iDreamPost

నిర్మాతల మౌనానికి కారణం

నిర్మాతల మౌనానికి కారణం

తెలంగాణలో లాక్ డౌన్ తీసేసి నాలుగు రోజులు అవుతున్నా థియేటర్లు తెరుచుకోవడం గురించి ఎలాంటి సంకేతాలు లేవు. యాభై శాతమా లేక ఫుల్ ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చా అనే క్లారిటీ కూడా మిస్ అవుతోంది. మూవీ లవర్స్ మాత్రం ఏదైనా ప్రకటన రాకపోదా బుక్ మై షోలో టికెట్లు పెట్టకపోరా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ చిన్న సినిమాలు సైతం రిలీజ్ డేట్లను ప్రకటించేందుకు వెనుకాడుతూ ఉండటమే ఇక్కడ అసలు ట్విస్ట్. అదిగో పులి ఇదుగో తోక తరహాలో అన్నీ వచ్చేలా కనిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఎప్పుడనే భేతాళ ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.

నైజామ్ లో రూట్ క్లియర్ అయినప్పటికీ ఏపిలో ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో మధ్యాన్నం వరకే జన సంచారానికి అనుమతి ఉంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ఈ నేపథ్యంలో విడుదల తేదీలు చెప్పేసి ఇబ్బంది పడటం ఎందుకని నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. ఇంకో నెల రోజులు పరిస్థితిని విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామనే ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. పోనీ చిన్న చిత్రాలైనా ధైర్యం చేయొచ్చు కదా అంటే వాళ్లకూ ఓపెనింగ్ రావనే టెన్షన్ ఉంటుంది కదా. అందులోనూ పూర్తిగా పబ్లిక్ టాక్ మీద ఆధారపడేవి కావడంతో భయం సహజం.

వైజాగ్ లాంటి నగరాల్లో మెల్లగా థియేటర్లు తెరిచేలా ముందడుగు వేస్తున్నారు. మొన్నెప్పుడో క్రాక్ వేస్తే ఒక రోజు షో వేశాక అనుమతులు లేవని ఆపేశారు. మళ్ళీ 25 నుంచి సల్మాన్ ఖాన్ రాధేని రోజుకు రెండు ఆటల చొప్పున వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఒక్క జగదాంబ హాల్ కు మాత్రమే పరిమితమయ్యింది. మిగిలినవాళ్లు ఆ మాత్రం సాహసం కూడా చేయలేకపోతున్నారు. వకీల్ సాబ్ రీ రిలీజ్ గురించి కూడా ఏవో వార్తలు వినిపించాయి కానీ దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. మహా అంటే ఒకటి రెండు రోజులు సందడి ఉంటుందే తప్ప అంతకు మించి అదేమీ మేజిక్ చేయలేదు. మరి ఈ అనిశ్చితికి బ్రేక్ పడేది ఎప్పుడో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి