iDreamPost

వైసీపీ కానోళ్ళకు రాజ్యసభ ఎందుకు ఇస్తాం?

వైసీపీ కానోళ్ళకు రాజ్యసభ ఎందుకు ఇస్తాం?

ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నాలుగు స్థానాల్లో అసెంబ్లీలో ఉన్న స్పష్టమైన ఆధిక్యత దృష్యా మొత్తం నాలుగింటికి నాలుగు స్థానాలు వైసిపి నే సునాయాసంగా గెలుచుకుంటుందనే విషయంలో మొదటినుండి ఎవరికీ ఎటువంటి సందేహం లేనప్పటికీ, వైసిపి నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థులపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైసిపి రాజ్యసభ అభ్యర్థులు వీరేనంటూ కొందరు తలపండిన రాజకీయ నేతల పేర్లు.. పలువురు వ్యాపారవేత్తల పేర్లు.. కొందరు సినీ ప్రముఖులు ఇలా పలువురి పేర్లు, పెద్దఎత్తున ఊహాగానాలు ప్రచారం జరిగినప్పటికీ ఎట్టకేలకు గతవారం తమ పార్టీ తరుపున రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల పేర్లను వైసిపి అధిష్టానం ప్రకటించింది.

అందరు ఊహించిన విధంగా మొదటి నుండి పార్టీకి ఆర్ధికంగా అండదండగా ఉన్న అయోధ్యరామి రెడ్డి పేరు ఖరారు కాగా, ఇటీవలే శాసనమండలి రద్దు నేపథ్యంలో తమ మంత్రి పదవులను త్యాగం చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లను ఇద్దరినీ ఒకేసారి రాజ్యసభ కు ఎంపిక చేసి జగన్ మోహన్ రెడ్డి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే కనీసం వైసిపిలో కూడా ఎవ్వరు ఊహించని రీతిలో కేంద్ర పెద్దల లాబీయింగ్ తో చివరి నిమిషంలో బరిలోకి దిగిన పరిమళ్ నత్వాని ని పార్టీ తరపున నాలుగో అభ్యర్థిగా ఎంపిక చెయ్యడంపై మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

రాజ్యసభ సభ్యుడు, రిలయన్స్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ వ్యవహారాల ప్రెసిడెంట్‌, పారిశ్రామికవేత్త అయిన పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీ తన రాజ్యసభ పదవి కాలం ముగియనున్న తరుణంలో ఇటీవలే తన ఆప్త మిత్రుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ని వెంటబెట్టుకొని తాడేపల్లి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ని కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ సందర్భంగా తనను ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ కు నామినేట్ చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరానని, స్వయంగా నత్వాని నే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి నత్వాని ని ఎంపిక చెయ్యడం లాంఛనమేనని అందరు భావించినప్పటికీ.. ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా వైసీపీ అభ్యర్థిగానే బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

పరిమళ్ నత్వాన్ని గతంలో 2008, 2014 రాజ్యసభ ఎన్నికల్లో రెండు సార్లు జార్ఖండ్ నుండి బిజెపి మద్దతు తో స్వతంత్ర ఎంపీ గా ఎన్నికైనప్పటికీ, ఈసారి మాత్రం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని, ముఖ్యమంత్రి చేతుల మీదగాని వైసిపి బి-ఫామ్ తీసుకొవడం విశేషం. అదేవిధంగా వైసిపి అభ్యర్థిగానే పరిమళ్ నత్వాని రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో) కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అంతకుముందు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తనని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జగన్ మోహన్ రెడ్డి కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నత్వానీ తనకున్న అనుభవంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకుకొస్తానని చెప్పారు. సాహసోపేతమైన యువ ముఖ్యమం త్రిగా జగన్‌ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని నత్వాని ప్రశంసించారు. తనకున్న రెండు దశాబ్దాల తన అనుభవం, రిలయన్స్‌, జి యో సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించే సమయంలో భూసేకర ణ తదితర కార్యక్రమాల్లో ఉన్న అనుభవం రాష్ట్రానికి దోహదపడతాయన్న ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఏదిఏమైనా అధికారికంగా పరిమళ్ నత్వాని ఇప్పుడిక వైసిపి సభ్యుడేనని పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ అంశంలో మొదట్లో రాజ్యసభ సీటు కోసం ముఖేష్ అంబానీ ని వెంటబెట్టుకొని జగన్ దగ్గరికి వచ్చినప్పుడు తమ పార్టీలో బయటివారికి రాజ్యసభ అవకాశం ఇచ్చే సంస్కృతీ లేదని జగన్ తమతో అన్నారని ఇటీవల స్వయంగా పరిమళ్ నత్వాని నే ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిమళ్ నత్వానికి పార్టీ కండువా కప్పి పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు పంపించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి