iDreamPost

Classic Movie : భారతీయ సినిమాను ప్రభావితం చేసిన క్లాసిక్ – Nostalgia

Classic Movie : భారతీయ సినిమాను ప్రభావితం చేసిన క్లాసిక్ – Nostalgia

1975 జనవరిలో అమితాబ్ బచ్చన్ దీవార్ రిలీజైనప్పుడు జనాన్ని కంట్రోల్ చేయలేక థియేటర్ల యజమానులు పోలీసుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. తండోపతండాలుగా వస్తున్న జన ప్రవాహం యాభై వంద రోజులు దాటినా తగ్గలేదు సరికదా విచిత్రంగా పెరుగుతూ పోయింది. అంతగా ప్రభావం చూపించిన ఆ మాస్టర్ పీస్ సృష్టికర్త దర్శకులు యష్ చోప్రా. యాభై ఏళ్ళకు దగ్గరవుతున్నా దీని ప్రభావం ఇంకా కమర్షియల్ సినిమా మీద ఇప్పటికీ ఉందంటే ఏ స్థాయిలో మూవీ మేకర్స్ కు నిర్దేశకత్వం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ లోని అసలు ఫైర్ తెరమీద ఆవిష్కరించిన సినిమాల్లో దీవార్ తర్వాతే షోలే, డాన్ వగైరాలు నిలుస్తాయి. మహేష్ బాబు పోకిరిలో ఇంట్రడక్షన్ ఫైట్ ని ఇందులో నుంచే దర్శకుడు పూరి జగన్నాధ్ స్పూర్తిగా తీసుకున్నారు. చెక్ చేసుకోవచ్చు.

అప్పటికి షోలే ఇంకా రిలీజ్ కాలేదు. 1973లో జంజీర్ తో యాక్షన్ ఇమేజ్ తెచ్చుకున్న అమితాబ్ ని ఇంకా పవర్ ఫుల్ గా చూపించిన సినిమా ఈ దీవార్. రచయితలు సలీం జావేద్ లకు దీంతోనే స్టార్లకు సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే ట్రెండ్ మొదలయ్యింది. అమ్మ సెంటిమెంట్, ఇద్దరు కొడుకుల్లో ఒకరు మాఫియా డాన్, మరొకరు పోలీస్ ఆఫీసర్ అయితే ఆ ముగ్గురి మధ్య డ్రామా ఎలా ఉంటుందోనన్న ఆలోచన దీనికి ప్రేరేపించింది. యష్ చోప్రా దీవార్ ని తెరకెక్కించిన తీరు ఆడియన్స్ ని కదిలించింది. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన అన్నదమ్ముల ఫార్ములాతో ఎమోషన్స్ ని పండించడానికి ఈ సినిమానే డిక్షనరీగా మారిపోయింది. ఫోర్బ్స్, ఇండియా టైమ్స్ లాంటి పత్రికలు చనిపోయేలోపు చూడాల్సిన సినిమాగా వర్ణించాయి.

దీవార్ ని తెలుగులో 1976లో నందమూరి తారకరామారావు గారు మగాడు పేరుతో ఎస్డి లాల్ దర్శకత్వంలో రీమేక్ చేసినప్పుడు అమితాబ్ పాత్రలో మెప్పించారు. శశికపూర్ రోల్ లో రామకృష్ణ కనిపిస్తారు. ఒరిజినల్ స్థాయిలో కాకపోయినా మగాడు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. హిందీ వెర్షన్ వచ్చిన ఆరేళ్ళకు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 1981లో తీ పేరుతో చేశారు. సోదరుడి క్యారెక్టర్ లో సుమన్ నటించారు. ఆర్ కృష్ణమూర్తి దర్శకులు. ఇదీ దీవార్ రేంజ్ మేజిక్ చేయలేకపోయింది కానీ అక్కడి మార్కెట్ కు తగ్గట్టు నిర్మాతలకు లాభాలు ఇచ్చింది. అది మొదలు ఈ స్ఫూర్తితో సౌత్ నార్త్ ఎన్ని వందల వేల సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. అమితాబ్ ఎవర్ గ్రీన్ టాప్ 3 క్లాసిక్స్ ని లిస్ట్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా ఉండే పేరు ఈ దీవార్.

Also Read : Devullu : పిల్లల కోసం దైవమే తోడొస్తే – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి