iDreamPost

ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలంటున్న నిమ్మగడ్డ.. అప్పటి వరకు ఆగాలంటున్న పంచాయతీ రాజ్‌ శాఖ..

ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలంటున్న నిమ్మగడ్డ.. అప్పటి వరకు ఆగాలంటున్న పంచాయతీ రాజ్‌ శాఖ..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీఠముడి వీడడం లేదు. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటించారు. రేపు తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రకటించారు. గతంలో ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరిన అధికారులను పక్కనపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో సమావేశమవడానికి సిద్ధమైనా.. వివిధ కారణాలతో వారు గౌర్హాజరయ్యారు. అవసరమైన సమాచారాన్ని నోట్‌ రూపంలో అందిస్తామని చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సమావేశానికి హాజరు కాకపోతే.. చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించారు. ఆయన ఇచ్చిన సమయం ముగిసింది. అధికారులతో సమావేశం జరగలేదు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరిణామాలు జరిగాయి.

ఆదేశాలు పాటించాలంటున్న నిమ్మగడ్డ..

తమకు వ్యాక్సిన్‌ ఇచ్చే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టలేమని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. తమ ఆందోళనను ఎస్‌ఈసీని కలసి నివేదించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలసి తమ గోడును వెల్లబోసుకున్నారు. వ్యాక్సిన్‌ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయినా ఎన్నికలు నిర్వహించేందుకే నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. అధికారులు ఎస్‌ఈసీకి సహకరించాలని స్పష్టం చేస్తున్నారు. ఎస్‌ఈసీకి ఉన్న అధికారాలను గుర్తు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలనే తనకు ఉంటాయని చెబుతూ.. తన ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏ స్థాయి అధికారులపైన అయినా చర్యలు తప్పవంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని చెబుతున్నారు. కోడ్‌ను అమలు చేయాలని ఆదేశిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే.. ఉపేక్షించబోమంటూ హెచ్చరిస్తున్నారు.

అప్పటి వరకు ఆగండి..

కాగా, పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఓ నోట్‌ను పంపింది. ఎన్నికల నిర్వహణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఒకే సారి సాధ్యం కాదని పేర్కొంది. ఎన్నికలు తప్పని సరైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆగిపోతుందని తెలిపింది. కనీసం ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు అయినా వ్యాక్సిన్‌ ఇచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని తెలిపింది. ఎన్నికల వ్యవహారంపై సుప్రిం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, దానిపై తీర్పు వచ్చే వరకు ఆగాలని ఆ నోట్‌లో పంచాయతీ రాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ దివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి