iDreamPost

మీ వైపు చూపే వేళ్లకు సమాధానాలున్నాయా..?

మీ వైపు చూపే వేళ్లకు సమాధానాలున్నాయా..?

ఒక వేలితో ఎదుటి వారి లోపాలను ఎత్తి చూపే ముందు నాలుగు వేళ్ళు మనవైపు చూపిస్తాయన్నది లోకోక్తి. కానీ ఈ ‘ఎత్తి’ చూపే రాజకీయంలో వాళ్ళవైపు చూపించే వేళ్ళ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కొందరు. ముఖ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా తమనితాము పెద్దగా చూపించుకునే ప్రయత్నంలో కొందరు కనీస నైతికతకు కూడా దూరమవుతున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా జరిగే ఇటువంటి ప్రచారంలో ఆరోపణలు చేస్తున్నవారి విశ్వసనీయతతో ఏ మాత్రం సంబంధం లేకుండా మైకు ముందుంటే చాలు నోటికొనట్లు మాట్లాడేయడమే లక్ష్యంగా మారుతోంది.

ఇటీవలే రాజమహేంద్రవరంలో ఒక ఎన్జీవో నిర్వాహకుడు కరోనా సమయంలో ప్రభుత్వం ఏం చేయలేదని, అన్నీ స్వచ్ఛంధ సంస్థలే చేసాయని, తనకు తానుగా పాతికలక్షల రూపాయలు ఖర్చుపెట్టేసానని మైకు ముందుకొచ్చేసాడు. ఇటువంటి అదను కోసమే కాచుక్కూర్చున సీయం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకులు కొందరు దానిని వైరల్‌ చేసే ప్రయత్నాల్లో తలమునకలైపోయారు. ఇటువంటి ఆరోపణలు చేస్తున్న వ్యక్తి విశ్వసనీయత ఏంటన్నది ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలాంటి ప్రచార చర్యలకు దిగడం సామాన్య జనం గుర్తించనది కాదు. కానీ తాత్కాలికంగా తమది పైచేయి అయ్యిందని అల్ప సంతోషం పొందడం తప్పితే, ప్రజల్లో పలుచన కావడం తథ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఆరోపణలు చేసిన వ్యక్తులు విశ్వసనీయత, వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల లక్ష్యం, నిజాయితీలు సోషల్‌ మీడియాలో తెలియకపోవచ్చుగానీ, సదరు వ్యక్తులకు చుట్టుపక్కలున్నవారికి తెలియంది కాదు. ఇవేవీ ఇటువంటి వాఖ్యల్ని విస్తృత ప్రచారం చేసేవారికి తెలియకకాదు. కానీ వారి లక్ష్యం వేరేగనుక కొనసాగిస్తూ ఉంటారు అంతే.

ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే.. ఒక వేళ ఎన్జీవోలు మాత్రమే చేసుంటే ఇతర సంస్థలకు లేని ప్రచారార్భాటం వీరికి మాత్రమే ఎందుకు అన్నదే ఇక్కడి ప్రశ్న. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర కాపుకార్పొరేషన్‌ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్, రాజమహేంద్రవరం రూరల్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆకుల వీర్రాజు, సిటీ సమన్వయ కర్త శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యంలు స్వయంగా లక్షలాది రూపాయలు వెచ్చించి లాక్‌డౌన్‌ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీరి స్ఫూర్తితో గ్రామస్థాయిలో వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా తమతమ గ్రామాల్లో అనేకానేక కార్యక్రమాలు నిర్వహించి పేదలకు ఇబ్బందుల్లేకుండా తమతమ శక్తిమేరకు కృషి చేసారు.

పలు కార్పొరేట్‌ సంస్థలు, ఇస్కాన్‌ వంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా వేలాది మందికి ఆహారం, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు అందించాయి. కానీ వీరెవరికి ప్రభుత్వం చేసిందా? లేదా? అన్న ఆలోచనే రాలేదు. ఇబ్బంది వచ్చింది.. ఆ ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్నదే లక్ష్యంగా ముందుకు కదలారు. తమకు తోచిన సాయం చేసారు, సాయం చేయగలిగేవారిలో స్ఫూర్తినింపి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఒకరిద్దరు ప్రచార యావ కలిగిన వారు మాత్రమే ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది.. స్వచ్ఛంధ సంస్థల పేరిట సేవ చేయడం తప్పుకాదు గానీ, ఎదుటి వారి మీద బురదచల్లాలనుకోవడం తప్పే. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగువేళ్ళు తప్పకుండా మనవైపు చూపిస్తాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి