iDreamPost

ఎట్టకేలకు స్పందించిన పనబాక, ఊపిరిపీల్చుకున్న టీడీపీ అధినేత

ఎట్టకేలకు స్పందించిన పనబాక, ఊపిరిపీల్చుకున్న టీడీపీ అధినేత

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారయినా కాలు బయటపెట్టేందుకు బెట్టు చేసిన పనబాక లక్ష్మి మెట్టు దిగినట్టు తెలుస్తోంది. పలువురు టీడీపీ నేతల మంతనాలు, అధినేత హామీతో ఆమె ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వారం రోజుల పైగా టెన్షన్ పెట్టిన పనబాక లక్ష్మి పట్టు వీడడంతో టీడీపీకి ఉపశమనంగా మారింది. చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రచారానికి వెళతానని ఆమె కండీషన్ పెట్టినట్టు సమాచారం. దానికి టీడీపీ నేతలు అంగీకరించడంతో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అసలే టీడీపీ కష్టకాలంలో ఉంది. పైగా ఉప ఎన్నికల్లో నెట్టుకు రావడం చిన్న విషయం కాదు. గడ్డు స్థితిలో అనవసరంగా చేతులు కాల్చుకునేందుకు పనబాక కుటుంబీకుల నుంచి అభ్యంతరం వచ్చినట్టు సమాచారం. దాంతో ఆమె పేరుని ప్రకటించిన పది రోజుల తర్వాత కూడా ఆమె కనీసం సంతృప్తి వ్యక్తం చేస్తూ కృతజ్ఞతా ప్రకటనా కూడా ఇవ్వలేదు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. అయినప్పటికీ అధిష్టానం ఆమె పేరుని ఖాయం చేయడం ఆసక్తిగా మారింది. అనేక మంది టీడీపీ నేతలను అసంతృప్తి పాలుజేసింది.

ఎన్నికల వ్యయం విషయంలో పనబాక పట్టుబట్టినట్టు టీడీపీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పేరుతో ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేయడంతో చివరకు పార్టీ తరుపున మొత్తం వ్యయం భరించేందుకు అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు. ఆ విషయంలో స్పష్టత ఇచ్చే వరకూ తాను ప్రచారానికి పూనుకునేది లేదని పనబాక లక్ష్మి తేల్చిచెప్పడంతో చివరకు టీడీపీ నేతలు దానికి అంగీకరించి ఆమెను బరిలో దింపే పనిలో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నుంచి దానికి అనుగుణంగా హామీ దక్కినట్టు పనబాక వర్గీయులు కూడా చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబుని కలిసిన తర్వాత ఆమె తిరుపతిలో రంగంలో దిగుతారని ప్రకటించారు.

తొలుత అభ్యర్థిత్వం ఖరారు చేసేముందు తనకు క్లారిటీ ఇవ్వకుండా పోటీలో దింపడానికి పేరు ప్రకటించడం పనబాక లక్ష్మికి అసంతృప్తి కలిగించిందని ప్రచారం సాగింది. దానికి తగ్గట్టుగానే ఆమె వ్యవహారశైలి ఉంది. చివరకు ఇప్పుడు ఎన్నికల వ్యయానికి సంబంధించి భరోసా రావడంతో ఆమె బరిలో దిగేందుకు అంతా సిద్ధమయ్యింది. ఇది టీడీపీ వర్గాలకు ఉపశమనంగా మారింది. ఆమె ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంటే తలనొప్పులు వస్తాయని భావించిన టీడీపీ అధిష్టానం పనబాక కండీషన్స్ కి పూర్తిగా అంగీకారం తెలిపినట్టు కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి