iDreamPost

పరకాల నూతన ప్రయాణం

పరకాల నూతన ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రస్తుతం మహాన్యూస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వ్యాఖ్యాతగా, రాజకీయ విశ్లేషకునిగా, ఓ పార్టీ నాయకుడిగా సుపరిచితుడైన పరకాల గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీకి మీడియా సలహాదారుగా పనిచేసారు. ఈయన ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భర్త. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.. అయితే పరకాల కెరీర్ మొత్తం జర్నలిజం చుట్టూ తిరిగిందనే చెప్పుకోవాలి.

మొదట్లో పరకాల ఈటీవీలో ప్రతినిధి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం రాజకీయాల్లో చేరినా ఆయన మీడియా సమావేశాలతోనే ఎక్కువగా గడిపేవారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబుకు గత హయాంలో ఆయన కమ్యూనికేషన్ సలహాదారునిగా పనిచేశారు. అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయిన గోదావరి పుష్కరాల ఘటనలో, తెలంగాణలో ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో ఓటుకునోటు వ్యవహారంలో పరకాల సలహాలు తుస్సుమన్నాయనే వార్తలు గుప్పుమన్నాయి.. అందుకే 2019 ఎన్నికల సమయంలో పరకాలను చంద్రబాబు వినియోగించుకోలేదట.. ఆ సందర్భంలోనే ఆయనకు చంద్రబాబుతో గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది.

అయితే ఈలోపు పరకాల సొంత వ్యాపారం కూడా ప్రారంభించటంతోపాటు ఒక వెబ్ సైట్, రన్ చేస్తూ పలు సర్వేలు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది.. ఇక్కడినుండి పరకాల మహాలో అడుగుపెట్టారు. ఇప్పుడు మహాన్యూస్ విషయానికొద్దాం.. మహాన్యూస్ కొంతకాలం క్రితం ప్రస్తుతం బిజెపిలో ఉన్న సుజనాచౌదరి ప్రమోట్ చేశారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వెంకట్రావు నేతృత్వంలో ఈ మహాన్యూస్ నడిచింది. కొన్నాళ్ల క్రితం టీవీ9 హెడ్ గా ఉన్న రజినీకాంత్ మహా న్యూస్ లో చేరి దానిని ఓ రేంజ్ తీసుకొద్దామని ప్రయత్నించినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో రజనీకాంత్ మళ్ళీ టీవీ9లో చేరిపోయారు.

తర్వాత మహాన్యూస్ పరిస్థితి టిఆర్పీ సంగతి పక్కన పెడితే కనీసం ఛానల్ మనుగడ ప్రశ్నార్థకమైంది. అనంతరం మారెళ్ళ వంశీ అనే జర్నలిస్టు మహాన్యూస్ పలువురు తెలుగుదేశం పార్టీ నేతల సహకారంతో నడిపించారు. కానీ కేవలం నడిపించడం వరకే ఆయన పరిమితం కావటంతో అది సుజనా చౌదరి చేతిలోకి వచ్చింది. అంతకుముందు సీనియర్ జర్నలిస్టు మూర్తి కూడా మహా న్యూస్ లో చేరి ప్రక్షాళన చేయాలనుకున్నారు.. కానీ ఆయన తన ప్రయత్నాలు విరమించుకుని టీవీ5 లో చేరిపోయారు.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న సుజనాచౌదరి ఇప్పుడు మహాను ఇంకాస్త గట్టిగా టేకప్ చేశారని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం మీడియా పరంగా కొంత బలం ఉంది.. వైఎస్ఆర్సిపికి కూడా సొంత ఛానల్ తో పాటు పలు ఛానళ్లు సపోర్ట్ చేస్తున్నాయి. ఈక్రమంలో బిజెపికి కూడా ఒక ఛానల్ ఉండాలని భావించారని అందుకోసం సుజనా పరకాలకు రంగంలోకి దింపారని అర్థమవుతోంది. ఇప్పటికే ఛానల్ పరంగా పలు రిక్రూట్మెంట్లు, మార్పులు, చేర్పులతో మహాన్యూస్ వేగంగా ముందుకెళ్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ తో ఛానల్ కు సంబంధించి పలు మ్యూజిక్ లను క్రియేట్ చేయిస్తున్నారు.

అయితే పరకాల మహా న్యూస్లో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం వెనుక రాజకీయ కోణం కూడా ఉందని, 2024నాటికి చానల్ ద్వారా బిజెపిని ప్రమోట్ చేయటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ బిజెపికి మేలు చేకూర్చేలా ప్రవర్తించాలనేది ప్రస్తుతం మహా టార్గెట్ గా తెలుస్తోంది. మరోవైపు తాజాగా బాధ్యతలు స్వీకరించిన పరకాల ఇప్పుడున్న ఛానళ్లకు భిన్నంగా ప్రొఫెషనలిజంతో మహాన్యూస్ ను తీర్చిదిద్దుతామని తెలిపారు.

కేవలం వార్తలు అంటే రాజకీయాలే అన్న అపోహను తొలగిస్తామని, ఛానల్ లో కేవలం 30 శాతం మాత్రమే రాజకీయ వార్తలు ఉంటాయన్నారు. విద్య, ఆర్థిక వ్యవస్థ, మార్కెట్, సంస్కృతి ఇలా అన్నీ సమాజానికి ముఖ్యమని వాటన్నిటినీ చానల్లో తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని పరకాల చెప్పుకొచ్చారు.. చూద్దాం మొత్తంమీద పరకాల చేస్తున్న మహాన్యూస్ నూతన ప్రయాణం ఆయనను ఎక్కడికి చేరుస్తుందో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి