iDreamPost

సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యేలపై గురిపెట్టి విపక్షం ఏమి సాధిస్తుంది?

సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యేలపై గురిపెట్టి  విపక్షం ఏమి సాధిస్తుంది?

క‌రోనా వేళ భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. క‌రోనా నివార‌ణ‌లో భాగంగా మ‌రికొన్నాళ్ళ పాటు లాక్ డౌన్ కొన‌సాగించినా పెద్ద క‌ష్టం లేకుండా గ‌డిచిపోయే ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఆ పై వారు ఉన్నారు. కానీ దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, నిరుపేద‌లు మాత్రం ఇప్ప‌టికే అల్లాడిపోతున్నారు. 40 రోజుల పాటు ఉపాధికి గండిప‌డ‌డంతో రోజు గ‌డ‌వ‌డ‌మే గ‌గనంగా మారిన వారున్నారు. దేశంలో అత్య‌ధికులు అసంఘ‌టిత‌రంగ కార్మికులుగా ఉన్న ద‌శ‌లో వారి జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. అలాంటి వారిని ఆదుకునే ఆప‌న్న‌హ‌స్తాలే ఇప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాలు నిల‌బెడుతున్నాయి. ప్ర‌భుత్వాల స‌హాయం క‌న్నా స్వ‌చ్ఛందంగా ఎవ‌రికి వారు చేస్తున్న సేవ‌లే మిన్నగా క‌నిపిస్తున్నాయి. అయినా రాజ‌కీయ కార‌ణాల‌తో కొన్ని సేవా కార్య‌క్ర‌మాల మీద గురిపెట్టి దుమారం రేప‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇది మ‌రింత సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గిట్ట‌ని నేత‌ల మీద గురిపెట్టిన తీరు విశేషంగా మారుతోంది.

మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతున్న మాన‌వ‌త్వం వెల్లివిరుస్తుండ‌డం అంద‌రినీ ఆనంద ప‌రుస్తోంది. క‌రోనా ర‌క్క‌సిని ఎదుర్కోవ‌డంలో అదే కీల‌కంగా మారింది. అందుకు త‌గ్గ‌ట్టుగా కొంద‌రు నేత‌లు చొర‌వ చూపుతున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు చూస్తే ఏపీలో ఓ సామాన్య కుటుంబానికి కేంద్రం నెల‌కు రూ.500 ఇస్తోంది. అది కూడా జ‌న్ ధ‌న్ అకౌంట్ ఉంటే మాత్ర‌మే. ఇక రాష్ట్రం త‌ల‌కు 5 కిలోల బియ్యం. కిలో కందిప‌ప్పు ఉచితంగా పంచుతోంది. ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల్లో పంచేసింది. మ‌రో రూ. వెయ్యి రూపాయ‌లు కూడా అంద‌రికీ అందించింది. అంటే గ‌డిచిన నెల రోజుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1500 స‌హాయం అందిస్తే, కేంద్రం రూ.500 క‌లిపి మొత్తం ఒక్కో కుటుంబానికి సుమారుగా రూ.2వేలు అందించారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓ న‌లుగురు స‌భ్యులున్న కుటుంబం గ‌డ‌వాలంటే క‌నీసంగా రూ.5వేలు త‌ప్ప‌నిస‌రి. అలాంటి స‌మ‌యంలో ఆదాయం లేని ఆయా వ‌ర్గాల‌కు పెద్ద‌మ‌న‌సుతో ప‌లువురు అందిస్తున్న చేయూతే వారికి ప్ర‌ధానంగా మారింది.

ఈ విష‌యంలో వైఎస్సార్సీపీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీల‌కు అతీతంగా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నా పాల‌క‌ప‌క్ష ఎమ్మెల్యేలు కొంద‌రు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. అలాంటి స‌మ‌యంలో కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు లేకుండా సాధ్యం కాదన్న‌ది అంద‌రికీ తెలుసు. పెద్ద మ‌న‌సుతో సాయం చేయ‌డాన్ని చూడ‌కుండా ఇప్పుడు చిన్న చిన్న లోపాల‌ను భూత‌ద్దంలో చూపించే బ్యాచ్ పెరిగింది. ముఖ్యంగా స్వ‌యంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ న‌డుపుతున్న చంద్ర‌బాబు హైద‌రాబాద్ లో కూర్చుని స్వ‌యంగా త‌ను గానీ, పార్టీ లేదా ట్ర‌స్ట్ త‌రుపున అందించిన సేవ‌లు క‌నిపించ‌డం లేదు. ఇక జ‌న‌సేన శ్రేణులు కొంద‌రు స్వ‌చ్చందంగా క‌దిలి పేదల క‌డుపు నింపే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా ఆపార్టీ అధినేత మాత్రం హైద‌రాబాద్ కే ప‌రిమితం అయ్యారు. ఇక బీజేపీ నాయ‌కులు అధిష్టానం మాట‌ల‌ను కూడా పెద్ద‌గా ఆచ‌రిస్తున్న దాఖ‌లాలు లేవు. ఆపార్టీ కి ఉన్న వ‌న‌రుల‌కు త‌గ్గ‌ట్టుగా సేవా కార్య‌క్ర‌మాలు సాగ‌డం లేద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఇలాంటి స‌మ‌యంలో కొంర‌దు ఎమ్మెల్యేలు చేస్తున్న సేవ‌ల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తెలంగాణాలో సీత‌క్క‌, ఏపీలో బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి, ఆర్కే రోజా స‌హా ఇంకా కొంద‌రు ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. అందుకే ఇప్పుడు వారు చాలామందికి కంట‌గింపుగా మారారు. చివ‌ర‌కు విమ‌ర్శ‌లు ఏ స్థాయికి వెళ్లారంటే ప్ర‌జ‌ల‌కు క‌డుపు నింపేందుకు స‌హాయం అందించినందుకు గానూ వారే క‌రోనా వ్యాపింప‌జేస్తున్నార‌ని చంద్ర‌బాబు వంటి వారు విమ‌ర్శ‌ల‌కు దిగే ప‌రిస్థితి వ‌చ్చింది. అమ్మ పెట్ట‌దు..అడుక్కు తిన‌నివ్వ‌దు అన్న‌ట్టుగా తాను పెట్ట‌క‌..పెట్టేవాళ్లంటే గిట్ట‌క అన్న‌ట్టుగా ఆయ‌న ధోర‌ణి ఉంది. రాజ‌కీయ కార‌ణాల‌తో శ్రీకాళ‌హ‌స్తి కేసుల‌ను స్థానిక ఎమ్మెల్యేకి ఆపాదించ‌డం ఆయ‌న ద్వారా ప్ర‌యోజ‌నం పొంది, కాస్త నిశ్చింతంగా గ‌డుపుతున్న వారికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అయినా కాళ‌హ‌స్తి వాసులు విశ్వ‌సించ‌క‌పోయినా, ఇలాంటి దుష్ప్ర‌చారంతో రాష్ట్ర‌మంతా ఓ వ‌ర్గాన్ని న‌మ్మించ‌వ‌చ్చ‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా తొలి నాళ్ల‌లో స‌హాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన చాలామంది రానురాను వెన‌క్కి వెళ్లాల్సి వ‌స్తోంది. దీర్ఘ‌కాల లాక్ డౌన్ కార‌ణంగా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో చాలామంది సేవ‌ల‌కు అవ‌కాశం క‌ల‌గడం లేదు. అలాంటి స‌మంయ‌లో కాస్త ఉదారంగా వ్య‌వ‌హ‌రించే వారిని కూడా చిన్న‌బుచ్చేలా , ఎవ‌రూ ముందుకు రాకుండా చేసేలా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు దిగడం విస్మ‌య‌క‌రంగానూ , విచార‌క‌ర అంశంగానూ మారుతుండ‌డ‌మే వ‌ర్తమాన వైచిత్రం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి