iDreamPost

వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ రద్దు…

వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ రద్దు…

ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్‌ను కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో వాయిదా పడిన విషయం విదితమే. టోక్యోలో ఈ సంవత్సరం జూలై 23 నుండి ఆగస్టు 8 వరకూ జరగాల్సిన ఒలింపిక్స్ ను సంవత్సరం పాటు వాయిదా వేస్తూ, 2021 జులై 23 నుంచి నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సంఘం నిర్ణయించింది.

ఒకవేళ కరోనా మహమ్మారి వచ్చే ఏడాదికి కూడా నియంత్రణలోకి రాకపోతే ఒలింపిక్స్‌ను రద్దు చేస్తామని టోక్యో గేమ్స్‌ 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టంచేశారు. దీంతో వచ్చే సంవత్సరం నిర్వహించాల్సిన ఒలింపిక్స్ పోటీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఒలింపిక్స్ వాయిదా పడటంతో జపాన్ దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఒకవేళ పూర్తిగా రద్దయితే జరిగే ఆర్ధిక నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఒలింపిక్స్ రెండోసారి తిరిగి ప్రారంభం అయ్యాక రెండో ప్రపంచ యుద్ధం కారణంగా మొదటిసారిగా రద్దయ్యాయి. ఒకవేళ వైరస్ వ్యాప్తి ఇదేవిధంగా కొనసాగితే టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ ను రద్దు చేస్తామని యోషిరో మోరీ ప్రకటించడంతో వచ్చే ఏడాది అయినా ఒలింపిక్స్ జరుగుతాయా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ వైరస్ వ్యాప్తి కనుక పూర్తిగా తగ్గిపోయి వచ్చే ఏడాది నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒలింపిక్స్ నిర్వహిస్తామని యోషిరో మోరీ ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి