iDreamPost

మూడు స్కీములపై విచారణకు ఆదేశం.. చంద్రబాబు అండ్ కో లో పెరిగిపోతున్న టెన్షన్..

మూడు స్కీములపై విచారణకు ఆదేశం.. చంద్రబాబు అండ్ కో లో పెరిగిపోతున్న టెన్షన్..

తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాలో టెన్షన్ పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరిగిన మూడు పథకాల అమలులో భారీగా అవినీతి జరిగిందంటు మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐతో విచారణ జరిపించాలని జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో అవినీతి ఆకాశమంతగా పెరిగిపోయిందనే ఆరోపణలు చాలా ఉన్న ప్రభుత్వం మాత్రం మూడు పథకాలపైనే దృష్టిపెట్టింది.

టిడిపి హయాంలో అమలైన ఏపి ఫైబర్ గ్రిడ్ పథకంలో సెట్ టాప్ బాక్సుల కొనుగోలులో సుమారుగా రూ. 700 కోట్లు, రంజాన్ తోఫా, చంద్రన్న కానుక, క్రిస్మస్ కానుకల పంపిణీ పథకంలో రూ. 158 కోట్ల అవినీతి జరిగినట్లు ఉపసంఘం ఆధారాలను సేకరించింది. అలాగే ప్రభుత్వం తరపున జరిగిన అనేక కార్యక్రమాల్లో మజ్జిగను పంపిణి చేశారట. ఆ పంపిణీ కార్యక్రమ బాధ్యతను హెరిటేజ్ కంపెనీకే అందించినట్లు ఉపసంఘం గుర్తించింది. ఇందులో కూడా సుమారు రూ. 40 కోట్ల అవినీతికి ఆధారాలు దొరికాయట. హెరిటేజ్ కంపెనీ అంటే ఎవరిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

నిజానికి అవినీతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీదున్న ఆరోపణలతో పోల్చుకుంటే పై మూడు పథకాలలో జరిగిన అవినీతి ఆరోపణలు చాలా చిన్నవనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటిఎంలాగ వాడుకుంటున్నాడంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే బహిరంగసభలో ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది.

అలాగే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాల పెంచేసి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపి రాయలసీమ నేతలు ఓ పెద్ద నివేదికనే కేంద్రానికి అందించారు. రాజధాని నిర్మాణం పేరుతో భూముల సమీకరణలో వినబడుతున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. విచారణ జరుపుతున్న సిఐడి ఇప్పటికే కొందరిని అరెస్టులు కూడా చేసింది.

ఇసుక దోపిడి, మరుగుదొడ్ల నిర్మాణం, నీరు-చెట్టు లాంటి పథకాల్లో చంద్రబాబు ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటూ బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశాల్లో ఎన్నిసార్లు ఆరోపణలు చేశారో లెక్కలేదు. నీరు-చెట్టు పథకంలో జరిగిన భారీ అవినీతి ఆరోపణలపై అప్పట్లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణ జరిపిందని సమాచారం. మరి ఆ విచారణలో ఏమి తేలిందో బయటకురాలేదు.

చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణల జాబితా కొండవీటి చేంతాడంత ఉన్నా మూడు పథకాల అమలుపైన మాత్రమే సిబిఐ విచారణకు సిఫారసు చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మిగిలిన ఆరోపణల మాటెలాగున్నా పై పథకాల అమలులో మాత్రమే పూర్తి ఆధారాలు దొరికాయా ? లేకపోతే అంచెలంచెలుగా ఒక్కో ఆరోపణపైనా సిబిఐ విచారణకు సిఫారసు చేసేయోచనలో జగన్ సర్కార్ ఉందా ? అన్నదే సస్పెన్సుగా మారింది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి