iDreamPost

సొంత రోడ్ మ్యాప్ లేనప్పుడు సొంత పార్టీ ఎందుకు?

సొంత రోడ్ మ్యాప్ లేనప్పుడు సొంత పార్టీ ఎందుకు?

సొంతంగా రాజకీయపార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీకి సొంతంగా రాజకీయ ఎజెండా కూడా ఉండాలి. అలా సొంత పార్టీ మాత్రమే ఉండి సొంత ఎజెండా లేకపోవడం ఏ తరహా రాజకీయమో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పాలి. అలా సొంత రాజకీయపార్టీ ఉండి దానికి రాజకీయ ఎజెండా లేక రోడ్ మ్యాప్ కోసం ఇంకో రాజకీయపార్టీపై ఆధారపడడం రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నాం. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎలా అర్ధం చేసుకుంటున్నారో కానీ, ప్రత్యర్థులే కాదు రాజకీయవిశ్లేషకులు కూడా దీన్ని ఓ రాజకీయ సినిమాగా మాత్రమే చూస్తున్నారు. 

సినిమాల్లో స్క్రిప్ట్ ఒకరిది ఉంటుంది. డైలాగ్స్ ఇంకొకరివి ఉంటాయి. దర్శకత్వం ఒకరిది, మొత్తం నిర్మాణ బాధ్యతలు వేరొకరివి. నటుడు లేదా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కేవలం ఆ స్క్రిప్ట్ చూసుకుని, డైలాగ్స్ బట్టీ పట్టి దర్శకుడు చెప్పినట్టు చెప్పేసి నిర్మాత ఇచ్చే డబ్బులు తీసుకుని ఇంటికి పోతాడు. సరిగ్గా జనసేన రాజకీయాలు ఇలానే కనిపిస్తున్నాయి.ఓ పాతికముప్పై సంవత్సరాలుగా ఈ తరహా జీవన విధానానికి అలవాటుపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇదే తరహా విధానం అమలు చేస్తున్నట్టు నిన్నటి జనసేన సభ కనిపించింది. 

పార్టీ ఆవిర్భావ సభ అంటూ ఏర్పాటు చేసిన సభలో పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు రాజకీయ దిశానిర్దేశం చేసి ఉండాల్సింది. పార్టీపెట్టిన రోజునుండి ఈ ఎనిమిదేళ్ళు తమ రాజకీయం ఎలాఉంది, ఇతర రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, తాము ఎన్ని విజయాలు చూశాము, ఎన్ని అపజయాలు ఎదుర్కొన్నాం, భవిష్యత్తులో ఎలాంటి విధానాలు అమలు చేయాలి, ఎలాంటి వ్యూహాలు ఎన్నుకోవాలి అనే అంశాలు మాట్లాడాల్సి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మరో రెండేళ్ళలో ఎన్నికలు వస్తున్న దృష్ట్యా తమ విధానం ఎలా ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేయాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి వంటి అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావించి ఉండాల్సింది. కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రసంగం చేయాల్సింది. వారికి ఈ రెండేళ్ళకు సరిపడే కార్యక్రమాలు ప్రకటించి ఉండాల్సింది. 

కానీ పవన్ కళ్యాణ్ చేసిందేమిటి? తన ప్రసంగం మొదలయిన తర్వాత ఓ పావుగంట చంద్రబాబు నాయుడుతో సహా పలు రాజకీయ పార్టీల నాయకులూ, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. తాను రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు అయితే ఇతర పార్టీల నేతలకు ధన్యవాదాలు ఎందుకు చెప్పాలో అర్ధంకాదు. అసలు తనకు అండగా ఉన్న కార్యకర్తలకు, తనతో కలిసి నడుస్తున్న నాయకులకు ధన్యవాదాలు చెప్పాల్సిన నేత ఇతర పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తాను గెలిచినా ఓడినా తనకు మద్దతు ఇస్తూ వస్తున్న ప్రజలకు ధన్యవాదాలు చెప్పాల్సిన నేత ఇతర పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పడం ఏంటి? రానున్న రోజుల్లో తనకు అండగా నిలవమని కార్యకర్తలకు, మద్దతు ఇవ్వమని ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిన నేత ఆ వేదికనుండి  చేసిన ప్రసంగం ఏంటి? 

పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అంటే అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకోవడమా? తాను జనసేన వ్యవస్థాపక దినోత్సవ సభ పెట్టుకోవాలనుకున్నప్పుడు తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీని అడిగితే కనీసం వ్యవస్థాపక దినోత్సవంలో ఎలాంటి ప్రసంగాలు చేయాలో వారైనా సలహా ఇచ్చేవారుగా? అన్ని సభల్లాగే వ్యవస్థాపక దినోత్సవ సభలో కూడా అధికారపార్టీపై ఆరోపణలు, ఘాటైన విమర్శలు చేస్తే వ్యవస్థాపక దినోత్సవం ప్రత్యేకత ఏముంటుంది? మిత్రపక్షం బీజేపీ సలహావద్దు అనుకుంటే కనీసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అయినా సలహా అడిగి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని మహానాడు పేరుతో జరుపుకుంటున్నారు. అక్కడ రాజకీయ పార్టీపై విమర్శలు ఎలా ఉన్నా తన పార్టీ కార్యకర్తలకు  దిశానిర్దేశం చేసే ప్రసంగాలు అనేకం ఉంటాయి. అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఓ రాజకీయ ఎజెండా కూడా ఇస్తారు. అటువంటి సలహా పవన్ కళ్యాణ్ తీసుకుని ఉంటే నిన్నటి సభ కాస్త పరిపక్వతతో కనిపించేది. 

మొత్తానికి ఎవరిదో స్క్రిప్ట్, వేరెవరివో డైలాగ్స్, ఎవరో నిర్మాత, ఇంకెవరో దర్శకులు. పవన్ కళ్యాణ్ మాత్రం ఓ కాల్ షీట్ ప్రకారం సభకు వెళ్ళి నటించి వచ్చారు అన్న చందంగా ఉంది నిన్నటి జనసేన ఆవిర్భావసభ. ఆ సభకు హాజరయిన జనసేన కార్యకర్తలు కూడా రాజకీయ పార్టీ కార్యకర్తల్లా కాక తమ హీరో అభిమానుల్లా అలా సభకు వెళ్ళి వచ్చేశారు. అంతకు మించి ఈ సభ గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి