్తు ప్రణాళిక బద్దంగా పని చేశారు. సినిమాలను వదిలేసి పూర్తి సమయం రాజకీయాల మీద ద్రుష్టి కేంద్రీకరించారు.

Read Also: బీజేపీ తో భేటీ తర్వాత రాజధానిపై పవన్ ఏమన్నారంటే..

రాజకీయంగా తన వెంట నడవాలనుకున్న అభిమానులకు స్పార్క్ (SPARK), వారధి, స్పందన వంటి కార్యక్రమాల ద్వారా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. వాటిలో సుశిక్షితులైన వారిని ఆయా వ్యక్తుల శక్తిసామర్ధ్యాల మేరకు రకరకాల విభాగాల్లో నియమించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలు వేసి వాటిలో సామాజిక న్యాయం ఉండేలా చూసుకున్నారు.75 లక్షల ఓట్లు, పద్దెనిమిది సీట్లు గెలిచిన ప్రజారాజ్యం అనే పార్టీని ఒక “ప్రాసెస్”గా(తెలుగులో చెప్పాలంటే ఒక తంతుగా) పేర్కొన్న జనసేన, ప్రజారాజ్యం పార్టీ నిర్మాణ ‘ప్రాసెస్’ ను ఫాలో అయ్యుంటే గత ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలను సాధించేది. కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచి ఉండేవాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వంటి రాజకీయ ఉద్ధండ ముఖ్యమంత్రి పణాళికలను తట్టుకుని, పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీచేసి18 సీట్లు గెలవగలిగారు.దాదాపు 25 సీట్లలో రెండో స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ లాగా చిరంజీవి కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఉంటే స్వల్ప తేడాతో ఓడిపోయిన కొన్ని స్థానాల్లో గెలవగలిగేవాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాగా మోడీ, చంద్రబాబు వాగ్దానాలకు నాది హామీ అని చెప్పే తనకు మాలిన ధర్మం రాజకీయాలు చేయలేదు.

కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడమే జనసేన పేర్కొన్న “ప్రాసెస్” అనుకుందాం. ఆ పరిస్థితి రాకుండా పీఆర్ఫీ కోసం ‘యువరాజ్యం’ ప్రెసిడెంట్ గా కళ్యాణ్ ఏం చేశారు ? 2009 ఎన్నికలు అయిపోయిన మరుసటి సంవత్సరం నుంచి కొమరం పులి, తీన్ మార్, పంజా వంటి ‘సందేశాత్మక’ చిత్రాల్లో నటించారు కానీ పార్టీని బలపరిచే కార్యక్రమాలేవీ చేసిన దాఖలాలు లేవు. 2010 సంవత్సరంలో విశాఖపట్నంలో జరిగిన ‘ప్రజారాజ్యం’ ప్లీనరీకి సైతం కల్యాణ్, నాగబాబులు కూడా హాజరు కాలేదు.

Read Also: అంతన్నాడింతన్నాడో పవన్ బాబు…

2003 ఏప్రిల్ నెలలో సరిగ్గా ‘జానీ’ సినిమా విడుదలకు ముందు తన మీద వచ్చిన వార్తలు అసత్యాలని ‘డెక్కన్ క్రానికల్’ అనే ఆంగ్ల దినపత్రిక కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేసి నిరసన తెలియజేశారు కళ్యాణ్. ఎన్నికలకు ముందు ‘ప్రజారాజ్యం’ పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని ఇష్టానుసారం వార్తలు వచ్చినప్పుడు కానీ పార్టీ కార్యాలయంలోనే కూర్చుని పరకాల ప్రభాకర్ పార్టీ మీద ఆరోపణలు చేసినప్పుడు కానీ ఎన్నికల తర్వాత ‘జెండా పీకేద్దాం’ శీర్షికన పార్టీ ని మూసేయబోతున్నారని వార్తలు వచ్చినప్పుడు కానీ ఎన్నడూ కళ్యాణ్ ప్రశ్నించలేదు. ‘డెక్కన్ క్రానికల్’ ముందు కూర్చుని ధర్నా చేసినట్టు  ‘యువరాజ్యం’ ప్రెసిడెంట్ ఎన్నడూ, ఎక్కడా నిరసన తెలియజేయలేదు. 

ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా పీఆర్పీ ఎమ్మెల్యేలను వైసీపీ లాక్కుంటుంది అన్న ప్రచారం జరుగుతున్న దశలో ” మీరు పడగొడితే నేను నిలబెడతాను” అన్న చిరంజీవి, తదనంతర పరిణామాల్లో పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసాడు. విలీనం కూడా గౌరవ ప్రదంగా అంటే నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చిరంజీవి ఇంటికొచ్చి చర్చించారు. పవన్ కళ్యాణ్ లాగా ఢిల్లీలో పడిగాపులు పడి చివరికి నడ్డా లాంటి నాయకుడితో చర్చించలేదు.

Read Also: పవన్‌ను బాగా మోటివేట్‌ చేసినట్టున్నారు

ప్రజారాజ్యం పార్టీ విలీనం దిశగా అడుగులేసినప్పటికీ ఆ విషయమై చిరంజీవి ఎన్నడూ కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ మూడు రోజుల పాటు నడ్డా అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూసి భాజపాతో పొత్తు కుదుర్చుకుని వచ్చిన కళ్యాణ్ – భాజపానే జనసేనలో కలిసేందుకు ఆసక్తి కనబరిచింది అని చెప్పడం విడ్డూరం.  

ఏ కాంగ్రెస్ పార్టీ వారినుద్దేశించి పవన్ కళ్యాణ్, ‘పంచెలు ఊడగొట్టండి’ అంటూ ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం కళ్యాణ్ కు నచ్చలేదనుకుందాం. తమ పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏవైనా తమకు నచ్చనప్పుడు ఆ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు కూడా తమ ఉద్దేశాన్ని తెలియజేసి పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భాలు మనం తరచూ చూస్తుంటాం. కల్యాణ్ అలాంటివేమీ అప్పుడు చేయకుండా, మూడేళ్ళ తర్వాత ఎయిర్ కండిషన్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరగడం అర్ధరహితం. 

Read Also: కూల్చివేయడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా పవన్ కళ్యాణ్ ?

ఏది ఏమైనా ‘జనసేన’ పార్టీ స్థాపించి దాదాపు ఆరు సంవత్సరాలైంది. ఈ ఆరేళ్లలో అయిదు పార్టీలతో కలిసి తిరిగారు తప్ప పార్టీని సంస్థాగతంగా నిర్మించే విషయంలో కళ్యాణ్ ఎటువంటి ఆసక్తి చూపలేదు. పదమూడు జిల్లాల ఇంఛార్జీల పేర్లయినా ఆలోచించకుండా కల్యాణ్ చెప్పగలరా, లేరా అనేది అనుమానమే ? ‘జనసేన’ ఘోరపరాజయాన్ని అంగీకరించలేక; అంత కన్నా ఎక్కువగా వైఎస్ జగన్ కు ప్రజలందించిన అద్భుత విజయాన్ని ఓర్వలేక ఇంతకాలం కళ్యాణ్ ఎన్నో కారణాలు చెబుతూ, ఎంత విషం కక్కినా అతని వెనకనున్న వాళ్ళు ఆహా ఓహో అంటూ, పవర్ స్టార్ అంటూ కేకలు పెట్టారు. కానీ ఆ కారణాల్లో ప్రజారాజ్యం పార్టీని కూడా చేర్చడమనేది కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో చారిత్రక తప్పిదమవ్వడం తథ్యం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి