iDreamPost

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవి ఊడినట్లే..‘నా’..!?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవి ఊడినట్లే..‘నా’..!?

ఏపీలో లేఖ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలను ప్రస్తావిస్తూ రాశారని చెబుతున్న ఓ లేఖ రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నిమ్మగడ్డ మౌనం ఆశ్రయించారు తప్పా లేఖ తానే రాశానని, రాయలేదనో చెప్పారు. అయితే ఈ రోజు శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి లేఖపై వివరణ ఇచ్చారు. నిమ్మగడ్డే ఆ లేఖ రాశారని కేంద్ర హోం శాఖ కార్యదర్శి తనకు చెప్పారని కిషన్‌ రెడ్డి ధృవీకరించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది.

లేఖలో ఎస్‌ఈసీ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తే.. ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ ఆయన తన లేఖలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఏకగ్రీవాలపై గత ఎన్నికలతో పోల్చి గణాంకాలు పొందుపరిచారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర బలగాలు కావాలన్నారు. ఈ అంశాలు రాజకీయ నేతలు రాసినట్లుగా ఉన్నాయని వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలనే లేఖలో ఉండడంతో లేఖ రాయడం వెనుక అసలు ఉద్దేశం భద్రత కాదని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎస్‌ఈసీ లేఖపై మౌనం వహించినా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆ లేఖ ఎవరు రాశారో తేల్చాలని డీజీపీకి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ లేఖ ఎస్‌ఈసీనే రాస్తే.. ఆయన్ను తొలగించేందుకు తమకున్న అవకాశాలను పరిశీలిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించడంతో.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవి ఉంటుందా..? ఊడుతుందా..? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసేలా ఉన్న లేఖపై సీఎం వైఎస్‌ జగన్‌ కూడా చాలా సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో నిమ్మగడ్డ తన పదవికి ఎసరు తెచ్చుకున్నారని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి