iDreamPost

Pushpa : బయట మార్కెట్లకు నమ్మకం వచ్చేసింది

Pushpa : బయట మార్కెట్లకు నమ్మకం వచ్చేసింది

పుష్ప ది రైజ్ పార్ట్ 1 ముందు నుంచి ఎందుకు పాన్ ఇండియా అని పట్టుబట్టిందో ఇప్పుడర్థమవుతోంది. మెల్లగా వసూళ్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు టాక్ కొంచెం అటుఇటుగా వచ్చినప్పటికీ క్రమంగా గ్రాఫ్ పైకి ఎగబాకడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా వారం దాటకుండానే వసూళ్లు 18 కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం రాబోయే రోజులకు శుభ సూచకంగా చెబుతున్నారు. మాములుగా తమిళ తెలుగు సినిమాలను యుట్యూబ్ లో డబ్బింగ్ రూపంలో చూసే అలవాటున్న నార్త్ ఆడియన్స్ పుష్పని ఏ మేరకు పెద్ద స్క్రీన్ మీద రిసీవ్ చేసుకుంటారనే అనుమానం అందరిలోనూ మొదటి నుంచీ ఉంది.

కానీ దాన్ని పటాపంచలు చేస్తూ పుష్ప దూసుకుపోతుండటం గమనార్హం. నిజానికి డిసెంబర్ 17 విడుదలను రీచ్ కావడం మైత్రికి దర్శకుడు సుకుమార్ కు మెడ మీద కత్తిలా మారినప్పటికీ డే అండ్ నైట్ కష్టపడి మరీ పని చేసినందుకు తగిన ఫలితమే దక్కుతోంది. బాహుబలి, కెజిఎఫ్ లతో ఇప్పటికిప్పుడు పోల్చలేం కానీ ప్రమోషన్ వీక్ గా చేసుకున్న పుష్పకు ఇంత ఆదరణ దక్కడం చిన్న విషయం కాదు. హిందీలో సూర్యవంశీ తర్వాత ఒక్కటంటే ఒక్కటీ మాస్ సినిమా రాలేదు. దీంతో పుష్ప లో ఉన్న ఊర మసాలా కంటెంట్ అక్కడి జనానికి విపరీతంగా నచ్చేసింది. బీహార్ లాంటి చిన్న రాష్ట్రాల్లో కూడా కలెక్షన్లు బాగా రావడం సాక్ష్యంగా చెప్పుకోవచ్చు

ఏపి తెలంగాణలో మాత్రం పుష్ప సందడి సోమవారం నుంచి తగ్గింది. నిన్న ఈ రోజు బుకింగ్స్ లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. అందుకే యూనిట్ విశ్రాంతి తీసుకోకుండా సక్సెస్ మీట్ చేసేసింది. బాలకృష్ణతో ఆహా కోసం ఆన్ స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్ చేయించింది. కేరళలోనూ విజయ యాత్ర చేయబోతున్నారట. ఇంకా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరం ఉంది కాబట్టి పుష్పకు ఇప్పుడు రాబోయే వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. శ్యామ్ సింగ రాయ్, 83 టాక్ ఎలా ఉంటాయనేది కూడా ప్రభావం చూపనుంది. అఖండ లాగే పుష్ప కూడా ఓ ఇరవై పాతిక రోజులు స్టడీగా ఉంటే చాలు లాభాలు కళ్ళచూడొచ్చు

Also Read : Salute : పాన్ ఇండియా సినిమాలకు కొత్త టెన్షన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి