iDreamPost

గుడ్ న్యూస్.. ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 84 ఏళ్ల వృద్ధురాలు..

గుడ్ న్యూస్.. ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 84 ఏళ్ల వృద్ధురాలు..

కరోనా వైరస్ సోకిన వారు సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు అని 84 ఏళ్ల వృద్దురాలు మరో సారి రుజువు చేసింది. అదేసమయంలో అవగాహనా లేమి, నిర్లక్ష్యం గా ఉంటే కరోనా వైరస్ యువకులు అయినా బలి తీసుకుంటుందని ఆమె కుమారుడి మరణం హెచ్చరిస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఒకే కుటుంబంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిందని గుర్తించడం, చికిత్స తీసుకోవడం ఆలస్యం కావడంతో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా..అతని తల్లి, కుమారుడు కు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే చికిత్స తీసుకునేందుకు సదరు 84 ఏళ్ల వృద్ధురాలు నిరాకరించింది. వైరస్, చికిత్స పై అవగాహన కల్పించిన వైద్యులు ఆమెలో మనో ధైర్యాన్ని నింపారు. దీంతో చికిత్స తీసుకుని వృద్దురాలు అంగీకరించింది. గత నెల 5వ తేదీన అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స ప్రారంభమైంది. 16 రోజుల చికిత్స అనంతరం 84 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవడు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా వైరస్ పై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే సమస్యగా మారుతోంది. వైరస్ సోకడం అనేది ప్రజలు అవమానంగా భావిస్తున్నారు. అందుకే కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నా కూడా బయటకు చెప్పడం లేదు. సమాజం కూడా వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపుతున్నట్లు గా ప్రవర్తిస్తోంది. ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ సోకిన వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు దీనికి బలి కావాల్సి వస్తోంది. దేశాలను ఏలే పాలకుల నుంచి సామాన్యుల వరకూ ఈ వైరస్ సోకుతుందన్న విషయం అందరూ గమనించాలి. శస్వీయ నియంత్రణ, సకాలంలో పరీక్షలు, చికిత్స తీసుకుంటేనే వైరస్ ను కట్టడి చేయగలమని తెలుసుకోవాలి. లేదంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి రోజులు, నెలలు కూడా ఉండే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి