iDreamPost

తప్పించుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు..!

తప్పించుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు..!

ఇన్‌స్టెంట్‌ లోన్‌యాప్స్‌ డొంక కదలడంతో వాటిల్లో చోటు చేసుకున్న అక్రమాలు కూడా ఒకొక్కటిగా బైటకు వస్తున్నాయి. మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా, ఇక్కడి వారితో టైఅప్‌లు పెట్టుకోవడం.. సంస్థ డైరెక్టర్లుగా తమ ఉద్యోగులనే నియమించడం.. ఒకరికి ఇంకొకరికి సంబంధం ఉన్నట్లుగా తెలియకుండా తగు జాగ్రత్తలు పాటించడం వంటి ఏర్పాట్లు చూస్తుంటే తమ పాపం ఎప్పుడో ఒకప్పుడు పండుతుందని వీరికి ముందే తెలుసన్న విషయం బోధపడుతోంది. దీంతో ఎప్పుడు ముప్పు వస్తే అప్పుడు వెంటనే తప్పించుకునే పోయే విధంగానే వీరి కార్యాచరణ కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెలుగుచూస్తోంది. విస్తృతంగా వ్యాపారం నిర్వహించడంతో పాటు ఎగ్జిట్‌ప్లాన్‌ను కూడా వారు సిద్ధం చేసుకున్నారని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు చైనాకు చెందిన మహిళ పర్యవేక్షణలో, మన దేశానికి చెందిన అయిదారుగురు కీలక వ్యక్తుల పర్యవేక్షణలో ఇన్‌స్టెంట్‌ లోన్‌యాప్‌లు 30కిపైగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలుగుచూసిన నివేదికలను బట్టి రూ. 21వేల కోట్లకుపైగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటన్నిటినీ పర్యవేక్షించుకునేందుకు చైనాకే చెందిన మరో వ్యక్తిని కూడా ఇక్కడ నియమించుకున్నారు. హైదరాబాదు, ఢిల్లీ, గుర్గావ్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కాల్‌సెంటర్ల ఉద్యోగులను ప్రైవేటు కన్సల్టెన్సీల ద్వారా నియామకాలు జరిపారు. ఈ యాప్స్‌ నిర్వాహకుల కోసం పనిచేసే కాల్‌సెంటర్ల ఉద్యోగులకు వీరు నేరుగా జీతాలు ఇవ్వకుండా కన్సల్టెన్సీల ద్వారా ఇస్తున్నట్లుగా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వాహకులు, ఉద్యోగుల వివరాలు పూర్తిస్తాయిలో తెలియాలంటే సదరు కన్సల్టెన్సీలు కీలకం కానున్నాయని భావిస్తున్నారు.

చైనాకుచెందిన మహిళ ద్వారానే, చెల్లింపులు ఆలస్యం చేస్తున్న రుణగ్రహీతల వివరాలను ఇండియాలోని కీలకంగా వ్యవహరించే వారికి అందే విధంగా ఏర్పాట్లు చేసారు. వారి దగ్గర్నుంచి కాల్‌సెంటర్‌ఉద్యోగులకు అందుతాయి. ఇక వారు ఫోన్‌లోనే నానా బూతులు మాట్లాడి రుణాలు పొందిన వారిని మానసికంగా హింసించి అప్పు వసూలు చేసే ప్రయత్నం చేస్తారంటున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఈ హింస భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏం చేసైనా డబ్బులు తిరిగి కట్టించడమే లక్ష్యంగా ఈ తతంగమంతా సాగుతోందని తేలిసింది. ఇలా వసూలు చేసిన వారికి అదనపు ఇన్సెటివ్‌లు ఇచ్చి మరీ ప్రోత్సహించడాన్ని చూస్తుంటే వీరు దందాకు ఏ స్థాయిలో తెగబడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చునంటున్నారు.

ఇప్పటి వరకు పోలీస్‌లకు చిక్కిన నిందితులు కూడా దర్యాప్తు అధికారులకు అరకొర సమాధానాలే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. చైనాకు చెందిన వ్యక్తి అయితే తనకేం సంబంధం లేదని చెప్పేసి, నోరు విప్పడం లేదంటున్నారు. అయితే ఇతడి ద్వారానే తమకు రుణదాతల వివరాలు అందేవని కాల్‌సెంటర్‌ ఉద్యోగులు గుర్తించడంతో పోలీసులు దర్యాప్తు సరళిని మార్చినట్లుగా తెలుస్తోంది. కాగా చైనాకు చెందిన వ్యక్తే ఇక్కడి వ్యవహరాల్లో కీలకంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంతటి ఘోరమైన దందాతు తెరలేపిన తెరవెనుక వ్యక్తులను బయటపెట్టిl, చట్ట ప్రకారం వారిని శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి