iDreamPost

ఇప్పుడు ముందుకు రావాల్సింది నిర్మాతలే

ఇప్పుడు ముందుకు రావాల్సింది నిర్మాతలే

మూడు నెలల తర్వాత తెరుచుకున్న థియేటర్లకు ప్రేక్షకులు మంచి స్వాగతాన్ని అందించారు. గత వారం తిమ్మరుసు, నిన్న ఎస్ఆర్ కళ్యాణమండపానికి టాక్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నా డీసెంట్ కలెక్షన్లతో వాటిని దాదాపుగా సేఫ్ సైడ్ కు తీసుకెళ్తున్నారు. ఫైనల్ రేంజ్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం కానీ మొత్తానికి ఆశించిన దాని కన్నా స్పందన చాలా ఎక్కువగా ఉంది. నిన్న సినిమా హాళ్ల దగ్గర వచ్చిన జనం, లోపల హంగామాను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఏ ఇమేజ్ లేని కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి కేవలం ట్రైలర్ ప్లస్ పాటలు తెచ్చిన హైప్ తో ఇంత వెల్కమ్ చెప్పడం అనేది అరుదుగా జరుగుతుంది.

దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే పబ్లిక్ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న ధైర్యమో లేక థర్డ్ వేవ్ రాదనే నమ్మకమో కారణం ఏదైనా తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతగా ప్రేమిస్తారో చెప్పడానికి ఇవే ప్రత్యక్ష సాక్షాలు. ఒకవేళ వీటి స్థానంలో ఏ లవ్ స్టోరీనో టక్ జగదీషో ఉంటే సీన్ ఎలా ఉండేదో వేరే చెప్పనక్కర్లేదు. అన్ని స్క్రీన్లు కిక్కిరిసిపోయేవి. కాకపోతే ట్రేడ్ ని పీడిస్తున్న సందేహం ఒక్కటే. ఈ ట్రెండ్ కేవలం శుక్ర శని ఆదివారాలకే పరిమితం అవుతుందా లేక మామూలు రోజుల్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా అని. దీనికి సమాధానం దొరకాలంటే ఇమేజ్ ఉన్న హీరో రావాల్సిందే.

ఆగస్ట్ లో ఇప్పటికే రెండో వారం గడుస్తోంది. వచ్చే 13కి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అన్నీ చిన్నవే. మరి 20కి అయినా ఎవరైనా సాహసం చేస్తారా అంటే సమాధానం దొరకడం లేదు. ఇంత జరుగుతున్నా ఓటిటి డీల్స్ మాత్రం తెరవెనుక జరగడం డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం నాటికి అన్ని భయాలకు చెక్ పడొచ్చనే నమ్మకం అందరిలోనూ లేదు. తెలుగువాడికి సినిమాతో విడదీయరాని బంధం ఉంది. అందుకే దేశంలో ఎక్కడా లేనంతగా లాక్ డౌన్ తర్వాత ఇక్కడ వారానికి అయిదారు సినిమాలు రిలీజవుతున్నాయి. తమిళంలో కూడా ఇలా జరగలేదు. ఇక ఇప్పుడు ముందుకు రావాల్సింది టాప్ ప్రొడ్యూసర్లే

Also Read : ముగ్గురు మొనగాళ్లు రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి