iDreamPost

మ‌ల్ల‌యోధుడిగా ఎన్టీఆర్‌ – Nostalgia

మ‌ల్ల‌యోధుడిగా ఎన్టీఆర్‌ – Nostalgia

పెంపుడు కూతురు (1963) సినిమాలో ఎన్టీఆర్ కుస్తీ ప‌హిల్వాన్‌గా క‌నిపిస్తారు. డూప్ లేకుండా గోదాలో కుస్తీ చేశారు. నిజంగానే ఎన్టీఆర్ బాడీ బిల్డ‌ర్‌లాగే ఉంటాడు.

ఆ రోజుల్లో హీరోలు క‌థ‌ని , త‌మ పాత్ర‌ని న‌మ్మి సినిమా చేసేవాళ్లు. హీరోయిజం చూసుకునే వాళ్లు కాదు. అందుకే ANR మిస్స‌మ్మ‌లో క‌మెడియ‌న్‌గా వేసాడు. భీష్మలో ఎన్టీఆర్ ముస‌లి పాత్ర చేసాడు. ఇప్ప‌టిలా భేష‌జాలు లేవు కాబ‌ట్టే వాళ్లు వంద‌ల సినిమాలు చేశారు.

పెంపుడు కూతురులో టైటిల్ రోల్ దేవిక‌ది. ఆమె అన్న ఎన్టీఆర్‌. తండ్రితో క‌ల‌సి పేకాట అడ‌డం, బాధ్య‌త లేకుండా తిర‌గ‌డం. ఒక ర‌కంగా స‌గం సినిమా నెగ‌టివ్ రోల్‌. తండ్రిని , అన్న‌ని దేవిక ఉద్యోగం చేసి పోషిస్తూ ఉంటుంది. వీళ్లు వాళ్ల ఉద్యోగం ఊడిపోయేలా చేసి జైలుపాలవుతే, ఒక ముస‌లివాన్ని పెళ్లి చేసుకోడానికి సిద్ధ‌ప‌డి వీళ్లు జైలుకు వెళ్ల‌కుండా చూస్తుంది. చివ‌రికి త‌న‌ని ప్రేమించిన హ‌ర‌నాథ్‌ని చేసుకుంటుంది.

హీరోయిన్‌గా షావుకారు జాన‌కి. ఆమెకి ఎన్టీఆర్ అంటే అస‌హ్యం. మ‌ధ్య‌లో ఆమెకి క‌ళ్లు పోతాయి. మూగ‌వాడిగా న‌టించి హీరో ఆమెని పెండ్లి చేసుకుంటాడు. నిజం తెలిసి ఇంకా ద్వేషిస్తుంది. త‌ర్వాత క‌ళ్లు లేని హీరోయిన్‌, ఆమెకి సేవ‌లు చేసే అంశంతో చాలా సినిమాలు వ‌చ్చి హిట్ కూడా అయ్యాయి.

రేలంగి , ర‌మ‌ణారెడ్డి, బాల‌కృష్ణ ఉన్నా పెద్ద‌గా కామెడీ లేదు. పాట‌లు చాలా ఉన్నా ఒక్క హిట్ సాంగ్ కూడా లేదు. దేవిక , హ‌ర‌నాథ్‌ల మ‌ధ్య ఒక పాట‌ని హంపీ, తుంగ‌భ‌ద్ర డ్యాం వ‌ద్ద తీశారు.

షావుకారు జాన‌కి త‌ర్వాత మంచిమ‌న‌సులులో కూడా అంధురాలిగా న‌టించింది.
చెల్లెలిగా వేసిన దేవిక , త‌ర్వాత ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్‌తో హీరోయిన్‌గా న‌టించ‌డం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి