iDreamPost

ఒక్కటీ నిబంధనలు పాటించడం లేదు..

ఒక్కటీ నిబంధనలు పాటించడం లేదు..

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్, మనీ లెండింగ్‌ యాప్స్‌.. పేరేదైనా గానీ వ్యాపారమే ప్రథమ లక్ష్యం. కోవిడ్‌ కారణంగా కష్టమర్లు రాక అనేకానేక వ్యాపారాల నిర్వాహకులు మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. కానీ అదే కోవిడ్‌ ఈ యాప్‌లకు కావాల్సిన కష్టమర్లను తయారు చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన బాధితులు ఈ లోన్‌ యాప్స్‌ను ఆశ్రయించి అప్పులు తీసుకుంటున్నట్లుగా పలు నివేదికల ద్వారా వెల్లడవుతోంది.

లాక్డౌన్‌ కాలంలో దాదాపుగా పది లక్షలకు పైగా కష్టమర్లు ఈ యాప్‌లకు యాడ్‌ అయ్యారంటే ఉపాధి, ఉద్యోగ రంగం ఎంతగా ఎదులయ్యిందో అర్ధం చేసుకోవచ్చును. ప్రస్తుతం ఈ యాప్‌ల భారిన పడి అప్పులు తీసుకుంటున్న వారిలో ఉద్యోగాలు కోల్పయిన వారు, విద్యార్ధులు కూడా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా తమ నెలవారీ ఖర్చులకు ఈ యాప్‌లపై ఆధారపడుతున్నట్లుగా భావిస్తున్నారు. తగిన ఆదాయం లేకపోవడంతో ఒక యాప్‌లో అప్పును తీర్చడానికి, మరో యాప్‌ నుంచి అప్పు పొందుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. వరుసగా ముగ్గురు ఈ లోన్‌ యాప్‌ల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీస్‌లు దీనిపై దృష్టి పెట్టారు.

దీంతో ఈ యాప్‌ల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ మనీ లెండింగ్‌ యాప్‌లు 35 వరకు అందుబాటులో ఉన్నాయని తేలింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఇవి అవకాశం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఎటువంటి చిరునామాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదని గుర్తించారు. మన దేశంలో ఫైనాన్షియల్‌ కార్యకలాపాలు నిర్వహించాలంటే స్థానికంగా ఇటువంటి సేవలను అందించే సంస్థలతో కలిసి మాత్రమే విదేశీ సంస్థలు తమ వ్యాపార వ్యవహారాలు జరుపుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ యాప్‌లు ఏవీ అటువంటి నిబంధనను పాటించడం లేదని తేలింది.

రుణం ఇవ్వడం, వాయిదాల రూపంలో తిరిగి పొందడం వంటిని ఆర్బీఐ సూచించిన నిబంధనలను అనుసరించే జరగాలి. కానీ ఇందుకు భిన్నంగా ఈ యాప్‌లు పనులు చేస్తున్నాయి. ఇటువంటి విధానం పూర్తిగా చట్టవిరుద్ధమని బ్యాకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. యాప్‌లకు సంబంధించిన చిరునామాలతో సహా పూర్తి వివరాలను పారదర్శకంగా ప్రదర్శించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వసూళ్ళకు పాల్పడడం, వినియోగదారులను బెదిరింపులకు గురిచేయడం వంటివాటికి ఇవి పాల్పడుతున్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీటి భారిన పడి ఇబ్బందులు పడుతున్న బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారంటున్నారు.

ఇదిలా ఉండగా దాదాపు నలభైలక్షల మందికిపైగా కోవిడ్‌ కారణంగా ఉపాధి/ ఉద్యోగం కోల్పోయి ఉంటారని అంచనా. అదే సమయంలో ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లకు కష్టమర్లు 15–20 లక్షల మంది వరకు పెరినట్లుగా చెబుతున్నారు. అంటే ఇలా పెరిగిన వీరంతా యాప్‌ల దోపిడీకి గురవుతున్నట్లే లెక్క. అగ్రిమెంట్‌చార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు తదితర వాటిని కారణంగా చూపించి యాప్‌లు ఇచ్చే అప్పులో నుంచే 20 శాతం వరకు డబ్బును ముందుగానే మినహాయించుకుని, మిగిలినది మాత్రమే రుణంగా ఇస్తున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. అయితే వడ్డీ మాత్రం మొత్తం అప్పుపై వేసి కేవలం వారం లేదా మూడు వారాల్లోపే వసూలు చేస్తున్నారంటున్నారు. ఈ లెక్కన లోన్‌యాప్‌ల ద్వారా దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. గూగుల్‌ సంస్థ కూడా ఈ యాప్‌లకు పలు నిబంధనలు పెట్టింది, కానీ అవి ఏ మాత్రం అమలు కాకపోవడం ఈ యాప్‌ల పట్ల ఉన్న నిర్లక్ష్యధోరణికి పరాకాష్టగా చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ప్రజల ప్రాణాలకే మప్పు తెస్తున్న నేపథ్యంలో సంబంధిత రంగాలన్నీ సంయుక్తంగా వీటి కట్టడికి చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి