iDreamPost

ఆంధ్రులకు గేట్లు మూసేసిన ఒడిశా

ఆంధ్రులకు గేట్లు మూసేసిన ఒడిశా

ఆ ప్రాంతాలు పేరుకు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ.. అక్కడి ప్రజల అనుబంధాలు, అభిమానాలు విడదీయలేనంతగా పెనవేసుకున్నాయి. తరతరాలుగా బంధుత్వాలు, స్నేహబంధాలు, వ్యాపార సంబంధాలతో నిరంతరం రెండు వైపులా రాకపోకలతో కళకళలాడే ఈ సరిహద్దు ప్రాంతాలను ఇప్పుడు ఆంక్షల గేట్లు
వెలవెలబోయేలా చేస్తున్నాయి. కరోనా మహమ్మారి వారి సంబంధాలకు బ్రేకులు వేస్తోంది. ఒడిశా సరిహద్దులకు ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిస్థితి ఇది. ఈ మూడు జిల్లాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఒడిశా ప్రభుత్వం ఆంధ్రతో తనకున్న సరిహద్దులను మూసేసింది. రాకపోకలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.

నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే..

ఇటు ఆంధ్ర, అటు ఒడిశాలోనూ కొన్నాళ్లుగా కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. దాంతో ఒడిశా ప్రభుత్వం అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఆ రాష్ట్రంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులున్న జిల్లాల్లో సాయంత్రం 6 నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో వారాంతపు లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. సరకు రవాణా, ఇతర వాహనాల డ్రైవర్లకు పరీక్షలు చేసిగానీ అనుమతించడం లేదు. ఇక కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ గానీ, టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్ గానీ చూపించే ప్రయాణికులకే రాష్ట్రంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. అవి చూపించినా కూడా 14 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేశారు.

అన్నీ బంద్…

ఒడిశా విధించిన కఠిన ఆంక్షలతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, భామిని, ఇచ్చాపురం ప్రాంతాలు.. విజయనగరం జిల్లాలో సాలూరు, పార్వతీపురం ప్రాంతాలు.. విశాఖ జిల్లాలో సీలేరు ప్రాంతాలు ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి. తరతరాలుగా ఈ ప్రాంతాలవారు ఒడిశా ప్రాంతాల్లో వ్యాపార, ఇతరత్రా అవసరాలకు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాల రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. కోవిడ్ పరిస్థితుల్లో వీటిని నియంత్రించేందుకు రాయగడ, పర్లాఖిమిడి, గిరిసోల, మల్కన్ గిరి సరిహద్దుల్లో ఒడిశా అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్థాయి అధికారులే స్వయంగా రాకపోకల నియంత్రణను పర్యవేక్షిస్తున్నారు. ఇదే విషయమై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ స్పందిస్తూ.. అంతర్రాష్ట్ర రాకపోకలపై కేంద్రం ఎటువంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయలేదని.. అయితే ఒడిశా ప్రభుత్వం తనంతట తనే ఆంక్షలు అమలు చేస్తోందని చెప్పారు.

Also Read : నియంత్రణ మీ చేతిలో లేదు ముఖ్యమంత్రి గారు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి