iDreamPost

మూడక్షరాల నట సమ్మోహనశక్తి ‘NTR’

మూడక్షరాల నట సమ్మోహనశక్తి  ‘NTR’

కృష్ణుడంటే ఎలా ఉంటాడు ?

రాముడు తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా ?

సుయోధనుడి రూపం ఎప్పుడు చూడలేదే. ఎలా ?

కర్ణుడి గురించి పుస్తకాల్లోనే చదివాము. నిజంగా కనిపిస్తే ?

ముక్కంటి శివుడికి మాట వస్తే, మన మధ్యలో ఉంటే ?

ఇలా ఊహలకే పరిమితమైన ఎన్నో ప్రశ్నలకు 1949లో తెలుగు తెరకు పరిచయమైన ఒక నటుడు సమాధానం ఇస్తాడని ఎవరైనా ఊహించారా. నీరు, గాలి, తిండి ఎలా అయితే మనిషి జీవితంలో నిత్యకృత్యమో అలా తన హీరో పేరు కూడా జనాల జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని పదమవుతుందని మొదటి సినిమా దర్శకుడు కలగన్నాడా. ఇవన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, ఆ వ్యక్తి కాలం చేసి పాతికేళ్లకు దగ్గరగా ఉన్నా ఇప్పటికీ మరెప్పటికీ చెదిరిపోని సంతకంగా మిగిలిపోయిన ఆ మూడక్షరాలు NTR. కోట్లాది అభిమానులు తమ గుండెల్లో నిత్యం పూజించే తారక మంత్రం నందమూరి తారక రామారావు.

1949లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ‘మన దేశం’తో తెరగేంట్రం చేసిన ఎన్టీఆర్ పెట్టుకున్న లక్ష్యం. ఎలాగైనా తన అకుంఠిత దీక్షతో గొప్ప నటుడిగా ఎదగాలి. నీరాజనాలు అందుకోలేకపోయిన తన గురించి నలుగురు మాట్లాడుకునేలా చరిత్ర సృష్టించాలి. కష్టనష్టాలు లెక్క చేయకూడదు. వచ్చిన అవకాశాలు వదిలిపెట్టకూడదు. అప్పటికే నాగయ్య, ఎఎన్ఆర్ లాంటి అగ్ర హీరోల పోటీని తట్టుకుని మరీ ధీటుగా నిలబడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 301 సినిమాల్లో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇప్పటికీ కృష్ణుడంటే మనసులో మెదిలేది ‘మాయాబజార్’లోని నల్లనయ్యే. కర్ణుడి కథలు చదివితే ‘దానవీరశూరకర్ణ’ గుర్తుకు రాక మానదు. శివరాత్రి నాడు ‘దక్షయజ్ఞం’ సినిమా చూడకుండా జాగారం పూర్తి చేయని వారు లక్షల్లో ఉంటారు. పౌరాణికం, ఇతిహాసం, చారిత్రాత్మకం, కరుణరసం, భీభత్సం, సాంఘికం ఒకటేమిటి ఎన్టీఆర్ చేయని జానర్ సినిమా చరిత్రలోనే లేదు. అందుకే ఇందరి అభిమానుల ప్రేమపాత్రుడయ్యారు. నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా అరుదైన ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్థానం గురించి చెప్పాలంటే పేజీలు పుస్తకాలు సరిపోవన్న మాట వాస్తవం.

కమర్షియల్ సినిమానూ కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. కెరీర్ మందగిస్తోందని అందరు అనుకుంటున్న సమయంలో ‘అడవి రాముడు’తో కోట్ల రూపాయల వసూళ్ళ వర్షం కురిపించడం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ‘వేటగాడు’లో మనవరాలి వయసున్న శ్రీదేవితో ఆడిపాడి టికెట్ కౌంటర్ల వద్ద జనం కొట్టుకునేలా చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే చెల్లు. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు సైతం ‘బొబ్బిలిపులి’ రూపంలో బాక్స్ ఆఫీస్ వద్ద గాండ్రించడం ఎవరికి సాధ్యం. ఆవసాన దశలోనూ ‘మేజర్ చంద్రకాంత్’ రూపంలో వయసుతో సంబంధం లేకుండా తన స్టార్ డం ని ఋజువు చేస్తూ బ్లాక్ బస్టర్ అందుకోవడం చిన్న విషయం కాదు. ఇలా ఎన్నో ఎన్నో. సినిమా పరంగానూ వ్యక్తిగతంగానూ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు. చరిత్ర ఏనాటికీ మరచిపోని ఒక మహోన్నత శక్తి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి